టీఆర్‌ఎస్ చేతికి టెస్కాబ్!
ఈ నెల 22న పాలకవర్గం ఎన్నిక
మెజారిటీ డీసీసీబీలను లాగేసుకున్న అధికార పార్టీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పా టైన ‘తెలంగాణ రాష్ర్ట సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్/టీఎస్‌సీఏబీ) అధికార టీఆర్‌ఎస్ చేతికి చిక్కనుంది. రాష్ట్ర విభజనకు ముందు ‘ఆప్కాబ్’ చైర్మన్ పదవి కాంగ్రెస్ చేతిలో ఉంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన వీరారెడ్డి ఆప్కాబ్ చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత నెలరోజుల కిందటే ఆప్కాబ్ కూడా విడిపోయి రెం డు రాష్ట్రాలకు వేర్వేరుగా బ్యాంకులు ఏర్పాట య్యాయి. నెల రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన టెస్కాబ్ పాలకవర్గం ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.
ఈ నెల 22 న ఎన్నిక జరపనున్నట్లు ఇప్పటికే సహకార శాఖ అధికారులు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి టీఆర్‌ఎస్ చేతిలో ఒక్క డీసీసీబీ కూడా లేదు. కానీ, ప్రస్తుతం మొత్తం తొమ్మిదింటికిగాను 6 డీసీసీబీలు టీఆర్‌ఎస్ చేతిలో ఉండడంతో సాధారణ మెజారిటీతో టెస్కాబ్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. బ్యాంకుల చైర్మన్లపై అవిశ్వాసం ప్రవేశపెడతామని ఒత్తిడి పెంచింది. దీంతో పలువురు చైర్మన్లు గులాబీ గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్ చేతిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్లు, టీడీపీకి చెందిన ఖమ్మం చైర్మన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారడానికి ససేమిరా అన్న మెదక్, రంగారెడ్డి చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి వారిని పీఠం దించేశారు.
నల్లగొండపై దృష్టి
నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ డీసీసీబీలు మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వీటిపై కూడా గులాబీ నేతలనే కూర్చోబెట్టాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ముందుగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ముక్తవరపు పాండురంగారావు చైర్మన్‌గా ఉన్న నల్లగొండ డీసీసీబీపై కన్నేశారు. ఇదే జిల్లా నుంచి కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత కె.జానారెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ముందు నల్లగొండపై దృష్టిసారించి నట్లు చెబుతున్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అనుచరునిగా చానాళ్లూ ఉన్న డీసీసీబీ డెరైక్టర్ డేగబాబును చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ జిల్లా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఇక, మహబూబ్‌నగర్ చైర్మన్ వీరారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయననూ తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్‌ను మానసికంగా దెబ్బతీయాలన్న వ్యూ హంతో ఉన్నారు. వరంగల్‌కు సంబంధించి చైర్మన్ పార్టీ మారడానికి సుముఖత వ్యక్తం చేసినా, అక్క డి టీఆర్‌ఎస్ నేతలు అడ్డుపడినట్లు చెబుతున్నారు.