సాక్షి, అమరావతి: సాగులోనే కాదు వ్యక్తిగత అవసరాల్లో కూడా అన్నదాతలకు బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్, సొసైటీ)ను బహుళ సేవా కేంద్రాలు (మల్టీ సర్వీసెస్ సెంటర్స్)గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వాటిలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సొసైటీని ‘వన్ స్టాప్ షాపు’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాబార్డు చేయూతతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో పనిచేసే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ల పరిధిలో 1,992 పీఏసీఎస్‌లు అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. వీటిని వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రూ.1,584.61 కోట్లతో..
వ్యవసాయ సదుపాయాల నిధి కింద రూ.1,584.61 కోట్ల నాబార్డు రుణంతో పీఏసీఎస్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సొసైటీకి కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణంగా అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రుణంలో 10 శాతం పీఏసీఎస్‌లు భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని 4 శాతం వడ్డీపై నాబార్డు అందిస్తుంది. గడువులోగా రుణాల్ని చెల్లిస్తే ఇంట్రస్ట్ సబ్‌వెన్షన్ కింద వడ్డీలో 3 శాతం సబ్సిడీ రూపంలో సొసైటీలకు తిరిగి ఇస్తారు. ఈ లెక్కన ఒక్క శాతం వడ్డీకే పీఏసీఎస్‌లకు రుణాలు అందుతాయి. తొలి దశలో రూ.659.48 కోట్లతో 1,282 పీఏసీఎస్‌ల్లోను, రెండో దశలో రూ.925.13 కోట్లతో 710 పీఏసీఎస్‌ల్లోను మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తొలివిడత పనులను 2021–22 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సొసైటీల్లో కల్పించే మౌలిక సదుపాయాలివే
పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల కింద ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులు, ప్యాకింగ్ హౌస్‌లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, రైపెనింగ్ (మగ్గించే) చాంబర్స్, కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద సేంద్రియ ఉత్పత్తులు, బయో స్టిమ్యులెంట్ ప్రొడక్షన్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక సభ్యుల అవసరాలను బట్టి అద్దె ప్రాతిపదికన అందించే లక్ష్యంతో అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రూ.కోటి నుంచి రూ.2.50 కోట్ల వరకు హైటెక్, హై వేల్యూ ఫార్మ్ పరికరాలతో హబ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఇచ్చే రుణాలపై 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ద్వారా నాబార్డుకు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment