సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా కలెక్టరేట్‌లో ఆ మధ్య జరిగిన అధికారుల సమీక్షలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) రీజనల్ అధికారిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను పీఏగా రమ్మంటారా’ అని మండి పడ్డారు.
♦ గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలోని ఉద్యానకళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంపై రైతులకు సమాచారం అందించలేదన్న కారణంతో అక్కడి అధికారులపై విరుచుకుపడ్డారు. అంతేనా... రైతులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు కూడా చెప్పారు.
♦ తాజాగా విజయనగరంలోని సిరిమానోత్సవం సందర్భంగా డీసీసీబీ ఎదుట అనుకోకుండా సిరిమాను ఆగడంపై ఆలయ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలన్నింటికీ కారణం వేరే ఏదో ఉందనీ... అత్తమీది కోపం దుత్తమీద చూపుతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పక్క జిల్లా నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి వల్లే ఆయనలో అసహనం పెరిగిపోతోందన్న ప్రచారం సాగుతోంది.
జిల్లాలో సమస్యలే లేవా?
సిరిమానోత్సవంలో డీసీసీబీ కార్యాలయం ఎదుట సిరిమాను ఆగడాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు లేవనెత్తిన అభ్యంతరం, అధికారులపై ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ అంశం చుట్టూ తిరిగి ఆయన హోదా కే భంగం కలిగేలా చేసింది. వాస్తవానికి జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇల్లు లేక, రేషన్ కార్డులు రాక, ప్రాజెక్టులు పూర్తికాక, రుణ మాఫీ జరగక, పింఛన్లు అందక నానా బాధలు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులకు సైతం నోచుకోక నరకం చూస్తున్నారు. అన్నిటికీ మిం చి పాలనలో కీలకమైన ప్రభుత్వ ముఖ్య విభాగాలకు అధికారులు లేరు. జిల్లాలో కీలక విభాగాలైన డీఆర్‌డీఏ, డ్వామా, మున్సిపాలిటీ, హౌసింగ్, డీపీవో, డీఎంహెచ్‌ఓ తదితర 6 శాఖల్లో అధికారులు లేక ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు. ఈ పోస్టులను భర్తీ చేసే విషయంలో కేంద్ర మంత్రి ఇంత వరకు కనీస శ్రద్ధ కనబర్చలేదనే విమర్శలు నిత్యం వినిపిస్తున్నాయి.
సిరిమాను సమస్య అంత తీవ్రమైనదా?
జిల్లా పాలన, అభివృద్ధిపై తన ముద్ర వేసుకోవాల్సిన పెద్దాయన... యాదృచ్ఛికంగానో... రహదారుల నాణ్యత లోపం కారణంగానో కొద్దిసేపు సిరిమాను నిలిచిపోవడాన్ని తీవ్రంగా పరిగణించడం జిల్లా ప్రజలను విస్మయపరుస్తోంది. దీంతో అసలు ఆయన ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణాలు ఏమిటా అని ఆరా తీసే పనిలో పడ్డారు. అసలు సిరిమాను డీసీసీబీ వద్ద ఆగిపోవడానికి మంత్రి ఆశోక్, ఇతరులు అనుమానిస్తున్న కారణాలు కాకుండా ఏర్పాట్లలో లోపాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. నగరంలో రహదారుల విస్తరణ కొన్ని నెలల క్రితం ప్రారంభించారు. అమ్మవారి పండుగకు ముందే అవి పూర్తి కావాలని నిర్దేశిం చా రు. కానీ అలా జరగలేదు. పనులు పూర్తి కాకుం డానే అమ్మవారి పండుగ రావడంతో రహదారి పనులను తాత్కాలికంగా సిద్ధం చేశారు.
రహదారుల్లో నాణ్యతాలోపం
రహదారుల్లో నాణ్యత సైతం లోపించింది. ఈ కారణంగానే డీసీసీబీ వద్దకు వెళ్ళే సరికి రహదారికి పడిన గోతిలో చక్రం దిగి సిరిమాను ఇరుసు ఇబ్బంది పెట్టింది. దానివల్ల కొంత సేపు అక్కడ సిరిమాను నిలపాల్సి వచ్చింది. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ రంగు పులిమి కేంద్ర మంత్రి దేవాదా య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులను చేయాల్సి వస్తే ముందుగా తన అనుచర గణాన్ని చేయాలి. పట్టణంలో రహదారుల విస్తరణ కాంట్రాక్టును మంత్రి అనుచరుడికే అప్పగించారు. సిరిమాను ఆగడం వెనుక రహదారుల నాణ్యతా లోపం ఉందని బయట పడితే తమ వారికి ఇబ్బంది కలుగుతుందనే ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టేసే యత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా ఎస్పీకి విన్నవించినట్లు సమాచారం.
పార్టీ అంతర్గత వ్యవహారాలే కారణం
మంత్రి ఆశోక్‌లో చిన్నచిన్న విషయాలకు అసహనం, అధికారులపై ఆగ్రహానికి పార్టీలో అంతర్గత పోరులో ఆధిపత్యం సాధించాలన్న భావనే కారణంగా తెలు స్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావును టీడీపీ అధిష్టానం నియమించిన నాటి నుంచి అశోక్ గజపతిరాజు అసంతృప్తితో ఉంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల సమీక్షలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) రీజనల్ అధికారిపై ఇదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను పీఏగా రమ్మంటారా’ అని మండి పడ్డారు. అంతకుముందు పురపాలక, వైద్య ఆరోగ్యశాఖతో పాటు పలు శాఖల అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా ఆశోక్ పనితీరుపై ఒకింత అసంతృప్తితో ఉందని చర్చ జిల్లాలో ఉంది.
బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా జిల్లా టీడీపీ పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య విభేదాల వల్ల పార్టీ చులకనవుతోందని నియోజక వర్గాలకు గ్రేడులు ఇచ్చి మరీ హెచ్చరించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తన మాట నెగ్గించుకునేందుకు , తన ఉనికిని చాటుకునేందుకు కొన్ని నెలలుగా ఆయన అప్పుడప్పుడు అధికారులపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలోనే సిరిమాను డీసీసీబీ వద్ద ఆగడాన్ని తీవ్రంగా పరగణించి అధికారులపై మండిపడ్డారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ఆయనకు మైనస్‌గా మారుతోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటుండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment