బాక్సులో శవం, రూ.1.36 కోట్లు ఇవ్వాలని లెటర్ పెట్టి వదినకు పార్శిల్
హత్యానేరం పడుతుందని ఆమెను భయపెట్టే ప్రయత్నం
కేసు లేకుండా తప్పించేందుకు సహకరిస్తున్నట్లుగా నటించి ఆస్తి కొట్టేసే ఎత్తుగడ
తర్వాత మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రణాళిక
ఈలోగా వదిన పోలీసులను ఆశ్రయించడంతో బెడిసికొట్టిన ప్లాన్
మృతదేహం పార్శిల్ కేసులో విస్తుపోయే వాస్తవాలు
నేడో, రేపో నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్న పోలీసులు
సాక్షి, భీమవరం/ఉండి/ఆకివీడు/కాళ్ల: తాను రెండో పెళ్లి చేసుకున్న అత్తమామల ఆస్తి మీద కన్నేశాడు.. వదినకు వాటా దక్కకుండా చేసేందుకు తన రెండో భార్యతో కలిసి పథకం పన్నాడు.. అందుకు మృతదేహం అవసరమై తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఓ అమాయకుడిని అంతమొందించాడు. బాక్సులో మృతదేహాన్ని ఉంచి రూ.1.30 కోట్లు ఇవ్వాలంటూ లెటర్ పెట్టి వదినకు పార్శిల్ పంపాడు. ఇంటికి పార్శిల్ వచి్చనట్లు ఫోన్ రావడంతో ఏమీ తెలీనట్లుగా వచ్చాడు. హత్యానేరం పడకుండా మృతదేహాన్ని మాయం చేయడం.. ఆగంతకునికి ఇచ్చేందుకు డబ్బులు తాను సర్దుబాటు చేస్తున్నట్లు నటించి వదినకు వచ్చే వాటాను తమ పేరిట రాయించుకోవాలనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంలో నిందితులందరూ పోలీసులకు చిక్కారు. ఆద్యంతం క్రైం థ్రిల్లర్‌ను తలపించిన ఈ కేసుకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన శ్రీధర్‌వర్మ అలియాస్ సుధీర్‌కు ఇదివరకే వివాహం కాగా... అతని మొదటి భార్య తన ఇద్దరు పిల్లలతో గాంధీనగర్‌లో ఉంటోంది. అతను తన కులం తప్పుగా చెప్పి యండగండికి చెందిన మరో మహిళను ప్రేమ పేరిట రెండో వివాహం చేసుకున్నాడు. అంతేకాక.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన కాళ్ల గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. రెండో భార్య రేవతి తల్లిదండ్రులకు యండగండిలో ఇంటితోపాటు మూడెకరాల వరకు పొలం ఉంది. ఆమె అక్క తులసికి ఈ ఆస్తిలో వాటా ఉంది. తులసికి ఆస్తి దక్కకుండా కాజేసేందుకు శ్రీధర్‌వర్మ, రేవతి పథకం పన్నారు. గ్రామంలోని జగనన్న కాలనీలో తులసి ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా క్షత్రియ ఫౌండేషన్ పేరిట ఆమెకు రెండుసార్లు పార్శిల్ ద్వారా నిర్మాణ సామగ్రి పంపించారు. మూడోసారి తులసి తండ్రి ముదునూరి రంగరాజు పేరుతో మృతదేహాన్ని పంపాలని స్కెచ్ వేశారు.
బలైన తాగుబోతు..
ఇందులో భాగంగా మృతదేహం కోసం ఎవరో ఒకరిని హత్యచేయాలని నిందితులు భావించారు. అది కుదరకపోవడం.. మరోవైపు భార్య ఒత్తిడి తెస్తుండటంతో శ్రీధర్‌వర్మ కన్ను అతని స్వగ్రామమైన కాళ్ల మండలం గాం«దీనగర్‌లో ఆవారాగా తిరిగే బర్రే పర్లయ్య (38)పై పడింది. పర్లయ్య మద్యానికి బానిసై భార్యాపిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనైతే ఎవరికీ అనుమానం రాదని శ్రీధర్‌వర్మ భావించాడు. అనుకున్నదే తడవుగా తాను లీజుకు చేస్తున్న చెరువు వద్దకు పనికి రావాలని చెప్పాడు. ఈ నెల 17న జక్కరం వద్ద అతనిని తన కారులో ఎక్కించుకుని కాళ్ల గ్రామానికి వెళ్లి అక్కడ తన స్నేహితురాలు, ఆమె కుమార్తె అయిన బాలికను ఎక్కించుకున్నాడు. ఉండి మండలం వాండ్రం–పెదపుల్లేరు గ్రామాల మధ్యన ఉన్న లింకు రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చి పర్లయ్యతో ఫుల్లుగా మద్యం తాగించాడు. తర్వాత తన స్నేహితురాలి సాయంతో పర్లయ్య మెడకు తాడు బిగించి హత్యచేసి మృతదేహాన్ని తమ వెంట తెచ్చుకున్న బాక్సులో ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్డులోని సాగుపాడు చేరుకుని బాక్సును దింపి ఆటోలో లోడ్ చేసేందుకు తన స్నేహితురాలిని అక్కడ ఉంచాడు. అటుగా వెళ్లే ఆటోను ఆమె ఆపి బాక్సు ఎక్కించే వరకు మైనర్ బాలికతో కలిసి దూరంగా వేచి ఉన్నాడు. అనంతరం.. శ్రీధర్‌వర్మ తల్లీకూతుళ్లను కారులో ఎక్కించుకుని ఇద్దరినీ కాళ్లలోని ఇంటి వద్ద దింపాడు.
ఒకరిని మించి మరొకరు..
అక్క ఆస్తిని కాజేయాలని చెల్లి.. ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకున్నాక ఇద్దరు భార్యలను వదిలించుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉడాయించాలని శ్రీధర్‌వర్మ.. ప్రియుడు తెచ్చే ఆస్తితో కలిసి వెళ్లిపోవాలని ఒకరు.. ఇలా ఒకరికి మించి మరొకరు కుట్రపూరిత ఆలోచనలు చేసి చివరకు పోలీసులకు చిక్కారు.
కేసు లేకుండా చేస్తానని చెప్పి..
పార్శిల్ అందిన తర్వాత శ్రీధర్ వర్మకు అతని వదిన తులసి వద్ద నుంచి ఫోన్ వచి్చంది. ఇంటి సామాన్లకు సంబంధించి పార్శిల్ వచి్చందని అతనికి చెప్పింది. తాను వచ్చేవరకు దానిని ఓపెన్ చెయ్యొద్దని తులసికి శ్రీధర్‌వర్మ చెప్పాడు. ఇంటికొచ్చి బాక్సు ఓపెన్ చేసి మృతదేహాన్ని చూసి అవాక్కయినట్లు నటించాడు. పోలీసు కేసవుతుందని, అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని తన పన్నాగంలో భాగంగా శ్రీధర్‌వర్మ ఆమెను బెదిరించాడు. కేసు లేకుండా అందరినీ మేనేజ్ చేసేందుకు కోటి రూపాయలకు పైనే ఖర్చవుతుందని చెప్పడంతో తులసి అందుకు అంగీకరించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూడటంతో ఇంట్లో అందరి వద్ద నుంచి ఫోన్లు తీసేసుకున్నాడు. అప్పటికే తులసి తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులకు చేరింది.
ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆటకట్టు..
మొత్తానికి.. విషయం బయటకు పొక్కడంతో శ్రీధర్‌వర్మ పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామంలో దాక్కున్నాడు. దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌వర్మ భార్యలను, అనుమానితులను పోలీసులు విచారించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డుల ఆధారంగా శ్రీధర్‌వర్మ వివరాలు మీడియాకు విడుదల చేశారు. బంటుమిల్లికి చెందిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించడంతో శ్రీధర్‌వర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచి్చంది. గురువారం శ్రీధర్‌వర్మ, ఇద్దరు మహిళలు, మైనర్ బాలికను సంఘటనాస్థలానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి చాకచక్యంగా ఈ కేసును ఛేదించినట్లు తెలుస్తోంది.ఒకటి, రెండు రోజుల్లో నిందితులను పోలీసులు కోర్టుముందు హాజరుపరిచే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment