ఆరుతడి పంటలతో రైతుల్లో ఆనందం
7,015 హెక్టార్లలో సాగుచేసిన అన్నదాతలు
వికారాబాద్ రూరల్: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాత మోముల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో దోబూచులాడిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరు బావులున్న ప్రాంతాల్లో రైతులు వరి, పసుపు పంటలు సాగు చేయగా.. వర్షాధారిత ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో మండలంలోని రైతులు ఆరుతడి పంటలపై ఆశలు పెట్టుకుని.. ఆ దిశగా సాగుకు ఉపక్రమించారు. ఆయా పంటలు సాగు చేసిన రైతులకు వర్షాలు కరువయ్యాయి. దీంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న తరుణంలో.. ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల ఆశలు చిగురించాయి. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయింది. మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో రైతులు వరి 10 హెక్టార్లు, జొన్న 420, మొక్కజొన్న 2,830, పెసర 105, మినుము 75, కంది 2,300, పసుపు 305, పత్తి 720, సోయాబీన్ 250 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. మొత్తం కలిపి 7,015 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం పోసినట్లయిం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షం అన్నదాతలకు వరం లాంటిదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు వరుణిడి కరుణ ఉంటే నెలాఖరు నాటికి కాతకాసి పంటలు చేతికి అందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.