సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని దేవరకొండ బ్రాంచిలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం కథ క్లైమాక్స్‌కు చేరింది. మొత్తం రూ.9.3 కోట్ల కుంభకోణంలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జిల్లా సహకార అధికారి (డీసీఓ) సెక్షన్ 51 కింద చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గత నెల 16న సహకార శాఖ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డీసీఓకు సర్క్యులర్ నంబర్ 19567/2013-సీఆర్-2 పేరిట ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లో కుంభకోణ ంతో ప్రమేయం ఉందని 51 విచారణలో తేలిన 13 మందిపై క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు 21మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల విషయంలో కలెక్టర్ అనుమతి తీసుకుని ముందుకెళ్లాలని, అదే విధంగా రిజిస్ట్రార్ నుంచి వచ్చిన సమీక్ష ఉత్తర్వులను, డీసీఓ విచారణ నివేదికను డీసీసీబీ జనరల్ బాడీ, ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నెలరోజుల్లోపు ఆమోదం పొందాలని సూచించింది. ఈ కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు అధికారాలు కట్టబెట్టింది.
అసలేం జరిగిందంటే..
దేవరకొండ బ్రాంచి పరిధిలోని దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో రైతులకు రుణాలిచ్చే విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 2010 నుంచి 2014 వరకు ఆయా సొసైటీల చైర్మన్లు, సీఈఓలు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై మొత్తం 12.33 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సహకార చట్టంలోని సెక్షన్ 51 కింద డీసీఓ విచారణ జరిపి సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నివేదిక పంపారు. ఈ నివేదికలో బోగస్ టైటిల్ డీడ్లు, నకిలీ పాసు పుస్తకాల మీద రుణాలిచ్చారని, చనిపోయిన వారికి, నివాసేతరులకు, విదేశాల్లో ఉంటున్న వారికి కూడా రుణాలు మంజూరు చేశారని నివేదికలో పేర్కొన్నారు. అసలు రుణాలు ఎవరి పేరు మీద తీసుకున్నారో వారికి తన పేరు మీద రుణం తీసుకున్నట్టు కూడా తెలియదని కూడా తేలింది. ఇందుకు బాధ్యులైన వారి పేర్లను తెలియజేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని సమీక్షించిన సహకార శాఖ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఎం.సురేందర్ ఈ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలను సిఫారసు చేస్తూ గతనెల 16న సమీక్ష ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని రకాల చర్యలకూ సిఫారసు
ఈ ఉత్తర్వుల ప్రకారం కుంభకోణంలో బా ధ్యులైన వారిపై క్రిమినల్,శాఖా పరమైన చర్య లు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ సురేందర్ జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. మొత్తం 13 మందిపై క్రిమినల్, 21 మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు. వీరినుంచి మొత్తం 9.27 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని, రికవరీ చేసే నాటికి 12 శాతం వడ్డీతో సహా రా బట్టాలని సూచించారు. అవసరమైతే ఈ కుంభకోణంలో బాధ్యులైన వారి ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి ఎలా ముందుకెళ్లాలన్నది అనుమతి తీసుకోవాలని సూచించారు. అదే వి ధంగా విచారణ నివేదికతోపాటు సమీక్ష ఉత్తర్వులను కూడా డీసీసీబీ బోర్డు మీటింగ్‌లో ఆమోదం తీసుకుని ముందుకెళ్లాలని తెలి పా రు. ఆయా సొసైటీల్లో బోగస్ రుణాలుగా తేలి న 9.27 కోట్ల రూపాయల మేర పంటరుణాల కు రుణమాఫీని కూడా వర్తింపజేయవద్దని సొ సైటీల మేనేజింగ్ కమిటీలను ఆదేశించింది.
పాస్ పుస్తకాలు తెప్పించండి..
దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ పరిధిలో అక్రమంగా రుణాలు తీసుకున్న వారి పాసు పుస్తకాలు, టైటిల్‌డీడ్లు తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయా సొసైటీల మేనేజింగ్ కమిటీలను సహకార రిజిస్ట్రార్ ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 15లోగా వీటిని తెప్పించాలని, ఆయా సొసైటీలను సమన్వయం చేసుకుని ఆయా పుస్తకాలను తెప్పించే బాధ్యతను జిల్లా సహకార అధికారి తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ప్రగతి సాధించారో పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్ల వారీగా ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికను పంపాలని సూచించారు. అదే విధంగా ఈ ఏడాది మార్చి 15లోపు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్లను స్వాధీనం చేసుకోని పక్షంలో డీసీసీబీ బ్రాంచి మేనేజర్‌తో పాటు ఆయా సొసైటీల అధ్యక్షులు, సీఈవోలను బాధ్యులను చేసి దుర్వినియోగమైన రూ.9.27 కోట్ల రూపాయలను వారి నుంచి రాబట్టాలని, క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి, సహకార రిజిస్ట్రార్ సమీక్ష ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిందే.
కుంభకోణం..రూ.9.3 కోట్లు
Published Wed, Mar 4 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement