అన్నదాత మెడపై బకాయి కత్తి! | former backlog knife on the neck! | Sakshi
Sakshi News home page

అన్నదాత మెడపై బకాయి కత్తి!

Published Wed, Jan 7 2015 4:18 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అన్నదాత మెడపై బకాయి కత్తి! - Sakshi

అన్నదాత మెడపై బకాయి కత్తి!

ఎల్‌టీ రుణాల వసూలుకు డీసీసీబీ ఒత్తిళ్లు    
 
బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ
ముగిసిన వన్‌టైం సెటిల్‌మెంట్ గడువు
పంటలు చేతికొస్తున్న  వేళ కర్షకులకు కష్టాలు

 
దీర్ఘకాలిక (ఎల్‌టీ) పంట రుణాల బకాయిల వసూలుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రైతులపై ఒత్తిడి తీసుకువస్తోంది. నిర్దేశించిన గడువులోగా బకాయిలు చెల్లించనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు డీసీసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. రూ.కోట్లలో ఎల్‌టీ రుణాలు పేరుకుపోవడంతో వసూలుకు ఒత్తిడి తీసుకురాక తప్పడంలేదని వారంటున్నారు. కందులు, పత్తి, వేరుశనగ, శనగ పంటలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న తరుణంలో ఈ పరిణామం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. - తాండూరు

తాండూరు: దీర్ఘకాలిక (ఎల్‌టీ) పంట రుణాలు తీసుకున్న రైతులపై బకాయి చెల్లించాలంటూ డీసీసీబీ ఒత్తిడి పెంచుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31తో వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రాయితీతో బకాయిల చెల్లింపునకు గడువు ముగియడంతో బ్యాంకు అధికారులు వసూలుకు సిద్ధమయ్యారు. తమకు కొంత గడువు ఇస్తే బకాయిలు చెల్లిస్తామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే బకాయిల వసూలుకు నోటీసులు జారీ చేసిన అధికారులు మరికొంత గడువు ఇవ్వడంపై ససేమిరా అంటుండటంతో అన్నదాతలు చిక్కుల్లో పడ్డారు. డీసీసీబీ పరిధిలో ఎల్మకన్నె, తట్టేపల్లి, యాలాల, నవాంద్గీ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ నాలుగు సంఘాల పరిధిలో 1,279 మంది రైతులు ట్రాక్టర్లు, గేదెలు, బోరు మోటార్ల కోసం ఎల్‌టీ రుణాలు తీసుకున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు 12 శాతం వడ్డీతో కలుపుకొని సుమారు రూ.6,97,50,000 బకాయిలు పేరుకుపోయాయి. వాయిదాలపై అదనంగా మరో 12 శాతం వడ్డీ వేసే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. దీంతో రైతులపై బకాయి భారం మరింత పెరగనుంది. అసలులో 35 శాతం, వడ్డీలో 35 రాయితీతో మొత్తం రైతుల్లో 162 మందికి వన్‌టైం సెటిల్‌మెంట్ కింద బకాయిలు చెల్లించేందుకు గత డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో రైతు ఎంతలేదన్న రూ.1-2లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంటలు చేతికొస్తున్న తరుణంలో అంత డబ్బు లేక గడువులోపు బకాయిలను చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీ సహా మొత్తం బకాయిలను వసూలు చేయాలని బ్యాంకు అధికారులు సన్నద్ధమయ్యారు.

ప్రత్యేకంగా సూపర్‌వైజర్ నియామకం

బకాయిల వసూలుకు ప్రత్యేకంగా ఓ సూపర్‌వైజర్‌ను కూడా నియమించనున్నారు. అతను గ్రామాల్లో పర్యటించేందుకు జీపును సైతం కేటాయించనున్నారు. మార్చి 31 వరకు బకాయిలు చెల్లించకపోతే సదరు రైతులపై కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. బకాయిల వసూలు వ్యవహారంలో అధికారులు కచ్చితంగా ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. రూ.లక్షల్లో బకాయిలను ఎలా చెల్లించాలని మథనపడుతున్నారు. కొంత గడువు ఇస్తే ఎలాగో బకాయిలు చెల్లిస్తామని.. ఈ విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement