పంటలకు పరపతి...పెరిగిన రుణపరిమితి | TSCAB Releases Hiked Loan Rates For Crops | Sakshi
Sakshi News home page

పంటలకు పరపతి...పెరిగిన రుణపరిమితి

Published Thu, Jan 30 2020 1:35 AM | Last Updated on Thu, Jan 30 2020 1:35 AM

TSCAB Releases Hiked Loan Rates For Crops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీ వరి, కంది, శనగ, పెసర, మినుము, ఆయిల్‌ ఫామ్, టమాట, వంకాయ కూరగాయల పంటలకు రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పెరిగింది. వరి విత్తనోత్పత్తికి ఎకరాకు రూ.45 వేలు, శ్రీ వరికి రూ. 36 వేలు, కందికి రూ. 18 వేలకు రుణ పరిమితి పెంచుతూ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) నిర్ణయించింది. ఈసారి కొత్తగా డ్రాగన్స్‌ ఫ్రూట్స్‌ సాగుకు రూ. 4.25 లక్షలు ఖరారు చేసింది.ఇక సేంద్రీయ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.40 వేలు ఇవ్వాలంది. రాష్ట్రంలో పండించే దాదాపు 120 రకాల పంటలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై ‘టెస్కాబ్‌’భారీ కసరత్తు చేసింది. ఈ నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపించింది. ఈసారి కొన్ని పంటలకు మాత్రమే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెరిగింది. ఇలా మినుములు ఎకరాకు రూ. 14 వేల నుంచి రూ. 16 వేలకు, పెసరకు రూ. 13 వేల నుంచి రూ. 16 వేలకు, శనగకు రూ. 20 వేల నుంచి రూ. 22 వేల వరకు రుణ పరిమితి విధించారు. ఆయిల్‌పామ్‌కు  రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు ఉంది.

ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ. 17 వేల నుంచి రూ. 20 వేలు వంతున ఖరారు చేసింది.ఈ తరహా కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ. 40 వేలు ఇవ్వాలంది.దీంతో ఈసారి ఆర్గానిక్‌ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.టమాటకు కూడా ఈసారి రుణపరిమితి పెంచారు.సాగునీటి కింద వేసే టమాటాకు రూ.40 వేల నుంచి రూ. 45 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు ఉంది.వంకాయ (విత్‌ మల్చింగ్‌కు) ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.45 వేలు రుణ పరిమితి ఖరారు చేశారు. 

పత్తికి రూ. 38 వేల వరకు...
తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ. 34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేశారు. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ.42 వేల నుంచి రూ. 45 వేలు ఖరారు చేశారు.పత్తికి రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 25 వేల నుంచి రూ. 28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 20 వేల నుంచి రూ. 23 వేలు ఇస్తారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ. 20 వేలు చేశారు. ఇక కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.22 వేల నుంచి రూ. 27 వేలు చేశారు. సోయాబీన్‌కు రూ. 22 వేల నుంచి రూ. 24 వేలు ఇస్తారు.

సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఇస్తారు.మెడికల్, ఎరోమాటిక్‌ ప్లాంట్స్‌కు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు, రూఫ్‌ గార్డెన్‌కు దశల వారీగా తొలిసారి రూ. 9 వేల నుంచి రూ. 10 వేలు, రెండో దశలో రూ.18 వేల నుంచి రూ. 20 వేలు, మూడో దశలో రూ. 27 వేల నుంచి రూ. 30 వేలు ఇస్తారు.ఇక డ్రాగన్‌ ఫ్రూట్‌ తర్వాత అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షల రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 60 వేల నుంచి రూ. 68 వేలు చేశారు. క్యాప్సికంకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. ఉల్లిగడ్డకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement