వచ్చే ఖరీఫ్‌లో రూ.150కోట్ల పంట రుణాలు | Instead of Rs 150 crore crop loans | Sakshi
Sakshi News home page

వచ్చే ఖరీఫ్‌లో రూ.150కోట్ల పంట రుణాలు

Published Fri, Jan 17 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Instead of Rs 150 crore crop loans

మంచాల, న్యూస్‌లైన్: జిల్లాలో వచ్చే ఖరీఫ్ కోసం రూ.150 కోట్ల పంట రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా సహకార  కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) సీఈఓ రాందాస్ అన్నారు. శుక్రవారం ఆయన మంచాలలో సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు.
 
బకాయిలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈఏడాది 80శాతం బకాయిలు వసూలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 49 సంఘాలకు గాను సకాలంలో బకాయిలు చెల్లించని 27 సంఘాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. 50శాతం రికవరీ చేసిన సంఘాలకు రూ.50 కోట్లు, 75శాతం రికవరీ చేసిన సంఘాలకు అడిగినన్ని రుణాలు ఇస్తామన్నారు. గతంలో స్వల్ప కాలిక రుణాలు రూ.102 కోట్లు ఇచ్చామన్నారు. సంఘాల అభివృద్ధిలో భాగంగా స్ట్రాంగ్ గది నిర్మాణం, ఎరువుల వ్యాపారం కోసం కూడా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మంచాల సహకార సంఘం మూడేళ్లుగా దీర్ఘకాలిక రుణాలు చెల్లించడం లేదన్నారు. రూ.కోటి 53లక్షల వరకు దీర్ఘకాలిక బకాయిలు ఉన్నాయన్నారు.
 
 పంట రుణాలు రూ.4కోట్ల 82లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిలో 50శాతం రికవరీ చేస్తేనే తిరిగి కొత్తగా రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. పంట రుణాలు తీసుకున్న వారు ఈనెల 31లోపు  బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ దయాకర్‌రెడ్డి, నోడల్ అధికారి రమణ, మంచాల బ్యాంక్ సీఈఓ సీహెచ్ శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement