లక్ష్యానికి దూరంగా సహకారం
రుణమాఫీ హామీతో ఇక్కట్లు
డీసీసీబీ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.140 కోట్లు
ఇచ్చిన రుణం రూ.46 కోట్లు మాత్రమే
రబీ సీజన్ లక్ష్యం రూ.160 కోట్లు
ఈ లక్ష్య సాధన కూడా డౌటే
నెల్లూరు (అగ్రికల్చర్): ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గుదిబండగా మారింది. ‘బకాయిలు కట్టొద్దు, మేం అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ చేస్తాం’ అని బాబు చెప్పడంతో చాలా మంది రైతులు బకాయిలు చెల్లించలేదు. రుణమాఫీ అవుతుందని రైతులు ఎదురు చూస్తుండటంతో ఖరీఫ్ బకాయిలను వసూలు చేసుకోలేని పరిస్థితి డీసీసీబీకి ఏర్పడింది. రైతుల నుంచి రావాల్సిన రూ.350 కోట్ల బకాయిలు రుణమాఫీ ద్వారా రియింబర్స్ అవుతాయని బ్యాంకు అధికారులు ఆశించారు. బకాయిలు రాకపోవడంతో ఈఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని సాధించలేక పోయామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఖరీప్‌లో రూ.140 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే సీజన్ ముగిసిన సెప్టెంబర్ నాటికి కేవలం 25 వేల మంది రైతులకు రూ.46 కోట్లు మాత్రమే డీసీసీబీ రుణం ఇవ్వగలిగింది. గత ఏడాది ఖరీఫ్ లక్ష్యాలకు మించి రుణాలు ఇచ్చిన డీసీసీబీ, తాజా ఖరీఫ్‌కు ఇవ్వలేకపోవడానికి ప్రధాన కారణం రైతుల నుంచి బకాయిలు రికవరీ కాకపోవడమేనని తెలుస్తోంది. డీసీసీబీ గత ఏడాది రూ.136 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, దానికి మించి 72,905 మంది రైతులకు రూ.162 కోట్లు రుణం అందజేసింది. అదేవిధంగా 2013-14 రబీ సీజన్‌లో నిర్దేశించుకున్న రూ.140 కోట్ల లక్ష్యానికి గాను రూ.104 కోట్ల రుణాలను 45,006 మంది రైతులకు ఇచ్చింది.
డీసీసీబీ రుణ లక్ష్యాలను సాధించడంలో గడిచిన నాలుగేళ్లుగా డీసీసీబీ మిగిలిన జాతీయ బ్యాంకులతో పోటీపడుతూ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలులో జాప్యం చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) రుణ ప్రణాళికపై పడింది. ప్రస్తుత రబీసీజన్‌లో కూడా దీని ప్రభావం పడుతుం దని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు.
రబీలో లక్ష్యసాధనకు కృషి: వై.సరిత, సీఈఓ, డీసీసీబీ
ఖరీఫ్ సీజన్‌లో రుణ లక్ష్యాలను సాధించలేక పోయాం. రబీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నాం. రబీ సీజన్‌లో రూ.160 కోట్ల మేర రుణాలు ఇవ్వడానకి ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలోని పరపతి సంఘాల ద్వారా వరి కొనుగోలు వ్యాపారం చేపట్టి దళారీ వ్యాపారుల నుంచి రైతులను ఆదుకోవాలని నిర్ణయించాం. మద్దతు ధరతో రైతు నుంచి కొనుగోలు చేసి సమీప మిల్లర్లకు నేరుగా పంపించే విధంగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను చైతన్యవంతం చేస్తున్నాం. ఈ ఏడాది 36 సంఘాలను ఎంపిక చేసి వాటికి ఆర్థిక సహకారం అందించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.