TSCAB
-
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.ఇక, తన రాజీనామా అనంతరం రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు. సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ, నేను ఇంకా ఈ పదవిలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను. 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీలు మారారు. విశ్వాసం కోల్పోయిన చోట ఉండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. టెస్కాబ్ చైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం.గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా నేను తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నాను. తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వ విధానాలు అందరికి బాగుండేలా ఉండాలి. సహకార వ్యవస్థలో మేము రిటైర్డ్ అధికారులను పెట్టలేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఎవరికీ పదవులు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకు కొద్ది రోజుల క్రితమే టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశాస్వ తీర్మాణానికి ముందే రవీందర్ రాజీనామా చేయడం విశేషం. మరోవైపు.. రవీందర్ రావును కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, రవీందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తాను పార్టీ మారలేనని చెప్పినట్టు తెలుస్తోంది. -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి జీతం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈ మేరకు టెస్కాబ్ ఎం.డి డాక్టర్ నేతి మురళీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
టెస్కాబ్‌కు 4 జాతీయ ఉత్తమ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్ ఫ్రంటియర్ మేగజైన్ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ డాక్టర్ నేతి మురళీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సమ్మిట్ (ఎన్సీబీఎస్), ఫ్రాంటియర్స్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ (ఎఫ్సీబీఏ) నేతృత్వంలోని బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ వర్చువల్ మోడ్ పద్ధతిలో నాలుగు అవార్డులను ప్రకటించిందని వివరించారు. జాతీయ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి, ఉత్తమ హెచ్ఆర్ ఆవిష్కరణ అవార్డులను టెస్కాబ్ గెలుచుకుందన్నారు. గతంలో టెస్కాబ్ నాబార్డు ద్వారా దేశంలోనే జాతీయ అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైందని ఆయన గుర్తుచేశారు. అవార్డులను త్వరలో అందుకుంటామని వెల్లడించారు. -
డ్రాగన్ ఫ్రూట్: ఎకరానికి 6.61 లక్షల రుణం..
సాక్షి, హైదరాబాద్: చాలా కొద్దిస్థాయిలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇవ్వాలని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 500 ఎకరాల్లోనే సాగు చేస్తున్న ఈ పంటను ప్రోత్సహించేందుకు ఎకరానికి ఏకంగా రూ.6.61 లక్షల రుణం ఇవ్వాలని తీర్మానించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పంటకు రూ. 4.25 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ పంటలకు ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలపై టెస్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. సాగుఖర్చు, ఉత్పాదకత, నీటివసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. గతేడాదితో చూస్తే ఈసారి పెద్దగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరగలేదని టెస్కాబ్ వర్గాలు తెలిపాయి. గతేడాది మాదిరిగానే వరికి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.34 వేల నుంచి రూ.38 వేల వరకు ఫైనాన్స్ ఖరారు చేశారు. మొక్కజొన్న పంటకు రెండు సీజన్లకు కలిపి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు, సాగునీటి వనరులు లేనిచోట రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వనున్నారు. కందులకు సాగునీటి వనరులు ఉన్నచోట రూ.17 వేల నుంచి రూ.20 వేలకు, సాగునీటి వసతి లేనిచోట రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖరారు చేశారు. కంది ఆర్గానిక్ పంటలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు నిర్ధారించారు. పత్తికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు, పత్తి విత్తనోత్పత్తికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలు ఖరారు చేశారు. మిర్చికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు, పందిరి కూరగాయల సాగుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు. పసుపుకు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు, ఖర్జూరం సాగుకు రూ.3.9 లక్షల నుంచి రూ.4 లక్షలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ధారణ చేశారు. పూర్వ జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాలో ఒక్కరకంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని టెస్కాబ్ తెలిపింది. పరిమితి పెంచకపోవడంపై విమర్శలు.. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, పత్తి వంటి పంటలకు రుణ పరిమితి ఈసారి పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా రైతులకు సాగు ఖర్చులు పెరుగుతుంటే, పంట రుణ పరిమితి పెంచట్లేదని పేర్కొంటున్నారు. నిర్ధారించిన మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు వంతున ఖరారు చేసింది. సేంద్రియ కూరగాయలు సాగు చేస్తే ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో ఈసారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. టమాటకు ఊరట..! టమాటాకు ఈసారి రుణ పరిమితి పెంచారు. సాగునీటి కింద వేసే టమాటాకు రూ.45 వేల నుంచి రూ.48 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మిద్దె తోటలకు మొదటి దశలో రూ.9,500 నుంచి రూ.10,500, రెండో దశలో రూ.19 వేల నుంచి రూ.21 వేలు, మూడో దశలో రూ.28,500 నుంచి రూ.31,500 ఇస్తారు. గతేడాది కంటే కొంచెం పెంచారు. మెడికల్, అరోమాటిక్ ప్లాంట్స్‌కు రూ.37,500 నుంచి రూ.42,500 ఇస్తారు. ఉల్లిగడ్డకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు, పుచ్చకాయకు రూ.27 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. ఇక పశుసంవర్థక, మత్స్య రంగంలో యూనిట్ల వారీగా రుణ పరిమితులు ఖరారు చేశారు. 20 గొర్రెలు ఒక పొట్టెలును కొనుగోలు చేసుకునేందుకు రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షలు ఖరారు చేశారు. పందుల పెంపకానికి యూనిట్‌కు (3+1) రూ.43 వేలు నిర్ధారించారు. ఇక పౌల్ట్రీ ఫామ్ పెడితే బ్రాయిలర్‌కు ఒక బర్డ్‌కు రూ.150, లేయర్స్‌కు అయితే రూ.310 ఇస్తారు. డెయిరీకి ఒక పాడి ఆవు లేదా బర్రె తీసుకునేందుకు రూ.21 వేల నుంచి రూ.23 వేలు రుణం నిర్ణయించారు. రెండున్నర ఎకరాల్లో చేపల పెంపకానికి రూ.4 లక్షల రుణం ఖరారు చేశారు. -
టెస్కాబ్ చైర్మన్‌గా మళ్లీ రవీందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. హైదరాబాద్‌లోని టెస్కాబ్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, వైస్ చైర్మన్ పదవికి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. రెండు పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, విప్ భానుప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కొండూరు రవీందర్రావు టెస్కాబ్‌కు రెండోసారి ఎన్నిక కావడం గమనార్హం. -
హ్యాట్రిక్ ‘కొండూరి’..!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్‌గా రవీందర్రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు ఎన్నిక లాంఛనమే అయింది. 15 ఏళ్లుగా సహకార రంగంలో.. గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కేడీసీసీ బ్యాంక్ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు కమిటీకి రవీందర్రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు. జిల్లాకు ఆరు డైరెక్టర్ పదవులు... జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్పూర్), భూపతి సురేందర్ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్ బ్యాంక్)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్ చైర్మన్ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
నేడు టెస్కాబ్ ఎన్నికల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న జరుగనుంది. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసంహరణలో ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. ఇదిలావుంటే డీసీసీబీ చైర్మన్లంతా టెస్కాబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. -
డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు. దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు. 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక.. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. -
పంటలకు పరపతి...పెరిగిన రుణపరిమితి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీ వరి, కంది, శనగ, పెసర, మినుము, ఆయిల్ ఫామ్, టమాట, వంకాయ కూరగాయల పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెరిగింది. వరి విత్తనోత్పత్తికి ఎకరాకు రూ.45 వేలు, శ్రీ వరికి రూ. 36 వేలు, కందికి రూ. 18 వేలకు రుణ పరిమితి పెంచుతూ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈసారి కొత్తగా డ్రాగన్స్ ఫ్రూట్స్ సాగుకు రూ. 4.25 లక్షలు ఖరారు చేసింది.ఇక సేంద్రీయ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.40 వేలు ఇవ్వాలంది. రాష్ట్రంలో పండించే దాదాపు 120 రకాల పంటలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై ‘టెస్కాబ్’భారీ కసరత్తు చేసింది. ఈ నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. ఈసారి కొన్ని పంటలకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది. ఇలా మినుములు ఎకరాకు రూ. 14 వేల నుంచి రూ. 16 వేలకు, పెసరకు రూ. 13 వేల నుంచి రూ. 16 వేలకు, శనగకు రూ. 20 వేల నుంచి రూ. 22 వేల వరకు రుణ పరిమితి విధించారు. ఆయిల్‌పామ్‌కు రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ. 17 వేల నుంచి రూ. 20 వేలు వంతున ఖరారు చేసింది.ఈ తరహా కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ. 40 వేలు ఇవ్వాలంది.దీంతో ఈసారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.టమాటకు కూడా ఈసారి రుణపరిమితి పెంచారు.సాగునీటి కింద వేసే టమాటాకు రూ.40 వేల నుంచి రూ. 45 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు ఉంది.వంకాయ (విత్ మల్చింగ్‌కు) ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.45 వేలు రుణ పరిమితి ఖరారు చేశారు. పత్తికి రూ. 38 వేల వరకు... తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ. 34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ.42 వేల నుంచి రూ. 45 వేలు ఖరారు చేశారు.పత్తికి రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 25 వేల నుంచి రూ. 28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 20 వేల నుంచి రూ. 23 వేలు ఇస్తారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ. 20 వేలు చేశారు. ఇక కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.22 వేల నుంచి రూ. 27 వేలు చేశారు. సోయాబీన్‌కు రూ. 22 వేల నుంచి రూ. 24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఇస్తారు.మెడికల్, ఎరోమాటిక్ ప్లాంట్స్‌కు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు, రూఫ్ గార్డెన్‌కు దశల వారీగా తొలిసారి రూ. 9 వేల నుంచి రూ. 10 వేలు, రెండో దశలో రూ.18 వేల నుంచి రూ. 20 వేలు, మూడో దశలో రూ. 27 వేల నుంచి రూ. 30 వేలు ఇస్తారు.ఇక డ్రాగన్ ఫ్రూట్ తర్వాత అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షల రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 60 వేల నుంచి రూ. 68 వేలు చేశారు. క్యాప్సికంకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. ఉల్లిగడ్డకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచారు. -
రేపు సిరిసిల్లకు గులాబీ దళపతి
సిరిసిల్లటౌన్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు శివారు ప్రైవేటు స్థలంలో భారీబహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేస్తుండగా పనులను ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పరిశీలించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటుగా ఆయన సభాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. భారీబహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వరుసగా రెండురోజులపాటు ఆయన సిరిసిల్లకు వచ్చి సభాస్థలిని పర్యవేక్షిస్తూ..ఏర్పాట్లపై పార్టీ నేతలకు సూచనలు చేశారు. 50 వేల మందికి సరిపడా.. బైపాస్ రోడ్డులో సుమారు 20ఎకరాల ప్రైవేటు స్థలాన్ని చదును చేసి భారీస్థాయిలో వేదికను రూపొందిస్తున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలస్థాయి భారీ బహిరంగ సభ కావడం విశిష్టత చేకూరింది. ఇరు నియోజకవర్గాల ప్రజలకు అనుకూలం కావడంతో సిరిసిల్ల బైపాస్‌రోడ్డును కేసీఆర్ సభకు ఎంపిక చేశారు. సభాస్థలకి సమీపంలోనే హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సీఎం సభ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరగుతున్నాయి. సుమారు 50 వేల మంది వరకు సభకు హాజరు అవుతారని అంచనా వేసి ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ వచ్చి ఇరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించి వెళ్లనున్నారు. ఉరకలెత్తిన ఉత్సాహం.. సీఎం కేసీఆర్ సిరిసిల్లకు రానుండటంతో గులాబీ పార్టీలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మూడ్రోజులుగా సిరిసిల్ల నాయకత్వం సభ ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో సైతం కేసీఆర్ సభ తర్వాత పార్టీ ప్రచారం తారాస్థాయికి చేరి 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేశ్‌బాబు గెలుపొందారు. కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడలకు కేసీఆర్ ఇవ్వబోయే వరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
టీఆర్ఎస్ చేతికి టెస్కాబ్!
ఈ నెల 22న పాలకవర్గం ఎన్నిక మెజారిటీ డీసీసీబీలను లాగేసుకున్న అధికార పార్టీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పా టైన ‘తెలంగాణ రాష్ర్ట సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్/టీఎస్సీఏబీ) అధికార టీఆర్ఎస్ చేతికి చిక్కనుంది. రాష్ట్ర విభజనకు ముందు ‘ఆప్కాబ్’ చైర్మన్ పదవి కాంగ్రెస్ చేతిలో ఉంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన వీరారెడ్డి ఆప్కాబ్ చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత నెలరోజుల కిందటే ఆప్కాబ్ కూడా విడిపోయి రెం డు రాష్ట్రాలకు వేర్వేరుగా బ్యాంకులు ఏర్పాట య్యాయి. నెల రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన టెస్కాబ్ పాలకవర్గం ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 22 న ఎన్నిక జరపనున్నట్లు ఇప్పటికే సహకార శాఖ అధికారులు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి టీఆర్ఎస్ చేతిలో ఒక్క డీసీసీబీ కూడా లేదు. కానీ, ప్రస్తుతం మొత్తం తొమ్మిదింటికిగాను 6 డీసీసీబీలు టీఆర్ఎస్ చేతిలో ఉండడంతో సాధారణ మెజారిటీతో టెస్కాబ్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. బ్యాంకుల చైర్మన్లపై అవిశ్వాసం ప్రవేశపెడతామని ఒత్తిడి పెంచింది. దీంతో పలువురు చైర్మన్లు గులాబీ గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్ చేతిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్లు, టీడీపీకి చెందిన ఖమ్మం చైర్మన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారడానికి ససేమిరా అన్న మెదక్, రంగారెడ్డి చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి వారిని పీఠం దించేశారు. నల్లగొండపై దృష్టి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ డీసీసీబీలు మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వీటిపై కూడా గులాబీ నేతలనే కూర్చోబెట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ముందుగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ముక్తవరపు పాండురంగారావు చైర్మన్‌గా ఉన్న నల్లగొండ డీసీసీబీపై కన్నేశారు. ఇదే జిల్లా నుంచి కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత కె.జానారెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ముందు నల్లగొండపై దృష్టిసారించి నట్లు చెబుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అనుచరునిగా చానాళ్లూ ఉన్న డీసీసీబీ డెరైక్టర్ డేగబాబును చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ జిల్లా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఇక, మహబూబ్‌నగర్ చైర్మన్ వీరారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయననూ తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్‌ను మానసికంగా దెబ్బతీయాలన్న వ్యూ హంతో ఉన్నారు. వరంగల్‌కు సంబంధించి చైర్మన్ పార్టీ మారడానికి సుముఖత వ్యక్తం చేసినా, అక్క డి టీఆర్ఎస్ నేతలు అడ్డుపడినట్లు చెబుతున్నారు.