► డీసీసీబీ చైర్మన్‌గిరి కైవసం దిశగా టీడీపీ ఎత్తులు
► మరో ఇద్దరు డెరైక్టర్ల పదవుల రద్దుకు రంగం సిద్ధం
► ఆగమేఘాలపై నిర్ణయాలు అమలు చేస్తున్న యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప : అధికారాన్ని అడ్డుపెట్టుకుని డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కైవశం చేసుకోడానికి టీడీపీ స్క్రీన్ ప్లే, డెరైక్షన్‌లో జిల్లా కలెక్టర్ కె.వి రమణ యాక్షన్‌ను రక్తికట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసైగతో ఆగమేఘాలపై ఆదేశాలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు డెరైక్టర్లను ఆ పదవిలోంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే.. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న ఐ.తిరుపేలురెడ్డిని అధికార యంత్రాంగం అనూహ్యంగా పదవీచ్యుతున్ని చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా శరవేగంగా పావులు కదిపి ఆయన్ను పదవి నుంచి దింపారు. అధ్యక్షుడు అన్న కనీస విచక్షణ లేకుండా ఆగమేఘాలపై నిర్ణయాలను అమలు చేశారు. అదే పంధాను కొనసాగిస్తూ, సహకార శాఖ యాక్టులోని లొసుగుల ఆధారంగా మరి కొందరు డెరైక్టర్లును తొలగించేందుకు టీడీపీ నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. వారి నిర్ణయాలకు తగ్గట్టుగా అంతే వేగంగా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కింది స్థాయి సిబ్బందికి సైతం అందుకు తగ్గట్టుగానే తర్పీదు ఇచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రికార్డులను సైతం తొలగిస్తూ వారికి అనువుగా మలుచుకుంటున్నట్లు డీసీసీబీ డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. సింగిల్ విండో డెరైక్టర్‌గా ఉన్న వారిని డీసీసీబీ డెరైక్టర్‌గా నియమించవచ్చు.
అయితే ఆయా సొసైటీల పరిధిలోని అధ్యక్షుడి నేతృత్వంలో ఆ మేరకు తీర్మానం చేసి ఉండాలి. అప్పట్లో ఆ నిబంధనల మేరకే పలువురు డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. కాగా ప్రస్తుతం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన కొందరు సిఈఓలు వారికి అనుగుణంగా రికార్డులు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆమేరకు అధికారిక ఉత్తర్వులు అందుతున్నట్లు తెలుస్తోంది.
వేల్పుల, సరస్వతిపల్లె డెరైక్టర్లపై దృష్టి
డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి తిరుపేలురెడ్డిని తప్పించడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎన్ ఆంజనేయులు యాదవ్ డీసీసీబీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నేతల దృష్టి ప్రస్తుత అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, సరస్వతిపల్లె సొసైటీ నుంచి డెరైక్టర్‌గా ఎంపికైనా ఓబులేసులపై పడింది. వీరద్దరూ అప్పట్లో నిబంధనల మేరకే డీసీసీబీ డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ జిల్లా కలెక్టర్‌తో నిర్వహించిన సమావేశం అనంతరం శరవేగంగా వారిని పదవి నుంచి తప్పించేందుకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.
ఆ మేరకు ఇద్దరు డెరైక్టర్లు నిబంధనల మేరకు ఎంపిక కాలేదని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం, వారి ఫిర్యాదుపై విచారణ చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం, 24 గంటలు గడవక మునుపే ఆయా సొసైటీల పరిధిలోని సీఈఓలు రికార్డులు అధికార పార్టీకి అనుగుణంగా ఇవ్వడం చకచకా చేపట్టినట్లు సమాచారం. ఇవన్నీ కలెక్టర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజకీయ పరమైన ఈ విషయాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడి కంటే కలెక్టరే వేగంగా స్పందిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని డీసీసీబీ డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. చట్టంలోని లొసుగులను అనువుగా చూపి రికార్డులను మార్చడంలో సహకార శాఖ సిబ్బంది సైతం అండగా నిలుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందుకు కారణం జిల్లా కలెక్టర్ కెవి రమణ తెరవెనుక ఆదేశాలేనని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఆ ఇద్దరు డెరైక్టర్లను పద వి నుంచి తప్పించాల్సిందేనన్న కలెక్టర్ మౌఖిక ఆదేశాల కారణంగా అందుకు తగిన విధంగా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయమై కలెక్టర్ కెవి రమణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. వ్యక్తిగత పనిపై సెలవులో విజయవాడకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
టీడీపీ డెరైక్షన్.. కలెక్టర్ యాక్షన్!
Published Wed, Apr 22 2015 3:51 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement