ఊరటనిస్తున్న.. బడ్జెట్‌ | KCR Budget Good News To Farmers | Sakshi
Sakshi News home page

ఊరటనిస్తున్న.. బడ్జెట్‌

Published Sat, Feb 23 2019 10:03 AM | Last Updated on Sat, Feb 23 2019 10:03 AM

KCR Budget Good News To Farmers - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లా ప్రజానీకానికి ఊరటనిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల స్పష్టత లేకున్నా.. మిగిలిన అంశాలపై హర్షం వ్యక్తం అవుతోంది. రైతుల వ్యవసాయ పెట్టుబడుల కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఎకరాకు అందిస్తున్న రూ.8వేల మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేటాయింపులు కూడా చేసింది. జిల్లా విషయానికి వస్తే, రైతు బంధు ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన అన్నదాతలు 4,14,356 మంది ఉన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో వారికి రూ.8వేలు అందగా, వచ్చే ఖరీఫ్‌ నుంచి రూ.10వేలు అందనున్నాయి. దీనివల్ల ఒకే ఏడాది జిల్లాలో 414కోట్ల 35లక్షల 60వేల రూపాయల మేర రైతుల ఖాతాలకు చేరనుంది. మరోవైపు రైతుల పేర బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలను ప్రతి రైతుకు రూ.లక్ష  చొప్పున మాఫీ కానుంది.
 
నల్లగొండ జిల్లాలో 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకంలో 2,63,309 మంది రైతులు లబ్ధిపొందారు. రూ.1328.88కోట్ల రుణమాఫీ జరిగింది. కాగా, ఈ సారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎలాంటి విధివిధానాల రూపకల్పన జరగని కారణంగా ఎంత మొత్తం రుణమాఫీ అవుతుందో అధికారులు ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో రైతుల రుణాల రూపంలో రమారమి రూ.4వందల కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.

అయితే, ఇందులో రూ.లక్ష నుంచి రూ.5లక్షల దాకా రుణాలు పొందిన రైతులు ఉన్నారని అంటున్నారు. మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ యువతకు భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించి కూడా ఇంకా విధివిధానాలు రూపొందలేని అంటున్నారు. అదేమాదిరిగా, జిల్లాలో ఎందరు నిరుద్యోగ యువత ఉన్నారు? నిరుద్యోగ యువతగా ఎవరిని భావిస్తారు? నిరుద్యోగ భృతి పొందడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి .. అన్న విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు.

అనూహ్యంగా పెరుగుతున్న పెన్షన్ల మొత్తం
మరో వైపు వివిధ రకాల పెన్షన్లు అందించడం ద్వారా ప్రభుత్వం నిస్సాహయులకు అండగా నిలుస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మికులతో పాటు దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పెన్షన్‌ పొందుతున్న వారు 1,91,351 మంది ఉన్నారు. ఇదంతా పాత లెక్క. పెన్షన్‌దారుల వయస్సును తగ్గించడంతో జిల్లాలో మరో 84,515మంది కొత్తగా వచ్చి చేరారు. దీంతో మొత్తం పెన్షన్లు పొందాల్సిన వారి సంఖ్య 2,75,866 మందికి చేరింది.

ప్రస్తుతం పెన్షన్‌ దారులకు నెలకు రూ.వెయ్యి అందిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.2116కు పెంచారు. దివ్యాంగులకు ఇప్పుడు రూ.1500పెన్షన్‌ అందుతుండగా ఆ మొత్తం రూ.3,116కు పెరిగింది. జిల్లాలో పెన్షన్‌ పొందుతున్న దివ్యాంగులు 30,455 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.9,48,97,780 ఖర్చు కానుంది. అంటే ఏటా వీరికి రూ.113కోట్ల 87లక్షల 73వేల 360 అవుతోంది. దివ్యాంగులను మినహాయిస్తే.. అన్ని రకాల పెన్షన్‌ దారులు కలిసి 2,45,411 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.51,92,89,676 ఖర్చు కానుంది. ఇలా.. ఏటా ఈ మొత్తం రూ.623కోట్ల 14లక్షల 76వేల 112 కానుంది. మొత్తంగా అన్ని రకాల పెన్షన్లకే  ఏటా ఖర్చు చేయనున్న బడ్జెట్‌ రూ.737కోట్ల 02లక్షల 49వేల 472 అవుతోంది. ఈ మేర జిల్లా వాసులు లబ్ధిపొందనున్నారు.

స్పష్టత లేని సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులు
రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అత్యధిక కేటాయింపులు జరిపినా, ప్రాజెక్టుల వారీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో జిల్లాలో ఉన్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులతో పాటు చిన్నతరహా ప్రాజెక్టులకు ఒక్కో దానికి ఎంత మొత్తంలో కేటాయించిన వివరాలను ప్రకటించక పోవడంతో స్పష్టతలేకుండా పోయింది. జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మార్గం, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం, మూసీ ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. కానీ, వీటికి ఎంత మొత్తంలో ఈ సారి బడ్జెట్‌ కేటాయించిందీ తెలియకుండా పోయింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలోనూ కొన్ని పనులు జరగడంతో పాటు ప్రాజెక్టు యాజమాన్యానికి ఎంత కేటాయించిందీ లెక్క లేదు. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చేపడుతున్న చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కేటాయింపు వివరాలను ప్రకటించలేదు. సాగునీటి రంగం విషయాన్ని మినహాయిస్తే.. రైతులకు, పెన్షన్‌ దారులకు ఈ బడ్జెట్‌ తీపి కబురే అందించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.    

మాట నిలుపుకున్నారు
ఎన్నికల సమయంలో మాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బడ్జెట్‌లోనే రూ.1810 కోట్లు కేటాంచి తన మాట నిలుపుకున్నారు. నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని ద్వార పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రావులపెంట 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement