ఆమనగల్లు : పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో దుండగులు శనివారం రాత్రి దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుకవైపు ఉన్న గ్రిల్స్‌ను పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినా దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యుల కథనం మేరకు.. శనివారం రాత్రి దొంగలు స్థానిక ప్రధాన రహదారిపై ఉన్న డీసీసీబీ వెనుక వైపు నుంచి కిటికీ గ్రిల్స్‌ను తొలగించి బ్యాంకు లోపలికి ప్రవేశించారు.
పథకం ప్రకారం వారు బ్యాంకు లోపల ఉన్న సీసీ కెమెరాలను తొలగించి, ఆటోమెటిక్ అలారం వైర్‌ను కట్‌చేశారు. అనంతరం బ్యాంకు లాకర్ రూమ్‌ను తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారు తిరిగి వెళ్లారు. ఆదివారం ఉదయం బ్యాంకు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో షటిల్ ఆడేందుకు వచ్చిన యువకులు బ్యాంకు గ్రిల్స్‌ను తొలగించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ సాయికుమార్, రెండో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్యాంకు మేనేజర్ దమయంతి సమాచారం అందించడంతో ఆమె అక్కడికి చేరుకున్నారు.
బ్యాంకు తాళాలు తీసి లోపల తనిఖీలు చేయగా ఎలాంటి చోరీ జరగలేదని మేనేజర్ దమయంతి పేర్కొన్నారు. కాగా బ్యాంకు సమీపంలోని అటవీ కార్యాలయం పక్కన ఐదు కిలోల గ్యాస్ సిలిండర్, కొన్ని పరికరాలను చిత్తుకాగితాలు ఏరుకునే రాములమ్మ గుర్తించి పోలీసుల దృష్టికి తెచ్చింది. షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినప్పటికి ఎలాంటి చోరీ జరగలేదని ఆయన వివరించారు.
ఆధారాల సేకరణ
బ్యాంకులో చోరీకి సంబందించి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, జాగిలం సంఘటన స్థలం నుంచి నేరుగా బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి బ్యాంకు వద్దకు చేరింది.
ఖాతాదారుల్లో కలవరం
డీసీసీబీలో దొంగతనం సంఘటన ఆమనగల్లులో కలకలం సృష్టించింది. బ్యాంకులో చోరీ జరిగిందనే వార్త తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుకున్నారు. అయితే ఎలాంటి చోరీ జరగకపోవడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు.
డీసీసీబీలో చోరీకి విఫలయత్నం
Published Mon, Jan 12 2015 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement