చినుకు తడికి.. చిగురు తొడిగి | Farmers Happy With Rains In Telangana | Sakshi
Sakshi News home page

చినుకు తడికి.. చిగురు తొడిగి

Published Tue, Jul 30 2019 1:02 AM | Last Updated on Tue, Jul 30 2019 9:54 AM

Farmers Happy With Rains In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మొలకలు వాడిపోతున్నాయని, స్వల్పకాలిక రకాల పంటలు విత్తుకునేందుకు కూడా అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్న దశలో నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలకు మళ్లీ ప్రాణమొచ్చినట్లయింది. ఈ వర్షాలు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్‌ వంటి పంటలకు ప్రాణం పోశాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. అంతేగాక వరి నాట్లు కూడా ఊపందుకుంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. ఆ తర్వాతైనా సరిగా వర్షాలు పడ్డాయా అంటే అదీ లేదు. దీంతో చాలాచోట్ల భూమిలో వేసిన విత్తనాలు వేసినట్లే లోపలే ఉండి పోయాయి. చాలాచోట్ల మొలకలు రాలేదు. వచ్చినచోట్ల మొలకలు వాడిపోయే దశలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. చాలాచోట్ల రైతులు పంటలు వేసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో సాధారణంగా సాగు విస్తీర్ణం కంటే ఇప్పటి వరకు వాస్తవంగా సాగైన విస్తీర్ణం తగ్గినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో ఉపయోగకరంగామారాయి.

నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇప్పటి వరకు 4.02 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్‌ ప్రస్తుత వర్షాలతో గట్టెక్కుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే పత్తి పంట దాదాపు అన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. రైతులు ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల ఎకరాలలో చేశారు. ఈ పంట కాస్త ఎదిగి, వానలు లేకపోవడంతో వాడిపోయింది. మరో వారం, పది రోజుల్లో పూత దశ రావాల్సి ఉంది. ఈ సమయంలో చినుకుల సవ్వడితో అన్నదాతలో ఆశలు రేగాయి. వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న కూడా అధికంగా 7లక్షల ఎకరాల్లో సాగవుతుంది. దీంతో పాటు పప్పు దినసుల పంటలు కూడా పర్వాలేదన్నట్లుగానే ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు ఆయా పంటలన్నింటికీ ఊపిరిలూదాయి. వాడి ఎండిపోయే దశలో ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలు ప్రస్తుత వర్షాలతో గట్టెక్కనున్నాయి. మరిన్ని రోజుల పాటు స్థిరంగా వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం ప్రకటన రైతన్నల్లో ఆనందాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. 
 
సాధారణ స్థితికి రుతుపవన ద్రోణి 
రాజస్తాన్‌లోని గంగానగర్‌ నుంచి అలహాబాద్‌ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు దక్షిణాది వైపు రావాల్సిన రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకు వర్షాల జాడలేదు. ఇప్పుడా రుతుపవన ద్రోణి హిమాలయాల నుంచి సాధారణ స్థితికి చేరింది. దాని ప్రభావం మూలంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒరిస్సా దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్, పశ్చిమబెంగాల్, గాంగ్‌టక్‌ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.

అలాగే దక్షిణ రాజస్తాన్‌ నుంచి ఒరిస్సా వరకు మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్‌ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల రాగల 3రోజులపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌ హత్నూర్‌ల్లో 7సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షం కురిసింది. జైనూరు, కొత్తగూడ, సారంగాపూర్, మణుగూరుల్లో 6సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement