పంటల బీమా.. రైతుకు ధీమా  | Government Support Farmers With Free Crop Insurance Scheme | Sakshi
Sakshi News home page

జై ‘బీమ’సేన

Published Fri, Jul 3 2020 12:04 PM | Last Updated on Fri, Jul 3 2020 12:04 PM

Government Support Farmers With Free Crop Insurance Scheme - Sakshi

గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల బక్కచిక్కిన రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు నష్టపోకూడదని.. గత ఏడాది రూపాయి ప్రీమియానికే బీమా వర్తింపజేసిన ఆయన ఈ ఏడాదీ అదీ కట్టనవసరం లేదని, ప్రభుత్వమే పూర్తిమొత్తం చెల్లిస్తుందని అభయం ఇచ్చారు. ఫలితంగా హలధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు.

ఆకివీడు: గత ఏడాది వైఎస్సార్‌ పంటల బీమా పథకంలో భాగంగా రూపాయి బీమా ప్రీమియంతో రైతులకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం ఈ ఏడాది మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఏడాది రైతులు రూపాయి కూడా కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్‌ పంటల ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది రూపాయి ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని జిల్లాలో 2,36,912 మంది వినియోగించుకున్నారు. వీరిలో వరి, చెరుకు రైతులు ఉన్నారు. వీరు 1,19,717.5 హెక్టార్లలో సేద్యం చేశారు.

అయితే ఈ ఏడాది ప్రీమియం సొమ్ము మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ బీమా సదుపాయం వర్తింపజేసింది. అంతేకాదు. వరి, చెరుకుతోపాటు ఉద్యానాల సాగు, మత్స్య పెంపకం రైతులకూ బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.  దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఈ–క్రాప్‌ ఆధారంగా జిల్లాలోసాగు చేపట్టిన వరి, చెరకు, ఉద్యాన పంటలు, మత్స్యపెంపకానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. ఫలితంగా జిల్లాలో సుమారు 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగుతోపాటు మరో 2 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 6.11 లక్షల మందికి ఉచిత బీమా వర్తిస్తోంది.  

గతంలో బీమా ప్రీమియం అధికం  
గత ప్రభుత్వాల హయాంలో పంటల బీమా సౌకర్యం కోసం రైతుల వద్ద నుంచి అత్యధిక ప్రీమియం వసూలు చేసేవారు. 2017–18లో ఎకరాకు రూ.560, 2018–19లో  ఎకరాకు రూ.480 చొప్పున ప్రీమియం వసూలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఖరీఫ్‌ సాగులో పంటల బీమాకు ఎకరాకు రూపాయి మాత్రమే ప్రీమియం వసూలు చేశారు. చాలామంది రైతులు అదీ కట్టకపోవడంతో ఈ ఏడాది ఉచిత ప్రీమియం అమలు చేసి రైతును బలోపేతం చేసేందుకు వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు.  
గతంలో క్లెయిమ్‌ల సొమ్ము ఇవ్వలేదు : గత ప్రభుత్వ హయాంలో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు గురైతే పంటల బీమా అమలులో ఉన్నా.. రైతులకు క్లెయిమ్‌ సొమ్మును అందించలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం జగన్‌ ఇటీవల గత ప్రభుత్వంలో రావాల్సిన క్లెయిమ్‌ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుపాన్లు, అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని మంజూరు చేయలేదు.   

అభినందనీయం  
గత ప్రభుత్వాల హయాంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా తుపా న్లు, భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బీమా ప్రక టించడం అభినందనీయం. గత ప్రభుత్వాలు బకాయి పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. 
– మల్లారెడ్డి శేషమోహనరంగారావు, కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రతినిధి, అప్పారావుపేట 

ఇక ధీమాగా..  
ఉచిత బీమా ఇవ్వడం రైతులకు నిజంగా ధీమా కలి్పంచినట్లే. వరి రైతులతోపాటు చేపల పెంపకందారులకు, ఇతర పంటలకు ఉచిత బీమా కలి్పంచడం నిజంగా అభినందనీయం. రైతులందరికీ ఇది శుభవార్త.  సీఎం జగన్‌కు ధన్యవాదాలు. 
– కట్రెడ్డి కుసుమేశ్వరరావు,  చేపల రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం 

ఈ–క్రాప్‌ విధానంతో ఉచిత బీమా 
ఈ–క్రాప్‌ విధానం ద్వారా ఉచిత బీమా సౌకర్యం కలి్పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు, ఇతర వివరాలు అందాల్సి ఉంది. గత ఏడాది ఖరీఫ్‌లో రూపాయి ప్రీమియంతో రూ.51.97 కోట్లను 2,36,912 మంది రైతులు చెల్లించారు. 
– ఎం.డీ.గౌసియా బేగం, వ్యవసాయ సంచాలకులు, ఏలూరు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement