డీసీసీబీ... కొత్త ట్విస్ట్‌ | New Twist DCCB | Sakshi
Sakshi News home page

డీసీసీబీ... కొత్త ట్విస్ట్‌

Published Tue, Jan 17 2017 4:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

New Twist DCCB

సాక్షి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో నెల రోజులకు పైగా సాగుతున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈనెల 21న డీసీసీబీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు బ్యాంకు సీఈఓ కె.మధన్‌మోహన్‌ సోమవారం డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈనెల 21న పాలకవర్గ సమావేశం ఖరారైంది. డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ గతనెల 8న సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులతో మొదలైన రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన బ్యాంకు డైరెక్టర్లు ఎవరికి వారే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. హైకోర్టు, సహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే డీసీసీబీ నిబంధనల మేరకు 90 రోజుల్లోపు పాలకవర్గం సమావేశం జరగాలి..ఆ తర్వాత నెల గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. మొత్తానికి 120 రోజుల్లోపు సమావేశం జరగకుంటే పాలకవర్గం రద్దవుతుంది. ఆ గడువు ఈనెల 26న ముగియనుండడంతో 21న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈ సమావేశానికి చైర్మన్‌ పాండురంగారావు హాజరవుతారా.. తాత్కాలిక చైర్మన్‌ను ఎన్నుకుంటారా..పేరు సిఫారసు చేసి పంపిస్తారా.. ఏం తీర్మానం చేసి పంపుతారనే ఉత్కంఠ నెలకొంది. డీసీసీబీ చైర్మన్‌ రేసులో ఉన్నవారంతా అధికార పార్టీ∙వారే కావడంతో  రాజకీయం వేడెక్కింది.

కోర్టులు.. స్టేలు
గతనెల 8న కాపుగల్లు సొసైటీ రద్దు ఉత్తర్వులు వచ్చిన నాటి నుంచి డీసీసీబీ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లంతా కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు. తన సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ లక్ష్మీనారాయణ ఇచ్చిన ఉత్తర్వులపై చైర్మన్‌ పాండురంగారావు మరుసటి రోజే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తమ పరిధిలోనికి రాదని చెపుతూనే డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను స్టేటస్‌ కో చేస్తూ అదే నెల 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పాండురంగారావు సహకార ట్రిబ్యునల్‌కు Ððవెళ్లేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. దీంతో ఆయన మళ్లీ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. తాము చేయని తప్పుకు సొసైటీని ఎలా బాధ్యురాలిని  చేస్తారంటూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ట్రిబ్యునల్‌ను కోరారు. పాండురంగారావు వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్‌ డీసీఓ ఉత్తర్వులు సమంజసం కాదని, తహసీల్దార్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ అదే నెల 17న స్టే విధిం చింది. దీంతో పాండురంగారావుకు ఊరట లభించినట్టయింది. అయితే సహకార ట్రిబ్యునల్‌ను సవాల్‌ చేస్తూ మళ్లీ కొందరు డైరెక్టర్లు హైకోర్టుకెళ్లారు. ట్రిబ్యునల్‌ తమ వాదనలు వినకుండానే ఆదేశాలిచ్చిందని, ఆ తీర్పును నిలిపివేయాలని కోరారు. కేసు విచారించిన హైకోర్టు ఈనెల11న ట్రిబ్యునల్‌ తీర్పుపై నాలుగు వారాల పాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతోపాటు డీసీసీబీ పాలకవర్గ సమావేశం 120 రోజుల్లోపు జరగాలన్న నిబంధన మేరకు ఈనెల 21న పాలకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడేం జరుగుతుంది?
డీసీసీబీ పాలకవర్గ సమావేశం కోసం నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఇప్పుడేం జరుగుతుందన్న దానిపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సెంట్రల్‌ బ్యాంకు వర్గాల్లోనూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ సమావేశానికి చైర్మన్‌ హోదాలో పాండురంగారావు వస్తారా? లేదా సీనియర్‌ డైరెక్టర్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి సమావేశం నిర్వహిస్తారా అన్నది ట్విస్ట్‌గా మారింది. అసలు సమావేశ నోటీసును పాండురంగారావుకు పంపారా లేదా అనే విషయంపై ఆరా తీయగా... రాతపూర్వక నోటీసు పంపలేదు కానీ సమావేశం ఉంటుందనే సమాచారం ఇచ్చామని బ్యాంకు వర్గాలు చెపుతున్నాయి. సమావేశ తేదీని ఖరారు చేస్తూ చైర్మన్‌ హోదాలో పాండురంగారావు సంతకం చేశారనే అంశం కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో 21న ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఈ సమావేశానికి పాండురంగారావు హాజరు కావాలంటే మళ్లీ కోర్టు ఉత్తర్వులు రావాల్సిందనే వాదన కూడా వినిపిస్తోంది. సహకార ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై స్టే ఇస్తూ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాపుగల్లు సొసైటీ రద్దు అంశం ఉనికిలోనే ఉంటుందని, అలాంటప్పుడు పాండురంగారావు బ్యాంకు చైర్మన్‌ పదవిలో కొనసాగలేరని, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 21లోపు స్టే తెచ్చుకుంటే ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చోవచ్చని న్యాయ నిపుణులు చెపుతున్నారు. దీంతో తాజా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ పాండురంగారావు హైకోర్టు మెట్టు ఎక్కేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement