జిల్లా సహకార శాఖ కార్యాలయం
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు నిర్వహించే ఈ దఫా ఎన్నికలకు బ్రేక్ పడింది. పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్)ల పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలలు పాటు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2013లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2018 జనవరి 30తో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై రెండు నెలలుగా సందిగ్దం నెలకొంది. అయితే తాజాగా పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు చేస్తూ సర్కారు ఆదేశాలివ్వడంతో సందిగ్దానికి తెరపడింది.
ఉన్నవే కొనసాగింపు..
జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ ఒకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఒకే మార్కెటింగ్ సంఘం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించినట్‌లైతే వాటి పరిధిలోని డీసీసీబీలకు, డీసీఎంఎస్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాలకు ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఉంది. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేస్తే తప్పా.. ఎన్నికలు నిర్వహించడమనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు తప్పా.. వేరే మార్గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ రకంగా ముందడుగేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్నే మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వీటితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి.
అప్పుడు మేనేజ్‌మెంట్.. ఇప్పుడు పర్సన్ ఇన్‌చార్జి..
ఎన్నికల సమయంలో రైతులతో ఎన్నుకోబడిన పాలకవర్గాలను మేనేజ్‌మెంట్ కమిటీగా పిలుస్తారు. పదవీ కాలం ముగిసిపోయి ప్రభుత్వం పొడిగింపు చేస్తే ఆ కమిటీ అధ్యక్షుడిని పర్సన్ ఇన్‌చార్జీగా పిలవడం జరుగుతుందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే పదవీలో ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వారే ఇప్పుడు పీఏసీఎస్‌కు పర్సన్ ఇన్‌చార్జి అన్నమాట. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 పాత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు సహకార శాఖ డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు, సహకార శాఖ కార్యదర్శులు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్ల పదవీ కాలం జనవరి 30తో పూర్తయింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం తప్పని చర్యగా ఇలా చేపట్టినట్లు తెలుస్తోంది.
వివరాలు కోరిన ప్రభుత్వం..
పీఏసీఎస్ పాలక వర్గాల పనితీరుపై జిల్లా సహకార శాఖను ప్రభుత్వం వివరణ కోరింది. పీఏసీఎస్‌లకు ఉన్న పాలక వర్గాల వివరాలు, అందులోని సభ్యులు, సొసైటీ నుంచి పొందిన రుణాలు, తిరిగి రుణాలు చెల్లిస్తున్న సభ్యు ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఫారం–1, ఫా రం–2ను పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని సహకార శాఖ అధికారులను ఆదేశించింది. పాలకవర్గాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ఎవరికి పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలనే దానిపై ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని సంఘాల్లోని సభ్యులు సొసైటీ నుంచి పంట రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కట్టలేదు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఏడాది సొసైటీ నుంచి రుణాలు తీసుకుంటున్న, తిరిగి చెల్లిస్తున్న సభ్యుల వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అధికారులు ఆ వివరాల సేకరణలో తలామునకలవుతున్నారు.
పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తాం.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీకాలం పూర్తి కావడంతో వాటికి పర్సన్ ఇన్‌చార్జీలను నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు నియమించే పర్సన్ ఇన్‌చార్జీలు ఫిబ్రవరి నుంచి 3 నుంచి కొనసాగుతారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆదేశించిన కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. ఆదేశాల ప్రకారం పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తాం. – మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment