'సహకార' సేవలకు బ్రేక్
'సహకార' సేవలకు బ్రేక్
Published Tue, Nov 15 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
- డిపాజిట్లు స్వీకరించరాదని
ఆర్‌బీఐ ఉత్తర్వులు
- రైతుల పడిగాపులు
ఎమ్మిగనూరు: ఆప్కాబ్ పరిధిలో డీసీసీబీ (జిల్లా సహకార పరపతి బ్యాంక్)ల్లో డిపాజిట్లు స్వీకరించరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం జిల్లాలోని 24 బ్రాంచ్‌ల్లో సేవలకు బ్రేక్ పడ్డాయి. డిపాజిట్లు చేసేందుకు వచ్చి రైతులు నిరాశ చెందారు. ఒక పక్క ఖరీఫ్ దిగుబడులు విక్రయించే కాలం, మరో పక్క బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు, లోన్లు చెల్లించే సమయం కావటంతో రైతులు కేడీసీసీ బ్యాంకుల ముందు క్యూ కట్టారు. రూ. 500, రూ. 1000 నోట్లతో బ్యాంకులకు వచ్చే రైతులను బ్యాంక్ సిబ్బంది వెనక్కి పంపించారు.
మూన్నాళ్ల ముచ్చటే..
పెద్ద నోట్ల రద్దుతో జిల్లా సహకార బ్యాంక్‌కు మూడురోజుల్లోనే రూ. 35 కోట్లు డిపాజిట్ రూపంలో చేరాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు డిసెంబర్ 31 వరకు డిపాజిట్లు స్వీకరించే వెసలుబాటు ఉంది. రైతుల బ్యాంక్‌లకు మాత్రం నోట్ల డిపాజిట్లు మూన్నాళ్ళ ముచ్చటగానే సాగింది. జిల్లాలో మొత్తం 1.12 లక్షల మంది రైతులు సహకార బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. వీరందరికీ తాము పండించిన పంట ఉత్పత్తుల సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటు రైతులకు, అటు సహకార బ్యాంక్‌ల పటిష్టతను దృష్టిలో ఉంచుకొనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే సహకార బ్యాంకుల్లో రైతులు డిపాజిట్లు చేసుకొనే వెసలు బాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా రైతులు డిపాజిట్ చేసిన మొత్తంలో వ్యవసాయఖర్చులకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలన్నా ఆయా బ్యాంక్‌లకు ప్రధాన బ్యాంక్‌లనుంచీ 1శాతం డబ్బులు కూడా ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఎమ్మిగనూరు కేడీసీసీ బ్యాంక్‌లో ఇప్పటికే రూ.2కోట్లుకుపైగా డిపాజిట్ చేస్తే మార్పిడి కోసం ఆ బ్యాంక్‌కు వచ్చిన కొత్తనోట్లు కేవలం రూ.2.5లక్షలే.
Advertisement