
సూర్యాపేట: సన్నాల కొనుగోళ్లు మొదలయ్యాయని, అందరూ ఏకకాలంలో మిల్లుల దగ్గరికిపోతే నష్టపోతారని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ వంకతో దళారులు ధర తగ్గించే ప్రమాదం ఉందన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి టోకెన్లు జారీచేస్తున్నామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పండించిన పంటకు టోకెన్ల జారీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన పంట కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులేనని, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట దిగుబడి 46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందన్నారు. అందుకు తెలంగాణ సమాజం గర్వపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment