డీసీసీబీ వైస్ చైర్మన్‌గా అహ్మద్‌హుసేన్
– ఏడాదిగా ఖాళీగా పదవి ఎట్టకేలకు భర్తీ
– అసంతృప్తి వ్యక్తం చేసిన కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ డైరెక్టర్లు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు వైస్ చైర్మన్‌గా వెలుగోడు మండలం మద్దూరు పీఏసీఎస్ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ ఎస్.అహ్మద్‌హుసేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి పలు పదవులు ఉండగా కేడీసీసీబీ వైస్ చైర్మన్ పదవిని కూడా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వడంపట్ల అసంతృప్తి వెల్లువెత్తుతోంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు డైరెక్టర్లు వైస్ చైర్మన్ పదవిని ఆశించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలు మండలం పంచలింగాలకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ సుధాకర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఏప్రిల్ నెల 12న వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేందుకు సహకార శాఖ రిజిస్రా్టర్ నోటిఫికేషన్ ఇచ్చినా అపుడు ఏకాభిప్రాయం లేక ఎవరు నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మ్ మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన అహ్మద్‌హుసేన్‌ను దేశం నేతలు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశం నేతల సూచనల మేరకు అహ్మద్‌హుసేన్ ఒక్కరే వైస్ చైర్మన్‌గా నామినేషన్ దాఖలు చేశారు. డైరెక్టర్ కేఈ వేమనగౌడు ప్రతిపాదించగా, మరో డైరెక్టర్ పెద్ద మారెన్న బలపరిచారు. డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పలువురు డైరెక్టర్లతో కలసి అహ్మద్‌హుసేన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి అయిన శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో అహ్మద్‌హుసేన్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీంగా ఎన్నికయినట్లుగా ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వెంటనే దేశం కార్యకర్తలు, అహ్మద్‌హుసేన్ అభిమానులు బాణ సంచా పేల్చి సందడి చేశారు. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు 2గంటల తర్వాత డిక్లరేషన్ కాపీని ఎన్నికల అధికారి అహ్మద్‌హుసేన్‌కు అందచేశారు. అనంతరం బాధ్యతలు కూడా స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికయిన అహ్మద్‌హుసేన్‌ను మాజీ మంత్రి, కేఈ ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు, పలువురు డైరెక్టర్లు, దేశం నాయకులు అభినందించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైస్ చైర్మన్ ప్రకటించారు.