సాక్షి, అమరావతి: ‘సహకర్ సే సమృద్ధి’ అనే నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ)గా తీర్చిదిద్దేందుకు సీఎస్‌సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 వేల పీఏసీఎస్‌లను సీఎస్‌సీలుగా మార్చనుండగా, ఏపీలో ఇప్పటికే 1,810 పీఏసీఎస్‌లు అంగీకారం తెలియజేశాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించింది.
గ్రామస్థాయిలో 300కు పైగా పౌరసేవలు
యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య పౌరులతో పాటు రైతులకు 300కు పైగా వివిధరకాల పౌరసేవలను ఈ సీఎస్‌సీల ద్వారా అందించనున్నారు. రాష్ట్ర పరిధిలో 500కు పైగా పీఏసీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పీఏసీఎస్‌ల్లో కూడా దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సీఎస్‌సీలుగా మారనున్న పీఏసీఎస్‌లను పౌరులకు బ్యాంకింగ్, బీమా, పాన్ కార్డులు, రైళ్లు బస్సులు, విమానాలకు సంబంధించిన ట్రావెల్ బుకింగ్స్, ఆధార్ అప్డేట్, న్యాయ సలహాల వరకు అనేక రకాల సేవలను వన్‌స్టాప్ షాపులుగా తీర్చిదిద్దనున్నారు. పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సీఎస్‌సీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సాధనాలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.
ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ..
సీఎస్‌సీల్లో సేవలందించేందుకు వీలుగా పీఏసీఎస్‌ల సిబ్బందికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కో ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్‌సీసీటీ) ద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ పొందిన 80 మంది మాస్టర్ ట్రైనర్స్ దేశంలోని 28 రాష్ట్రాల్లోని 570 జిల్లాల్లో ఎంపిక చేసిన పీఏసీఎస్‌ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
13కోట్ల మంది రైతులకు లబ్ధి
ïపీఏసీఎస్‌లను దశల వారీగా సీఎస్‌సీలు తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. ఇప్పటికే 30వేల పీఏసీఎస్‌లను గుర్తించింది. ఈ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. సీఎస్‌సీల ద్వారా అందించే సేవలతో 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మార్పుతో అదనపు ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కానున్నాయి – డాక్టర్ ఎస్‌ఎల్‌ఎన్‌టీ శ్రీనివాస్ స్టేట్ కో–ఆర్డినేటర్, ఎన్‌సీసీటీ
Comments
Please login to add a commentAdd a comment