గోల్డ్‌లోన్లపై వడ్డీరేటు తగ్గింపు
- రైతునేస్తం రుణ పరిమితి రూ. 5లక్షలకు పెంపు
- 1997కు ముందటి రుణాల రికవరీ కోసం వన్‌టైమ్ సెటిల్‌మెంట్
- డీసీసీబీ బోర్డు, సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నుంచి తీసుకునే గోల్డ్‌లోన్‌లపై వడ్డీరేటును 11.50 శాతానికి తగ్గించినట్లు బ్యాంకు చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు 12 నుంచి 14శాతం వరకు వడ్డీ రేటుందని, ఇక నుంచి కామన్‌గా తగ్గించిన వడ్డీ రేటు వసూలు చేస్తామన్నారు. నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్‌లో శుక్రవారం చైర్మన్ అధ్యక్షతన డైరెక్టర్ల బోర్డు సమావేశం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. 1997కు ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు బకాయి పడిన వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణాలపై వడ్డీ అసలుకు రెండు, మూడు రెట్లు అయి ఉంటుందని చెప్పిన చైర్మన్.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు.
రైతు నేస్తం కింద ఇప్పటి వరకు సహకార సంఘాలు రూ.3లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయని, ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఎర్రగుంట్ల, రామదుర్గం,పెద్దహరివాణం, పాములపాడు రైతు సహకార సేవా సంఘాలకు సభ్యత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఇందువల్ల డీసీసీబీకి దాదాపు రూ. 11కోట్లకు పైగా డిపాజిట్లు పెరిగాయన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్.. రూపే కార్డును ఆవిష్కరించారు. 1.05 లక్షల కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని సహకార సంఘాలకు మైక్రో ఏటీఎంలు ఇస్తున్నామని, వీటి ద్వారా నగదు తీసుకోవడంతో పాటు జమ కూడా చేసుకోవచ్చన్నారు.
ఎరువుల వ్యాపారానికి అవసరమైన బ్యాంకు గ్యారంటీని కూడా ఇస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యాళ్లూరుకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఐసీడీపీ కింద జిల్లాకు రూ.126 కోట్లు విడుదలయ్యాయన్నారు. రానున్న రోజుల్లో అన్ని సహకార సంఘాలు ధాన్యం సేకరణకు ముందుకు వస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశాల్లో ఆప్కాబ్ జీఎం బాణుప్రసాద్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.