Central Co-operative Bank
-
డీసీసీబీ... కొత్త ట్విస్ట్
సాక్షి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో నెల రోజులకు పైగా సాగుతున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈనెల 21న డీసీసీబీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు బ్యాంకు సీఈఓ కె.మధన్మోహన్ సోమవారం డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈనెల 21న పాలకవర్గ సమావేశం ఖరారైంది. డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ గతనెల 8న సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులతో మొదలైన రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన బ్యాంకు డైరెక్టర్లు ఎవరికి వారే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. హైకోర్టు, సహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే డీసీసీబీ నిబంధనల మేరకు 90 రోజుల్లోపు పాలకవర్గం సమావేశం జరగాలి..ఆ తర్వాత నెల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మొత్తానికి 120 రోజుల్లోపు సమావేశం జరగకుంటే పాలకవర్గం రద్దవుతుంది. ఆ గడువు ఈనెల 26న ముగియనుండడంతో 21న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈ సమావేశానికి చైర్మన్ పాండురంగారావు హాజరవుతారా.. తాత్కాలిక చైర్మన్‌ను ఎన్నుకుంటారా..పేరు సిఫారసు చేసి పంపిస్తారా.. ఏం తీర్మానం చేసి పంపుతారనే ఉత్కంఠ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్నవారంతా అధికార పార్టీ∙వారే కావడంతో రాజకీయం వేడెక్కింది. కోర్టులు.. స్టేలు గతనెల 8న కాపుగల్లు సొసైటీ రద్దు ఉత్తర్వులు వచ్చిన నాటి నుంచి డీసీసీబీ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లంతా కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు. తన సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ లక్ష్మీనారాయణ ఇచ్చిన ఉత్తర్వులపై చైర్మన్ పాండురంగారావు మరుసటి రోజే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తమ పరిధిలోనికి రాదని చెపుతూనే డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను స్టేటస్ కో చేస్తూ అదే నెల 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పాండురంగారావు సహకార ట్రిబ్యునల్‌కు Ððవెళ్లేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. దీంతో ఆయన మళ్లీ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. తాము చేయని తప్పుకు సొసైటీని ఎలా బాధ్యురాలిని చేస్తారంటూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ట్రిబ్యునల్‌ను కోరారు. పాండురంగారావు వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ డీసీఓ ఉత్తర్వులు సమంజసం కాదని, తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ అదే నెల 17న స్టే విధిం చింది. దీంతో పాండురంగారావుకు ఊరట లభించినట్టయింది. అయితే సహకార ట్రిబ్యునల్‌ను సవాల్ చేస్తూ మళ్లీ కొందరు డైరెక్టర్లు హైకోర్టుకెళ్లారు. ట్రిబ్యునల్ తమ వాదనలు వినకుండానే ఆదేశాలిచ్చిందని, ఆ తీర్పును నిలిపివేయాలని కోరారు. కేసు విచారించిన హైకోర్టు ఈనెల11న ట్రిబ్యునల్ తీర్పుపై నాలుగు వారాల పాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతోపాటు డీసీసీబీ పాలకవర్గ సమావేశం 120 రోజుల్లోపు జరగాలన్న నిబంధన మేరకు ఈనెల 21న పాలకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? డీసీసీబీ పాలకవర్గ సమావేశం కోసం నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఇప్పుడేం జరుగుతుందన్న దానిపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సెంట్రల్ బ్యాంకు వర్గాల్లోనూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో పాండురంగారావు వస్తారా? లేదా సీనియర్ డైరెక్టర్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి సమావేశం నిర్వహిస్తారా అన్నది ట్విస్ట్‌గా మారింది. అసలు సమావేశ నోటీసును పాండురంగారావుకు పంపారా లేదా అనే విషయంపై ఆరా తీయగా... రాతపూర్వక నోటీసు పంపలేదు కానీ సమావేశం ఉంటుందనే సమాచారం ఇచ్చామని బ్యాంకు వర్గాలు చెపుతున్నాయి. సమావేశ తేదీని ఖరారు చేస్తూ చైర్మన్ హోదాలో పాండురంగారావు సంతకం చేశారనే అంశం కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో 21న ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఈ సమావేశానికి పాండురంగారావు హాజరు కావాలంటే మళ్లీ కోర్టు ఉత్తర్వులు రావాల్సిందనే వాదన కూడా వినిపిస్తోంది. సహకార ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే ఇస్తూ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాపుగల్లు సొసైటీ రద్దు అంశం ఉనికిలోనే ఉంటుందని, అలాంటప్పుడు పాండురంగారావు బ్యాంకు చైర్మన్ పదవిలో కొనసాగలేరని, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 21లోపు స్టే తెచ్చుకుంటే ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చోవచ్చని న్యాయ నిపుణులు చెపుతున్నారు. దీంతో తాజా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ పాండురంగారావు హైకోర్టు మెట్టు ఎక్కేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
లక్ష్యానికి దూరంగా సహకారం
రుణమాఫీ హామీతో ఇక్కట్లు డీసీసీబీ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.140 కోట్లు ఇచ్చిన రుణం రూ.46 కోట్లు మాత్రమే రబీ సీజన్ లక్ష్యం రూ.160 కోట్లు ఈ లక్ష్య సాధన కూడా డౌటే నెల్లూరు (అగ్రికల్చర్): ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గుదిబండగా మారింది. ‘బకాయిలు కట్టొద్దు, మేం అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ చేస్తాం’ అని బాబు చెప్పడంతో చాలా మంది రైతులు బకాయిలు చెల్లించలేదు. రుణమాఫీ అవుతుందని రైతులు ఎదురు చూస్తుండటంతో ఖరీఫ్ బకాయిలను వసూలు చేసుకోలేని పరిస్థితి డీసీసీబీకి ఏర్పడింది. రైతుల నుంచి రావాల్సిన రూ.350 కోట్ల బకాయిలు రుణమాఫీ ద్వారా రియింబర్స్ అవుతాయని బ్యాంకు అధికారులు ఆశించారు. బకాయిలు రాకపోవడంతో ఈఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని సాధించలేక పోయామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఖరీప్‌లో రూ.140 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే సీజన్ ముగిసిన సెప్టెంబర్ నాటికి కేవలం 25 వేల మంది రైతులకు రూ.46 కోట్లు మాత్రమే డీసీసీబీ రుణం ఇవ్వగలిగింది. గత ఏడాది ఖరీఫ్ లక్ష్యాలకు మించి రుణాలు ఇచ్చిన డీసీసీబీ, తాజా ఖరీఫ్‌కు ఇవ్వలేకపోవడానికి ప్రధాన కారణం రైతుల నుంచి బకాయిలు రికవరీ కాకపోవడమేనని తెలుస్తోంది. డీసీసీబీ గత ఏడాది రూ.136 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, దానికి మించి 72,905 మంది రైతులకు రూ.162 కోట్లు రుణం అందజేసింది. అదేవిధంగా 2013-14 రబీ సీజన్లో నిర్దేశించుకున్న రూ.140 కోట్ల లక్ష్యానికి గాను రూ.104 కోట్ల రుణాలను 45,006 మంది రైతులకు ఇచ్చింది. డీసీసీబీ రుణ లక్ష్యాలను సాధించడంలో గడిచిన నాలుగేళ్లుగా డీసీసీబీ మిగిలిన జాతీయ బ్యాంకులతో పోటీపడుతూ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలులో జాప్యం చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) రుణ ప్రణాళికపై పడింది. ప్రస్తుత రబీసీజన్‌లో కూడా దీని ప్రభావం పడుతుం దని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. రబీలో లక్ష్యసాధనకు కృషి: వై.సరిత, సీఈఓ, డీసీసీబీ ఖరీఫ్ సీజన్లో రుణ లక్ష్యాలను సాధించలేక పోయాం. రబీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నాం. రబీ సీజన్లో రూ.160 కోట్ల మేర రుణాలు ఇవ్వడానకి ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలోని పరపతి సంఘాల ద్వారా వరి కొనుగోలు వ్యాపారం చేపట్టి దళారీ వ్యాపారుల నుంచి రైతులను ఆదుకోవాలని నిర్ణయించాం. మద్దతు ధరతో రైతు నుంచి కొనుగోలు చేసి సమీప మిల్లర్లకు నేరుగా పంపించే విధంగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను చైతన్యవంతం చేస్తున్నాం. ఈ ఏడాది 36 సంఘాలను ఎంపిక చేసి వాటికి ఆర్థిక సహకారం అందించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. -
కోమాలో కోఆపరేటివ్లు
నిలిచిన వ్యవసాయ రుణ వసూళ్లు చంద్రబాబు హామీతో చెల్లించని రైతులు ఆదాయం లేక బ్యాంకుల్లో ఆర్థిక సంక్షోభం నాలుగు నెలలుగా జీతాల్లేని సిబ్బంది కొత్త రుణాలివ్వని కేంద్ర సహకార బ్యాంక్ ఒక్క రైతైనా గుమ్మం తొక్కడం లేదు. బకాయిలు చెల్లించడం లేదు. లావాదేవీలు జరగడం లేదు. సొరుగులో పైసా కనిపించడం లేదు. సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. కొత్త రుణాలివ్వడం లేదు. సంక్షోభాన్ని నివారించకపోతే సహకార బ్యాంకులు మూతపడక తప్పదు. తెలుగుదేశం రుణమాఫీ హామీ తీవ్రంగా నష్టపరిచింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహా సహకార బ్యాంకుల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. రీ షెడ్యూల్ చేసినా సహకార సంఘాలకు నష్టం తప్పని పరిస్థితి ఏర్పడింది. చోడవరం : రైతులకు అండగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు మూసివేత దిశగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధీనంలో ఏటా రైతులకు పంట రుణాలిస్తూ మనుగడ సాగిస్తున్న సహకార బ్యాంక్‌లు తెలుగుదేశం పార్టీ రుణమాఫీ దెబ్బకు కుదేలవుతన్నాయి. ఏటా ఖరీఫ్, రబీ పంటలకు సుమారు రూ.600 కోట్ల రుణాలిస్తూ రైతులకు అండగా ఉన్న డీసీసీబీ ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు పైసా కూడా రుణాలివ్వకపోవడం గమనార్హం. 15 శాతమే వసూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో 28 శాఖలు, 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. సుమారు లక్షకు పైగా రైతులు ఈ సంఘాలు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది వరకు రుణాల లావాదేవీలు సజావుగానే సాగాయి. వ్యవసాయ రుణాలతోపాటు వ్యవసాయనుబంధ పరికరాల కొనుగోలు, బంగారు రుణాలు కూడా ఇస్తూ ఆర్థికంగా బలపడిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, సహకార బ్యాంక్‌లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయ రుణమాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో రైతులు బకాయిలు చెల్లించడం మానేశారు. గత మార్చి నెల వరకు కేవలం 15 శాతం మాత్రమే వసూలయ్యాయి. రుణాలు మాఫీ చేస్తారని మిగతా 85 శాతం రైతులు చెల్లించలేదు. దీంతో వసూలు లేక ఈ ఏడాది ఖరీఫ్ రుణాలు కూడా డీసీసీబీ ఇవ్వలేదు. రీషెడ్యూల్ చేసినా చెల్లింపు అనుమానమే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోగా రీషెడ్యూలని, అదికూడా ఇంటికి ఒకటి మాత్రమే ఇస్తామని చెప్పడంపై డీసీసీబీలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒక్కొక్క ఇంటిలో సుమారు 3 నుంచి 4 రుణాలున్నాయి. వీటిలో ఒకటి, రెండు మాత్రమే రీషెడ్యూల్ చేస్తే, మిగతా రుణం రైతులు కట్టే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఒకవేళ రీషెడ్యూల్ చేసినా అయిదేళ్లు, ఏడేళ్లు అని గడువు పెడితే డీసీసీబీ నిండా మునిగిపోయే అవకాశం ఉంది. ఏటా రీసైక్లింగ్ విధానంలో నడిచే డీసీసీబీకి ఒకే సారి వందలాది రూ. కోట్లు వసూలవకపోతే సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థమవుతుంది. మరో పక్క నాలుగు నెలలుగా సహకార బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. రుణ వసూలులో 2 శాతం సిబ్బంది జీతాలకు కేటాయిస్తారు. అసలు వసూలే లేకపోవడంతో పీఏసీఎస్‌లలో సిబ్బందికి జీతాలు లేక వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే సహకార సంఘాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఇందుకో భాగంగా రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు తయారుచేసే పనిలో పీఏసీఎస్‌లు తలమునకలైనట్టు తెలిసింది. ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్న రైతులు సహకార బ్యాంక్‌లు నోటీసులు ఇచ్చేలా ఉన్నాయని తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిగా మాఫీ చేయాలి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి వరకు సహకార బ్యాంక్ రుణం ఇవ్వలేదు. అడిగితే గత ఏడాది ఖరీఫ్‌లో చౌడువాడ సొసైటీలో తీసుకున్న రూ.50 వేల రుణం తీర్చమంటున్నారు. రుణమాఫీపై ఇప్పటికీ చంద్రబాబు ఏమీ చెప్పకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ పంట పెట్టుబడులకు డబ్బుల్లేవు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. - మలిరెడ్డి నాగమయ్య, రైతు, గుల్లేపల్లి జీతాల్లేక సిబ్బంది యాతన రుణమాఫీపై ప్రభుత్వం ఏదోఒకటి వెంటనే తేల్చాలి. వసూల్లేక నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేవు. కుటుంబాల పోషణ కష్టతరంగా మారింది. దీనిపై డీసీసీబీ చైర్మన్, అధికారులు, పీఏసీఎస్ అధ్యక్షులను కూడా సంఘాల ద్వారా కలిశాం. స్వల్ప వ్యవధి రుణాల కింద కొంత సిబ్బందికి ఇవ్వడానికి అంగీకరించారు. అయినా రుణమాఫీపై ఏదో ఒకటి తేల్చకపోతే రానున్న రోజుల్లో సిబ్బంది జీతాల సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. -పైల కోటేశ్వరరావు, రాష్ట్ర సహకార సొసైటీల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త రుణాలివ్వాలి రుణమాఫీపై ప్రభుత్వం నాన్చడం వల్ల ఇటు రైతులు, అటు సొసైటీలకు చాలా నష్టం. రీషెడ్యూల్ వల్ల కూడా ఇబ్బందే. బంగార మెట్ట సొసైటీలో గత ఏడాది ఖరీఫ్‌లో రూ.40 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాను. ఆ అప్పు తీరుస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు రుణం ఇవ్వమంటే పాత అప్పుతీర్చమంటున్నారు. పూర్తిగా మాఫీ చేయకపోతే సొసైటీలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కొత్తరుణాలు వెంటనే ఇవ్వాలి. - సకలా వరహాలు. రైతు, లోపూడి. -
రుణ ‘సహకారం ఏదీ..?
రుణమాఫీపై సందిగ్ధంలో కేంద్ర సహకార బ్యాంకు - మాఫీతో 61,823 మంది రైతులకు ఊరట - ఈ యేడాది ఐదు శాతం కూడా రుణాలివ్వని వైనం కలెక్టరేట్ : రైతు శ్రేయస్సు కోసం సహాయం అందించాల్సి న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయించడం తప్ప రుణాలు అందించడం లేదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందించాల్సిన సంఘాల సాయం అందకుండా పో తోంది. సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉన్నా వారికి అందని ద్రాక్షలా మారాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐ దు శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని బ్యాంకు అధికారులు పేర్కొం టున్నారు. రుణమాఫీ వర్తిస్తుందా.. లేదా.? ఎవరికి వర్తిస్తుంది..? అనే దానిపై స్పష్టత లేక సహకార బ్యాం కు సందిగ్ధంలో పడింది. గతేడాది ఖరీఫ్ రుణ ల క్ష్యంతో పోల్చుకుంటే ఈసారి ఐదు శాతం కూడా రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా సొసైటీలు విత్తనాలు, ఎరువులను విక్రయించడం తప్ప రైతులకు రుణ సాయంలో చేయూతనిచ్చినట్లు కన్పించడం లేదు. రుణం మాఫీతో 61,823 మందికి ఊరట.. జిల్లాలో 77 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 60 సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోకి వస్తాయి. 60 సంఘాల్లో 1,80,408 మంది రైతులు సభ్యులు ఉన్నారు. ఇందులో 61,823 మంది పంట రుణాలు తీసుకున్నారు. మిగతా 1,18,585 మంది పంట రుణాలు తీసుకోలేదు. అయితే.. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ. 251 కోట్ల పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్లో 61,823 మంది రైతులకు రూ.156.17 కోట్లు రుణాలు ఇచ్చారు. రబీ సీజన్లో 53,458 మంది రైతులకు రూ.135.04 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. మొత్తం రూ.291.21 కోట్ల రుణాలను ఖరీఫ్, రబీ సీజన్లలో పంపిణీ చేసి లక్ష్యం చేరుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ వర్తిస్తే జిల్లాలోని 61,823 మంది రైతులకు ఊరట లభిస్తుంది. కాగా, గతేడాది ఖరీఫ్ సీజన్లో ఇచ్చిన పంట రుణాలతో పోల్చుకుంటే ఈ యేడాది పంట రుణాలు చాలా వరకు తగ్గాయి. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ. 2.50 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. ఈ సారి రుణమాఫీ ఉంటుందనే ఆశతో రైతులు తీసుకున్న రుణాలు కట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల వస్తేనే ఈ విషయంలో ప్రశ్నలు తొలగిపోయే అవకాశం ఉంది. దృష్టి సారించని ప్రతినిధులు.. గ్రామాల్లో ఉన్న వ్యవసాయ పరపతి సంఘాలను ఆదుకునే దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో రైతులను సహకార సంఘాలు ఆదుకోలేకపోతున్నాయి. ప్యాకేజీల ద్వారా సంఘాలకు పునరుజ్జీవనం పోయాలన్న ఆలోచనే ప్రతినిధులకు లేకుండా పోయింది. జిల్లాలో 77 సంఘాలకు గాను 34 సంఘాలే ఈ యేడాది ఖరీఫ్‌లో సోయా విత్తనాలను పంపిణీ చేశాయి.