అందరి నోటా ఎయిమ్స్‌.. | AIIMS Hospital is most prestigious of telangana state | Sakshi
Sakshi News home page

 అందరి నోటా ఎయిమ్స్‌..

Published Sun, Jul 29 2018 10:45 AM | Last Updated on Mon, Sep 17 2018 5:21 PM

AIIMS Hospital is most prestigious  of telangana state - Sakshi

ఎయిమ్స్‌ ఏర్పాటు చేయనున్న నిమ్స్‌ భవన సముదాయం

అప్పుడు ఎయిమ్స్‌ సాధనకోసం పోరాటం.. ఇప్పుడు క్రెడిట్‌ కోసం కుస్తీలు..! రంగాపూర్‌ వద్దనే ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో దాని నుంచి లబ్ధి పొందేందుకు రాజకీయ పక్షాలు మళ్లీ గళం విప్పాయి. ఆ ఘనత మాదేనంటే మాదేనని.. వాదనలకు దిగాయి. 

సాక్షి,యాదాద్రి : ఎయిమ్స్‌.. రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ఇది. జిల్లాలోని బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌  కొన్నేళ్లుగా రాజకీ య పక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. వివిధ పార్టీలు ఎయిమ్స్‌ సాధనకు పోరాటాలు, పాదయాత్రలు సైతం చేశాయి. కొన్ని సందర్భాల్లో ఎయిమ్స్‌ రంగాపూర్‌ వద్ద కాదని, ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందనే ప్రచారం జరిగింది. వీట న్నింటికీ తెరదించుతూ ఎయిమ్స్‌ను రంగాపూర్‌ వద్దనే ఏర్పాటు చేస్తున్నట్లు మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించడంతో మళ్లీ ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మాదేనంటే మాదే..
జిల్లాకు ఎయిమ్స్‌ వచ్చిదంటే ఆ క్రెడిట్‌ మాదే అంటే మాదే అంటూ పోటీపడుతున్నాయి. ఎయిమ్స్‌సాధనలో తమ పాత్రను ప్రజలకు వివరిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభæజన చట్టంలో తెలంగాణ కు ఎయిమ్స్‌ను ఇవ్వాలని నిర్ణయించింది తామేనని కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా.. తమ వల్లే మం జూరైందని బీజేపీ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఓ అడుగు ముందుకేసి ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వడంతో పాటు పార్లమెంట్‌లో పోరాడిన ఘన త తమదేనని చెప్పుకుంటోంది. తమ పార్టీ కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని యు వ తెలంగాణ నేతలు గుర్తు చేస్తుండగా..  టీడీపీ, వామపక్షా>లు సైతం తమ పోరాట శైలిని వివరి స్తున్నాయి. అయితే ఎవరిప్రమేయం ఎంత ఉన్నా ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలుపడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే మంజూరైన ఎయిమ్స్‌ను ఎన్ని రోజుల్లోగా అందుబాటులోకి తెస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది.
 
ఎయిమ్స్‌ ప్రస్థానం ఇలా..
ఉమ్మడి  నల్లగొండ జిల్లా ప్రజలకు దివంగతనేత  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రసాదించిన గొప్ప ప్రాజెక్ట్‌ నిమ్స్‌. మహానేత మరణానంతరం నిధుల లేమి తో నిమ్స్‌ నిలిచిపోయింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నిమ్స్‌కు నిధులను కేటా యించలేదు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని ఆ మేరకు పనులు చేపట్టగా వైఎస్‌ మరణం తర్వాత.. సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ దాన్ని పూర్తిగా తుంగలో తొక్కింది.ఒక దశలో ప్రైవేట్‌ పరం చేయాలని ప్ర యత్నించింది. అయితే ప్రతిపక్షాలు ప్రతిఘటించడంతో వాయిదా పడింది.  తెలంగాణవాదులు, అన్ని రాజకీయ పక్షాలు నిమ్స్‌ను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

వైఎస్సార్‌ చేతుల మీదుగా శంకుస్థాపన
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బీబీనగర్‌ దగ్గరలోని రంగాపూర్‌వద్ద జాతీయ రహదారి పక్కన అత్యంత ఆధునిక వసతులతో కూడిన నిమ్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.   2005 డిసెంబర్‌ 1న పనులకు శంకుస్థాపన చేశారు. 2009 ఫిబ్రవరి 22న వైఎస్సార్‌ దాన్ని ప్రారంభించారు. 161 ఎకరాల్లో రూ.220 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును.. దేశ రాజధాని ఢి ల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో యూనివర్సిటీ, పీజీ వైద్యవిద్య, క్యాంపస్, ఫార్మసీ (పి.జి) వివిద రోగాలపై పరిశోధనా సంస్థగా రూపకల్పన చేసేం దుకు పనులు చేపట్టారు. 2009 ఫిబ్రవరి 22న వైఎస్సార్‌ నిమ్స్‌ను ప్రారంభించిన సమయంలో 15 రోజుల్లో అవుట్‌ పేషెంట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని చేసిన ప్రకటన అమలు కాలేదు.
 
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏం జరిగిందంటే..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌  నిమ్స్‌ భవనసముదాయాన్ని పరి శీలించారు. నిమ్స్‌ ప్రాంగణం అన్ని రకాలుగా అ నుకూలంగా ఉన్నందున ఎయిమ్స్‌ ఏర్పాటు చే సేందుకు చర్యలు చేపట్టునున్నట్లు 2015లో ప్రకటించారు. అయితే కేంద్రం నుంచి మంజూరు ఆలస్యం కావడంతో నిమ్స్‌లో ఓపీ విభాగాన్ని ప్రారంభించి రోగులకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు నిమ్స్‌ను పూర్తిస్థాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి.

ఎవరి వాదనలు వారివే..
బీబీనగర్‌ నిమ్స్‌ ప్రాంగణంలో ఎయిమ్స్‌ వస్తున్నందునే సీఎం కేసీఆర్‌ నిమ్స్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని ఎంపీ డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ వివరించారు. కేసీఆర్‌ ప్రయత్నాలు, కేంద్ర ఆ రోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను పలుమార్లు కలిసి ఎయిమ్స్‌ సాధించామని ఆయన చెబుతున్నారు.  బీజేపీ మాత్రం విభజన చట్టంతోపాటు, ప్రధానమంత్రి సురక్ష సంయోజ్‌ యోజనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 220 ఎకరాల స్థలంలో 49 ఎకరాలు ఇంకా సేకరించనే లేదని వెంటనే ఇవ్వకపోతే ఎయిమ్స్‌ పనులు ఆలస్యం అవుతాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపకపోవడం వల్లే  జాప్యం జరిగిందని బీజేపీ చెబుతోంది. ఇక కాంగ్రెస్‌ వాదన మరోలా ఉంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లే ఎయిమ్స్‌ సాకారం అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నా రు. జాతీయ రహదారి 163 వెంట, హైదరాబా ద్‌కు శివారులో నిమ్స్‌కోసం 161ఎకరాల స్థలం కేటాయించి.. అందులో భవనాలు నిర్మిచడం వల్లే ఈరోజు ఎయిమ్స్‌ సాధ్యమైందని కాంగ్రెస్‌ నియోజకవర్గఇంచార్జ్‌ కుంభం అనిల్‌కమార్‌రెడ్డి చెబుతున్నారు. ఎయిమ్స్‌ మంజూరీలో జరుగుతున్న ఆలస్యంపై పలుమార్లు ఆందోళనలు చేయడంలో కాంగ్రెస్తో పాటు యువతెలంగాణ, టీడీపీ, వామపక్షాల నాయకులు ఉన్నారు.

లబ్ధి పొందడానికే..!
ఇదిలా ఉంటే ఎయిమ్స్‌ విషయంలో పార్టీలన్నీ క్రెడిట్‌ కోసం ప్రయత్నిస్తున్నాయనడంలో సందేహం లేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎయిమ్స్‌ అత్యంత ప్రతిష్టాత్మక ప్రచారాస్త్రంగా మారబోతుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిమ్స్‌ విషయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న అభిప్రాయం ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. 220 ఎకరాల స్థలం ఎయిమ్స్‌ పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలి. విద్యుత్‌ సబ్‌స్టేషన్, అంతర్గతర రహదారులు, మంచినీటి వసతిని కల్పించా లి. మౌళిక వసతులు సమకూర్చిన వెంటనే కేంద్రం నిధులను విడుదల చేసి అస్పత్రిని ప్రారంభించాలి. అయితే ఎయిమ్స్‌ కోసం మంజూరు చేసిన నిధులను వెంట వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది.ఏది ఏమైన రాజకీయ పార్టీలకు జిల్లాలో ఇక నుంచి ఎయిమ్స్‌ ఒక ప్రచారాస్త్రంగా మారబోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement