చిన్నారిని ఢీకొన్న డీసీసీబీ చైర్మన్ కారు
Published Sun, Oct 13 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
వేల్పూరు (త ణుకు క్రైం), న్యూస్‌లైన్ :తణుకు మండలం వేల్పూరు వద్ద శనివారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నానికి చెందిన కారు ఢీకొట్టడంతో రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి కాలు నుజ్జవడంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికులు, చిన్నారి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రైతులకు నీలం తుపాను పరిహారం ఇచ్చేందుకు శనివారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వేల్పూరు సహకార సంఘానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని గ్రామం నుంచి దువ్వ వెళుతున్నారు. వేల్పూరు గ్రామానికి చెందిన కోటిపల్లి సుశీల భీమవరంలో ఉంటున్న తన మనవరాలు రెండేళ్ల చిన్నారి వైష్ణవిని తీసుకుని వేల్పూరు సెంటర్‌లో బస్సు దిగారు. రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద పండ్లు కొనుగోలు చేస్తుండగా చిన్నారి ఆమె చేయి విదిలించుకుని రోడ్డుపైకి వెళ్లింది. ఈ లోగా డీసీసీబీ చైర్మన్, ఎమ్మెల్యే కారుమూరి, వారి అనుచరుల కార్లు రోడ్డుపై వేగంగా వెళుతున్నాయి. కార్ల రాకను గమనించిన సుశీల చిన్నారి చేయి పట్టుకుని లాగింది. ఈ లోపే రత్నంకు చెందిన కారు ముందు చక్రం చిన్నారి కుడికాలి పాదంపై ఎక్కడంతో కాలు నుజ్జయ్యింది.
అయితే ఆ సమయంలో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, ఎమ్మెల్యే కారుమూరి వేరే కారులో ప్రయాణిస్తున్నారు. చిన్నారి గాయపడడాన్ని చూసిన వారు కారు ఆపి చిన్నారిని తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గన్‌మెన్‌కు చెప్పి దువ్వ వెళ్లిపోయారు. కారుమూరి గన్‌మెన్ వైష్ణవిని ఆటోలో తీసుకుని తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ప్రథమచికిత్స చేసి కాలులో రెండు రక్తనాళాలు తెగిపోయాయని స్థానికంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యంకాదని వెంటనే మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించాలని సూచించారు. మూడు గంటలలోపు శస్త్రచికిత్స చేయకపోతే మోకాలి కింది భాగం వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి చిన్నారిని తొలుత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చూపించి అక్కడి నుంచి విజయవాడ పంపించేలా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వైష్ణవి కోలుకునే వరకు వైద్యసేవలు అందిస్తామన్నారు.
Advertisement
Advertisement