నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలను విచారించేందుకు కేసును సీబీసీడీకి అప్పగించాలని డీసీసీబీ బోర్డు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అక్కడ జరిగిన *18 కోట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చే వరకు వదిలిపెట్టవద్దని డెరైక్టర్లు ముక్తకంఠంతో పట్టుబట్టారు. శుక్రవారం డీసీసీబీ సమావేశ మందిరంలో ఇన్‌చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు సంబంధం ఉన్న వారు ఎంతటి హోదాలో ఉన్నా విడిచిపెట్టవద్దని తీర్మానించారు.
తొలుత ఇన్‌చార్జ్ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన పాండురంగారావును పలువురు డెరైక్టర్‌లు అభినందించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే డెరైక్టర్లు చాపల లింగయ్య, ఏర్పుల సుదర్శన్, పిల్లలమర్రి శ్రీనివాస్, హనుమయ్యలు మాట్లాడుతూ దేవరకొండలో జరిగిన అవినీతి అక్రమాలపై నాన్చుడి ధోరణికి పోకుండా వెంటనే సీబీసీఐడీ చేత విచారణ జరిపించడానికి సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విచారణలో కాలయాపన చేయడం వలన బ్యాంకుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.
నూతనంగా ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నందున నిస్పక్షపాతంగా సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఇన్‌చార్జ్ చైర్మన్ పాండురంగారావు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి హోదాలో ఉన్నా ఎవరినీ వదలిపెట్టేది లేదని, విచారణ సీబీసీఐడీతోనే జరిపించడానికి తీర్మాణనం చేస్తున్నామని తెలిపారు. నిజాన్ని నిగ్గుతేల్చేంత వరకు విడిచేది లేదని అన్నారు.
బ్యాంకుకు పూర్వ వైభవం వచ్చేలా చూస్తా : ఇన్‌చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చిన మచ్చను తొలగించి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఇన్‌చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. శుక్రవారం డీసీసీబీలో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకు అధికారులు, డెరైక్టర్ల సమష్టి సహకారంతో బ్యాంకును అన్ని విధాలుగా లాభాల బాటలో నడిపించి రైతులకు మెరుగైన సేవలు అందించనున్నామన్నారు. దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ చేత విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బ్యాంకు అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలో అధికారులు, డెరైక్టర్లతో కలిసి జిల్లాలోని అన్ని బ్రాంచ్‌లను సందర్శించి అక్కడ ఉన్న లోపాలను సవరించడానికి కృషి చేయనున్నామని తెలిపారు. బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు మాట్లాడుతూ దేవరకొండ అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించడంతో పాటు బ్యాంకులో అక్రమాలు జరిగి నట్లు వచ్చిన ఆరోపణలపై హెచ్‌ఆర్ కమిటీతో విచారణ జరిపించనున్నట్లు చెప్పారు. పాలకమండలి సహకారంతో బ్యాంకును లాభాల బాటలో నడిపించనున్నామన్నారు. విలేకరుల సమావేశంలో డెరైక్టర్లు డేగబాబు, గరిణే కోటేశ్వర్‌రావు, మిర్యాల గోవర్ధన్, గుడిపాటి వెంకటరమణ, హరియానాయక్, పీర్‌నాయక్ పాల్గొన్నారు.
దేవరకొండ కేసు సీబీసీఐడీకి
Published Sat, Jan 11 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement