
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్ ఫ్రంటియర్ మేగజైన్ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఎండీ డాక్టర్ నేతి మురళీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సమ్మిట్ (ఎన్‌సీబీఎస్), ఫ్రాంటియర్స్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ (ఎఫ్‌సీబీఏ) నేతృత్వంలోని బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ వర్చువల్ మోడ్ పద్ధతిలో నాలుగు అవార్డులను ప్రకటించిందని వివరించారు.
జాతీయ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్‌పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి, ఉత్తమ హెచ్‌ఆర్ ఆవిష్కరణ అవార్డులను టెస్కాబ్ గెలుచుకుందన్నారు. గతంలో టెస్కాబ్ నాబార్డు ద్వారా దేశంలోనే జాతీయ అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైందని ఆయన గుర్తుచేశారు. అవార్డులను త్వరలో అందుకుంటామని వెల్లడించారు.