కోమాలో కోఆపరేటివ్‌లు
- నిలిచిన వ్యవసాయ రుణ వసూళ్లు
- చంద్రబాబు హామీతో చెల్లించని రైతులు
- ఆదాయం లేక బ్యాంకుల్లో ఆర్థిక సంక్షోభం
- నాలుగు నెలలుగా జీతాల్లేని సిబ్బంది
- కొత్త రుణాలివ్వని కేంద్ర సహకార బ్యాంక్
ఒక్క రైతైనా గుమ్మం తొక్కడం లేదు. బకాయిలు చెల్లించడం లేదు. లావాదేవీలు జరగడం లేదు. సొరుగులో పైసా కనిపించడం లేదు. సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. కొత్త రుణాలివ్వడం లేదు. సంక్షోభాన్ని నివారించకపోతే సహకార బ్యాంకులు మూతపడక తప్పదు. తెలుగుదేశం రుణమాఫీ హామీ తీవ్రంగా నష్టపరిచింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహా సహకార బ్యాంకుల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. రీ షెడ్యూల్ చేసినా సహకార సంఘాలకు నష్టం తప్పని పరిస్థితి ఏర్పడింది.
చోడవరం : రైతులకు అండగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు మూసివేత దిశగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధీనంలో ఏటా రైతులకు పంట రుణాలిస్తూ మనుగడ సాగిస్తున్న సహకార బ్యాంక్‌లు తెలుగుదేశం పార్టీ రుణమాఫీ దెబ్బకు కుదేలవుతన్నాయి. ఏటా ఖరీఫ్, రబీ పంటలకు సుమారు రూ.600 కోట్ల రుణాలిస్తూ రైతులకు అండగా ఉన్న డీసీసీబీ ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు పైసా కూడా రుణాలివ్వకపోవడం గమనార్హం.
15 శాతమే వసూలు
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో 28 శాఖలు, 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. సుమారు లక్షకు పైగా రైతులు ఈ సంఘాలు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది వరకు రుణాల లావాదేవీలు సజావుగానే సాగాయి. వ్యవసాయ రుణాలతోపాటు వ్యవసాయనుబంధ పరికరాల కొనుగోలు, బంగారు రుణాలు కూడా ఇస్తూ ఆర్థికంగా బలపడిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, సహకార బ్యాంక్‌లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి.
వ్యవసాయ రుణమాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో రైతులు బకాయిలు చెల్లించడం మానేశారు. గత మార్చి నెల వరకు కేవలం 15 శాతం మాత్రమే వసూలయ్యాయి. రుణాలు మాఫీ చేస్తారని మిగతా 85 శాతం రైతులు చెల్లించలేదు. దీంతో వసూలు లేక ఈ ఏడాది ఖరీఫ్ రుణాలు కూడా డీసీసీబీ ఇవ్వలేదు.
రీషెడ్యూల్ చేసినా చెల్లింపు అనుమానమే
అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోగా రీషెడ్యూలని, అదికూడా ఇంటికి ఒకటి మాత్రమే ఇస్తామని చెప్పడంపై డీసీసీబీలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒక్కొక్క ఇంటిలో సుమారు 3 నుంచి 4 రుణాలున్నాయి. వీటిలో ఒకటి, రెండు మాత్రమే రీషెడ్యూల్ చేస్తే, మిగతా రుణం రైతులు కట్టే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఒకవేళ రీషెడ్యూల్ చేసినా అయిదేళ్లు, ఏడేళ్లు అని గడువు పెడితే డీసీసీబీ నిండా మునిగిపోయే అవకాశం ఉంది. ఏటా రీసైక్లింగ్ విధానంలో నడిచే డీసీసీబీకి ఒకే సారి వందలాది రూ. కోట్లు వసూలవకపోతే సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థమవుతుంది.
మరో పక్క నాలుగు నెలలుగా సహకార బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. రుణ వసూలులో 2 శాతం సిబ్బంది జీతాలకు కేటాయిస్తారు. అసలు వసూలే లేకపోవడంతో పీఏసీఎస్‌లలో సిబ్బందికి జీతాలు లేక వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే సహకార సంఘాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఇందుకో భాగంగా రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు తయారుచేసే పనిలో పీఏసీఎస్‌లు తలమునకలైనట్టు తెలిసింది. ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్న రైతులు సహకార బ్యాంక్‌లు నోటీసులు ఇచ్చేలా ఉన్నాయని తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు.
పూర్తిగా మాఫీ చేయాలి
ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి వరకు సహకార బ్యాంక్ రుణం ఇవ్వలేదు. అడిగితే గత ఏడాది ఖరీఫ్‌లో చౌడువాడ సొసైటీలో తీసుకున్న రూ.50 వేల రుణం తీర్చమంటున్నారు. రుణమాఫీపై ఇప్పటికీ చంద్రబాబు ఏమీ చెప్పకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ పంట పెట్టుబడులకు డబ్బుల్లేవు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి.
- మలిరెడ్డి నాగమయ్య, రైతు, గుల్లేపల్లి
జీతాల్లేక సిబ్బంది యాతన
రుణమాఫీపై ప్రభుత్వం ఏదోఒకటి వెంటనే తేల్చాలి. వసూల్లేక నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేవు. కుటుంబాల పోషణ కష్టతరంగా మారింది. దీనిపై డీసీసీబీ చైర్మన్, అధికారులు, పీఏసీఎస్ అధ్యక్షులను కూడా సంఘాల ద్వారా కలిశాం. స్వల్ప వ్యవధి రుణాల కింద కొంత సిబ్బందికి ఇవ్వడానికి అంగీకరించారు. అయినా రుణమాఫీపై ఏదో ఒకటి తేల్చకపోతే రానున్న రోజుల్లో సిబ్బంది జీతాల సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది.
-పైల కోటేశ్వరరావు, రాష్ట్ర సహకార సొసైటీల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కొత్త రుణాలివ్వాలి
రుణమాఫీపై ప్రభుత్వం నాన్చడం వల్ల ఇటు రైతులు, అటు సొసైటీలకు చాలా నష్టం. రీషెడ్యూల్ వల్ల కూడా ఇబ్బందే. బంగార మెట్ట సొసైటీలో గత ఏడాది ఖరీఫ్‌లో రూ.40 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాను. ఆ అప్పు తీరుస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు రుణం ఇవ్వమంటే పాత అప్పుతీర్చమంటున్నారు. పూర్తిగా మాఫీ చేయకపోతే సొసైటీలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కొత్తరుణాలు వెంటనే ఇవ్వాలి.
- సకలా వరహాలు. రైతు, లోపూడి.