ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో 2019 ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రకృతిపరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. గతంలో ఎప్పుడూలేని విధంగా మూడుసార్లు భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. ముందస్తు సాగు చేపట్టిన భూముల్లో కోతలు సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరి దిగుబడులు లభిస్తున్నట్లు పంటకోత ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత జిల్లాలో ఈసారి వరి పంట రైతులకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.
నిడమర్రు: గతంలో వచ్చిన దిగుబడులు మించి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం జిల్లాలో 30 శాతం కోతలు పూర్తయినట్లు తాడేపల్లిగుడెం ఏడీఏ తెలిపారు. అప్‌లాండ్‌లో 70 శాతం పైగా కోతలు పూర్తయ్యాయన్నారు.
దిగుబడి బాగున్నట్లే..
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పంట కోత ప్రయోగాలు చూస్తే వరిపంట దిగుబడి ఆశించిన దానికంటే బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ప్రకారం ఒక ప్రయోజన ప్రాంతంలో సగటున 18 కేజీల దిగుబడి వస్తోంది. ఇంతవరకు చేపట్టిన ఆరంభం దశ ప్రయోగాల్లో 16 నుంచి 20 కేజీలు వచ్చిన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత లెక్కన చూస్తే ఎకరాకు సుమారు 26–30 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రయోగాలు 80 శాతం డెల్టాలోనూ మిగిలిన 20 శాతం మెట్టప్రాంతంలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించిన మొత్తం ప్రయోగాలు పూర్తయ్యేసరికి జిల్లాలో సగటు దిగుబడి 34 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గతేడాది కంటే తగ్గిన సాగు..
గత ఏడాది 2,27,925 హెక్టార్లులో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,21,284 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 5వేల ఎకరాలకు పైగా వరి సాగు తగ్గింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే గతేడాది కంటే పంట దిగుబడి బాగా ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది పంటకోత ప్రయోగాల ఆరంభంలో సగటున 14 కేజీలు మాత్రమే రావడంతో ఎకరాకు 2,268 కేజీలు దిగుబడి కనిపించింది. ప్రయోగాలు పూర్తయ్యే సరికి ఎకరాకు 32 బస్తాలు (75 కేజీలు) దిగుబడి లభించింది. ఈ ఖరీఫ్‌లో పంట పరిస్థితి, గణాంకశాఖ లెక్కలు చూస్తుంటే తక్కువలో తక్కువ 32 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతల కష్టానికి ఫలితం రానుంది.
ఒక ప్రయోగానికి 25 చదరపు మీటర్లు..
ఎంపిక చేసిన గ్రామంలో తీసుకునే యూనిట్‌లో రెండు నుంచి నాలుగు చోట్ల ఈ పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలు ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద నిర్వహిస్తారు. ఐదు మీటర్లు పొడవు, ఐదు మీటర్లు వెడల్పు గల 25 చదరపు మీటర్లు విస్తీర్ణంలో పండే పంట దిగుబడిని కొలవటాన్ని ఒక ప్రయోగం అంటారు. ఇలా 162 ప్రయోగాల విస్తీర్ణం ఒక ఎకరా అవుతుంది. 400 ప్రయోగాల విస్తీర్ణం ఒక హెక్టారు అవుతుందని అధికారులు తెలిపారు
ఏలూరు డివిజన్‌లో 40 బస్తాల వరకూ..
ఏలూరు డివిజన్ 16 మండలాల్లో 254 యూనిట్లలో 1016 ప్రయోగాలు చేయాల్సి ఉంది. నేటికి 350 వరకూ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, పెంటపాడు మండలాల్లో జరిగిన ప్రయోగాల్లో 38 నుంచి 40 బస్తాల వరకూ, మెట్ట ప్రాంతాల్లో 30 బస్తాల వరకూ దిగుబడి లభించింది.
– ఎ. మోహన్‌రావు, డీవైఎస్‌ఓ, అర్ధగణాంక శాఖ
ఆశించిన స్థాయిలో దిగుబడి..
జిల్లాలో ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాల ద్వారా ఈ ఏడాది వరిపంట ఆశించిన స్థాయిలో లభిస్తోంది. కొవ్వూరు, నరసాపురం డివిజన్‌లలో ఈ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మరో 10 రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ప్రారంభంలో వర్షాలు ఆలస్యం, పంట మధ్యలో భారీ వర్షాలతో పంటకు కొద్దిమేర ఇబ్బంది ఉన్నా గత ఏడాది కంటే ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడులు వస్తున్నాయి.
– వి.సుబ్బారావు, ఏడీ, అర్ధగణాంక శాఖ
Comments
Please login to add a commentAdd a comment