సాక్షి, గద్వాల: కరువు, వలస ప్రాంతంగా పేరుతెచ్చుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు, చెరువు పనులకు గతంలో దివంగత మహానేత వైఎస్సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం కల్పించడంతో సాగునీటి కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కళ్లముందు నీరు పారుతుండటంతో రైతుల్లో సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
సాగులో 7.5లక్షల ఎకరాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. గత బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ద్వారా దాదాపు ప్రస్తుతం 7.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుండగా భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు 4,223.6కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల పూర్తి కోసం మరో రూ.1300కోట్లు ఇస్తే గాని పనులు పూర్తికాని పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 22,500కోట్లు కేటాయించారు. జిల్లా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
కేఎల్‌ఐకి రూ.550కోట్లు..
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడిప్పుడే ఒక రూపం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 టీఎంసీల నీటిని వినియోగించుకుని నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంది. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తే రూ.260.33కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.550కోట్లు అవసరమని సాగునీటిశాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. పూర్తిస్థాయిలో కేటాయిస్తేనే పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.
జూరాలకు రూ.50కోట్లు...
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కేంద్రబిందువుగా ఉన్న జూరాల ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్‌లో రూ.50కోట్లు అవసరమని నీటిపారుదల శాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1.07లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.1,650కోట్లు ఖర్చు చేశారు. జూరాల ద్వారా సాగుకు నీటి విడుదల ప్రారంభమై 19ఏళ్లు గడిచినా చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది. ఇంకాలైనింగ్ పనులు, ఫీల్డ్ చాన్స్ పూర్తి చేయాల్సి ఉంది.
రిజర్వాయర్లు నిర్మిస్తేనే తుమ్మిళ్లకు ప్రయోజనం..
ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులను అదిగమించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు 55వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పనులు తొలివిడత పూర్తయ్యాయి. మొదటి లిఫ్ట్ ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు. కానీ రెండో విడతలో చేపట్టాల్సిన రిజర్వాయర్లు పూర్తయితేనే ప్రయోజనం ఉంటుంది. గత బడ్జెట్‌లో ఆర్డీఎస్‌కు రూ.144.50కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.50కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
నెట్టెంపాడుకు రూ.160కోట్లు
నడిగడ్డకు అత్యంత కీలకమైన నెట్టెంపాడు ప్రాజెక్టుకు ఈ సారి బడ్జెట్‌లో రూ.160కోట్లు అవసర మని అధికారులు ప్రదిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు కింద ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఉపయోగించుకొని మొత్తం 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ధేశించారు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భూ సేకరణ కూడా పూర్తికాలేదు. గత బడ్జెట్‌లో నెట్టెంపాడుకు రూ.200కోట్లు కేటాయిస్తే రూ.45.92కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఈ సారి బడ్జెట్‌లో నైనా పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే పూర్తిస్థాయి ఆయకట్టు సాధ్యమవుతుంది.
కోయిల్‌సాగర్‌కు రూ.43కోట్లు
జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు మిగిలిన ఏకైక ప్రాజెక్టు కోయిల్‌సాగర్. ఈ ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. అయితే పనులు పెం డింగ్‌లో ఉన్న కారణంగా పూర్తిస్థాయి ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టులోకి నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.500కోట్ల వరకు ఖర్చు చేశారు. గతేడాది రూ.120కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే కేవలం రూ.16.80కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి రూ.43కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
రాజీవ్‌భీమా ఎత్తిపోతలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు సాగునీరు అందిచేందుకు ఐదే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణంతో 20 టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.2,335కోట్లు ఖర్చు చేశారు. గతేడాది రూ.170 కోట్లు కేటాయిస్తే రూ.87.48కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.130కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా భీమా పరిధిలోకి వచ్చే సంగంబండకు రూ.14కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.9కోట్లు కేటాయించారు. ఈసారి ప్రాజెక్టుల వారీగా బడ్జెట్ వివరాలు తెలియాల్సి ఉంది.
నెమ్మదిగా పాలమూరు–రంగారెడ్డి పనులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉ న్నాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అత్యం త ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని అనుమతులు కూడా పూర్తయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను 18ప్యాకేజీలుగా విభజించివ పనులు చేపట్టారు. ప్రధానంగా 1 నుంచి 15 ప్యాకేజీల వరకు పనులు జరుగుతున్నాయి. ఉందండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి భూ సేకరణ పూర్తి కాకపోవడంతో ప్యాకేజీ 16,17,18 పనులకు అడ్డంకిగా మారింది. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.3,035కోట్లను కేటా యించారు. కాని నిధులు 20శాతం నిధులు కూ డా విడదల చేయకపోవడం వల్ల పనులు వేగం గా జరగలేదు. ఈ బడ్జెట్‌లోనైనా ప్రాధాన్యం ఉంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మొ త్తంగా సాగునీటి రంగానికి భారీగా రూ.22,500 కోట్లు కేటాయించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment