డీసీసీబీ మెడకు మరో ఉచ్చు!
సాక్షి ప్రతినిధి, కడప:
డీసీసీబ్యాంకుపై అవినీతి ఆరోపణల పరంపర కొనసాగుతోంది. అనధికార కార్యక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముడుపులే ధ్యేయంగా యంత్రాంగం వ్యవహరిస్తోన్న ధోరణి బహిర్గతమవుతోంది. తాజాగా జీఎం, ఆర్బిట్రేటర్‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సహకార మంత్రి ఆదేశించారు. ఆ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, డీసీఓను విచారణాదికారిగా నియమించారు. వివరాలిలా ఉన్నాయి. డీసీసీబ్యాంకు మునుపటి జీఎం వెంకటేశ్వర్లు, ఆర్బిట్రేటర్ ప్రభాకర్‌రావులపై ఆరోపణలు చేస్తూ సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. బి వెంటకట్రామిరెడ్డి, ఆర్ మణి, ఎస్ కృష్ణమూర్తి అనేవారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాల్సిందిగా సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. పరిశీలించిన స్పెషల్ సెక్రెటరీ విచారణ చేపట్టాల్సిందిగా కడప డీసీఓను ఆదేశిస్తూ జిల్లా కేంద్రానికి సిఫార్సు లేఖ పంపారు.
యథేచ్ఛగా వసూళ్ల పర్వం
డీసీసీబీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పొడిగిస్తామని జీఎం వెంకటేశ్వర్లు, ఆర్బిట్రేటర్ ప్రభాకర్‌రావులు రూ.20 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే సొసైటీల నుంచి బ్యాంకులోకి 10మందిని క్లర్కులుగా తీసుకున్నారు. వారికి చట్టవిరుద్ధంగా సర్వీసు కండీషన్లు కల్పించారని తెలిపారు. అదేవిధంగా ముగ్గురు అసిస్టెంటు మేనేజర్లను నిబంధనలకు విరుద్ధంగా మేనేజర్లుగా నియమించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సొసైటీల్లో పనిచేస్తున్న కొందరు సీఈఓలను బ్యాంకు ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పి వారి నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఆమేరకు బ్యాంకులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. ఈక్రమంలో బ్యాంకు నిబంధనలు, చట్టాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరించారని ఆరోపించారు. లంచంగా తీసుకున్న మొత్తం డీసీసీబీలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా వేశారని, ఎఫ్‌డి అకౌంటు నంబర్ 110124010025163 జీఎం వెంకటేశ్వర్లు పేరున వేసి, నామినీగా ఆర్బిట్రేటర్ ప్రభాకర్‌రావును చేర్చారని ఆరోపించారు. పై విషయాలను దర్యాప్తు చేయించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఆ మేరకు జూన్17 విచారణ చేపట్టాల్సిందిగా డీసీఓ కార్యాలయానికి సిఫార్సు లేఖ అందినట్లు తెలుస్తోంది. కాగా ఈవిషయమై డీసీఓ సుబ్బారావు వివరణ కోరగా కడప డీసీఓగా అదనపు బాధ్యతలను చూస్తున్నానని పూర్తి విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత స్పందిస్తానని తెలిపారు.