సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు.
దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు.
అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు.
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక..
ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్‌లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment