Crop yields
-
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్‌టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్‌లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
పట్టి పీడిస్తున్న దిగుబడి భూతం
దిగుబడి గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. దిగుబడి, ఉత్పత్తి, ఉత్పాదకత మధ్య ఉన్న వివిధ కోణాలను అధికార గణం విస్మరిస్తున్నారు. దిగుబడి పెంపుదల నినాదంగా పెట్టుకుని, దేశీయ రైతుల జ్ఞానాన్నీ, శ్రమనూ కించపరుస్తున్నారు. ఈ దిగుబడి జాడ్యం విదే శాల నుంచి, ప్రత్యేకంగా అమెరికా నుంచి చుట్టుకున్నది. ఇప్పుడు ఆకలి తీర్చడం లక్ష్యం కాదు. ఆదాయం పెరగాలంటే దిగుబడులు పెంచాలంటు న్నారు. కానీ అనేక సమస్యల మధ్య దిగుబడులు ఎక్కువ అయినా ప్రతి సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విత్తనాలు ఎరువులు అమ్మేవారు అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ, తమ లాభాలను మాత్రం పెంచుకుంటున్నారు. దిగుబడి ఒక ఆయుధం! ప్రభుత్వం దిగుబడి పెంచడానికి వివిధ రకాలుగా పెడుతున్న ఖర్చు... రైతులకు గిట్టు బాటు ధరలు అందించే వ్యవస్థ మీద పెట్టే దాని కంటే అనేక రెట్లు ఎక్కువ. వరి, గోధుమల అధిక ఉత్పత్తి కొరకు గత 50 ఏండ్లలో కేటాయించిన నిధులు, ఆహారం కొరకు చేసిన కృషిగా కొంత వరకు అర్థం చేసుకోగలం. కానీ గత 25 ఏండ్లలో వాణిజ్య పంటల దిగుబడులు పెంచడానికి ప్రకటించిన విధానాలు, కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలు, సరళీకరించిన నిబంధనలు రైతుకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాయి. కొత్త వంగడాలు ప్రకటించి పంటల దిగుబడి చూసుకుని మురుస్తున్నారే కానీ దాంట్లో పోషకాల శాతం ఎంత అనేది మరుస్తున్నారు. రోజూ మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు లేవని, తగ్గుతున్నాయని వైద్యులు, ఆహార నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆహారంలో పోషకాలు ఉండాలంటే వైవిధ్యం అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, వైవిధ్యం కాదు, ఏక పంట విధానం ద్వారానే అధిక దిగుబడి వస్తుందని ఆధునిక దిగుబడి శాస్త్రం మనకు నూరిపోస్తున్నది. ఏదైనా వస్తువు, లేదా పని ఎక్కువ చేయాలంటే ఉత్పాదకతను కొలమానంగా తీసుకుంటారు. మౌలిక వనరులను సరి అయిన మోతాదులో ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం ఉత్పాద కతను సాధించినట్టుగా భావిస్తారు. ఏదైనా పరిశ్రమలో అధిక ఉత్పా దకత కొరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అదే రైతు ఉత్పాదకతను పెంచితే ప్రోత్సాహకంగా పంట ధర పెరగడం లేదు. 2010, 2019లో భారత రైతులకు మైనస్ రూ.2.36 లక్షల కోట్లు, మైనస్ రూ.1.62 లక్షల కోట్ల మేర ప్రతికూల మద్దతు లభించిందని ఒక అంతర్జాతీయ నివేదిక (ఓఈసీడీ– ఐరోపా దేశాల ఆర్థిక కూటమి) అంచనా వేసింది. 2000 మినహా 2000–2019 మధ్య కాలంలో రైతులకు మద్దతు స్థిరంగా ప్రతికూలంగా ఉంది. ఓఈసీడీ అంచనా ప్రకారం మైనస్ 1.62 లక్షల కోట్ల రూపాయల ప్రతికూల మద్దతు 2019లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొత్తం బడ్జెట్ కేటాయింపుల కంటే రూ.1.09 లక్షల కోట్లు ఎక్కువ. రైతులకు రావాల్సిన పైకం ఎక్కువ, కాని వస్తున్నది తక్కువ అని ఈ నివేదిక సారాంశం. 2016–17లో ఒక క్వింటాల్ గోధుమ ఉత్పత్తికి హరియాణా రైతుకు రూ.2,219 ఖర్చయిందనీ, కేంద్రం నిర్ణయించిన క్వింటాలుకు రూ.1,625 కనీస మద్దతు ధర కంటే అది రూ. 594 ఎక్కువనీ అక్కడి ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ పరిస్థితి అధిక దిగుబడి వల్ల మారుతున్నదా? గిట్టుబాటు ధర రానప్పుడు రైతుకు దిగుబడి దిగులు ఎందుకు? ‘ఉత్పత్తి పెంచండి’ అని పిలుపునిచ్చే శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులు, గిట్టుబాటు ధర విషయంలో మాత్రం కిమ్మనరు. విత్తనాలు, ఎరువులు, పంట రసాయనాలు అమ్మేవారు మాత్రం అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ తమ లాభాలను పెంచుకుంటున్నారు. వీరి వాణిజ్య ప్రకటనలకు దన్నుగా శాస్త్రవేత్తలు ఫిడేలు వాయిస్తుంటారు. వ్యవసాయంలో పంటల దిగుబడులు పెంచాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. నేల సారం అధికంగా ఉంటే పంట పోషకాలతో కూడి ఎక్కువ కాత, పూత వస్తుంది. సరి అయిన నీరు అందిస్తే మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పూతకు, కాతకు గాలిలో, నేలలో తేమ ఉపయోగపడుతుంది. ఈ తేమ ఉండాలంటే, ప్రాంతీయంగా పచ్చదనం ఉండాలి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. నేలలో పోషకాలు పెంచే ఉపాయాలు అనేకం ఉన్నాయి. నిరంతరంగా, సహజంగా నేలలో సారం పెంచితే రైతు మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా, దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడులు సాధించి సంతోషంగా ఉన్న రైతులు కోకొల్లలు. ప్రపంచ రికార్డు వరి దిగుబడి ఒక వ్యవసాయ పరిశోధనా కేంద్రం లేదా అమెరికాలో పెద్ద భూస్వామి కాకుండా, బిహార్ రాష్ట్రంలో ఒక రైతు సాధించాడు. దర్వేశ్పుర గ్రామంలో సుమంత్ కుమార్‌కు హెక్టారుకు 22.4 టన్నుల దిగుబడి వచ్చింది. అది కూడా సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (ఎస్ఆర్ఐ) పద్ధతి వల్ల వచ్చింది. రైతు మీద భారం లేకుండా సహజ పద్ధతుల ద్వారా, ప్రమాదకర రసాయనాల అవసరం లేకుండా,కంపెనీల గత్తర విత్తనాలు నాటకుండా, దిగుబడి వస్తే మంచిదే కదా! దిగుబడి మీద పరిమితులు ఉంటాయి. ఒక దశ తరువాత దిగుబడి పెరగదు. ఎంత దక్షత ఉన్నా ఉత్పాదకతను ఒక స్థాయికి మించి పెంచలేము. ప్రకృతి నుంచి వచ్చే ఉత్పత్తులలో అనేక కారణాల రీత్యా దిగుబడిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనిని వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. పాల ఉత్పత్తి ఒక మంచి ఉదాహరణ. ఒక పాడి పశువు నుంచి తీసుకునే పాల దిగుబడి పెంచడానికి మొదట్లో హైబ్రిడ్ ఆవులను ప్రవేశపెట్టారు. తదుపరి వాటి పొదుగులను భారీగా పెంచారు. విదేశాలలో ఈ భారీ పొదుగులతో ఆవులు నడవలేని స్థితికి వచ్చాయి. అయినా పాల దిగుబడి ఇంకా పెంచాలని మేతలో మార్పులు చేశారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటి అన్నింటి పర్యవసానంగా ఆవు బలహీనపడి, రోగాల బారిన పడింది. కచ్చితంగా అవి అనారోగ్యానికి గురి అవుతాయని తెలిíసీ మేతలో ‘మందులు’ కలుపుతున్నారు. అంటురోగాలు వస్తాయని నిర్ణీత కాలంలో అవసరమున్నా లేకున్నా వ్యాక్సిన్లు, ఇతర ‘మందులు’ అల వాటు చేశారు. ఇవన్నీ కూడా దిగుబడి తగ్గకూడదు అని చేస్తున్నారు. ఇప్పుడు ఆవులను జన్యుమార్పిడి ప్రయోగాలకు బలి చేస్తున్నారు. ఎన్ని చేసినా ఒక ఉత్థాన దశ చేరుకున్న తరువాత ప్రకృతిలో భాగం అయిన ఆవు పాలు ఎక్కువగా ఇవ్వదు. ఇంకొక వైపు పాలలో కలుషితాలు పెరిగినాయి. ఒక పాడి పశువు 2 లీటర్లు ఇస్తే, ఇంకొక రకం 3 ఇవ్వచ్చు. సంఖ్యాపరంగా తేడా ఉన్నా ఇస్తున్న పాలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. కాని ఆధునిక దిగుబడి శాస్త్రంలో ‘పిండుకోవటం’ ఒక వ్యాపార సూత్రంగా మారింది. దానినే ఇప్పుడు ‘ఎక్స్ట్రాక్టివ్ టెక్నాలజీస్ అండ్ ఎకానమీ’ అని పరిగణిస్తున్నారు. వరి, గోధుమలు, పత్తి వంటి పంటల విషయంలో కూడా ఇదే తీరు కనిపిస్తున్నది. పత్తి దిగుబడులు పెరుగుతాయని ఒక విదేశీ కంపెనీ చెబితే జోరుగా అనుమతులు ఇచ్చి 2003లో బీటీ పత్తిని రైతులకు అంటగట్టారు. గత 15 ఏండ్ల నుంచి 883 బీజీఐఐ హైబ్రిడ్లు మార్కెట్లో అమ్ముతున్నారు. మూడు లేదా నాలుగేళ్లకు హైబ్రిడ్ విత్త నాలు మార్చాలని రైతులకు సూక్తులు చెప్పే శాస్త్రవేత్తలు, అధికారులు ఇన్ని ఏండ్లుగా అవి మార్చకున్నా పట్టించుకోవటం లేదు. దీంతో పత్తిని ఆశించే పురుగులు, చీడ పీడల బెడద పెరిగింది. విష రసాయనాల మీద ఖర్చు పెరిగింది.ఎకరాకు 14 క్వింటాళ్ళు వస్తాయని నమ్మబలికిన కంపెనీలు ఇప్పుడు కేవలం 2 లేదా 3 క్వింటాళ్ళు వస్తుంటే మాట్లాడటం లేదు. జాతీయ సగటు లెక్కల ప్రకారం 2014లో హెక్టారుకు 510 కిలోలు వస్తే, 2022 అది 445 కిలోలకు పడిపోయింది. దిగుబడుల కోసం హైబ్రిడ్ రకాలను ప్రకటించడంలో ఉన్న చిత్తశుద్ధి ఆ యా విత్తనాల పని తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో లేదు. ఒక ఊత పదంగా మారిన దిగుబడి సందేశాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. స్వార్థపర వ్యాపార ప్రయోజనాలు ఉంటు న్నాయి. లోపభూయిష్ట విధానాలను దిగుబడి ఒక కవచంగా మారింది. అధిక ఉత్పత్తి సాధించడానికి ప్రకటిస్తున్న విధానాలలో సంపూర్ణత లోపించింది. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
ముందస్తు.. మస్తు!
సాక్షి, అమరావతి: ఈసారి ముందస్తు ఖరీఫ్ సాగుతో మంచి దిగుబడులొస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 దశాబ్దాల తర్వాత 15–30 రోజులు ముందుగానే కాలువలకు నీటిని వదలనుండటంతో వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా పంటలు చేతికందనున్నాయి. గత ఖరీఫ్‌లో 165 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయగా అకాల వర్షాలు, వైపరీత్యాలతో 159.82 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 171.62 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆహార ధాన్యాల్లో రికార్డు ఆహార ధాన్యాల దిగుబడులు గతేడాది 77.35 లక్షల టన్నులు రాగా ఈసారి ఖరీఫ్‌లో 95.16 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. 2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 87.77 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈసారి అంతకు మించి వస్తాయంటున్నారు. వైపరీత్యాల ప్రభావంతో గతేడాది ధాన్యం దిగుబడి 70.96 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈసారి 85.58 లక్షల టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా. 2019లో రికార్డు స్థాయిలో 80.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి నమోదైంది. భారీగా పెరగనున్న చెరకు ధాన్యం తర్వాత ఈసారి చెరకు దిగుబడులు గణనీయంగా రానున్నట్లు అంచనా. 2019లో 67.17 లక్షల టన్నులు, 2020లో 41.15 లక్షల టన్నులు, 2021లో 36.54 లక్షల టన్నుల చెరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 50.15 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. అపరాలు గతేడాది 1.14 లక్షల టన్నుల దిగుబడులు రాగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2.18 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది. నూనె గింజల్లో ప్రధానంగా వేరుశనగ గతేడాది 5.40 లక్షల టన్నుల దిగుబడి రాగా ఈసారి 8.28 లక్షల టన్నులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న గతేడాది 4.41 లక్షల టన్నులు రాగా ఈ ఏడాది 5.74 లక్షల టన్నులొస్తుందని భావిస్తున్నారు. ఇలా ప్రధాన పంటల దిగుబడులు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముందస్తు సాగుతో సత్ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్ కోసం సాగునీటి ప్రణాళికను ప్రకటించింది. ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నాటికి పంటలు చేతికి వచ్చేలా ప్రణాళికకు అనుగుణంగా సాగు చేపడితే సత్ఫలితాలు సాధించవచ్చు.ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతన్నలు ముందస్తు సాగుకు సిద్ధం కావాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
నదులకు జీవం పోశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదులకూ హక్కులున్నాయి: వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు. దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్‌లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
AP: ఆనంద హేల.. రైతుల ఇంట కొత్త కాంతి
సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. అన్నదాతల లోగిళ్లు ధన ధాన్యాలతో, పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. ‘వరి’ సిరులతో ధాన్యం గాదెలు నిండుగా కనువిందు చేస్తుండడంతో అన్నదాత ఇంట పండుగ సందడి నెలకొంది. ముగింట్లో మద్దతు ధరతో సంక్రాంతి సంతోషాలు విరబూస్తున్నాయి. అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కడంతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. దీనికి తోడు రైతాంగాన్ని అన్ని విషయాల్లో ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తుండటంతో వ్యవసాయం పండుగైంది. వాస్తవ సాగుదారులను వెతికి మరీ రైతు భరోసా కింద మూడేళ్లలో గరిష్టంగా 50.58 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.6899.67 కోట్ల సాయం అందించింది. ఆర్బీకేల ద్వారా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కావాల్సినన్ని ఎరువులతో పాటు సబ్సిడీపై పురుగు మందులను అందించింది. కూలీల కొరత అధిగమించేందుకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచింది. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు గత మూడేళ్ల కంటే గరిష్టంగా 94.80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు చేశారు. కోత కొచ్చిన వేళ వైపరీత్యాలు కాస్త కలవరపెట్టినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సిరుల పంట పండించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన నల్ల తామర (త్రిప్స్ పార్విస్ పైనస్) వల్ల మిరప పంట దెబ్బతిన్నప్పటికీ మిగిలిన పంటల దిగుబడి బాగుండటంతో రికార్డు స్థాయిలో కోటి 74 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను సాధించారు. ఉన్న ఊళ్లోనే పంట కొనుగోళ్లు ► ‘వరి’ పంట సిరులు కురిపించింది. 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించారు. ఇందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 8,651 ఆర్బీకేల్లో ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ► వీటి ద్వారా ఇప్పటి వరకు 2.70 లక్షల మంది రైతుల నుంచి రూ.3,756 కోట్ల విలువైన 19.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దాదాపు 1,00,283 మంది రైతులకు రూ.1470 కోట్ల జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 రోజుల్లోనే సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేస్తూ రైతులకు బాసటగా నిలిచింది. ► చివరకు అకాల వర్షాలు, తుపాన్ వల్ల దెబ్బతిని రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ అండగా నిలవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది పత్తి, మిరప, మినుము, కందులు, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, టమాట తదితర ప్రధాన వాణిజ్య పంటలన్నీ కనీస మద్దతు ధరకు మించి ధర పలకడంతో రైతుల్లో కొత్త జోష్ సంతరించుకుంది. పత్తి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.10 వేల మార్క్‌ను అందుకుంది. ► ఈ నేపథ్యంలో రైతులు సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇళ్లతో పాటు వ్యవసాయానికి తోడుగా నిలిచే కాడెద్దులు, యంత్ర పరికరాలను ముస్తాబు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యుల రాకతో పల్లెల్లో కొత్త సందడి నెలకొంది. పండుగ శోభాయమానంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని విధాలా తోడుగా నిలిచాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రైతులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలబడడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి సిరుల పంట పండించారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలనే కొనుగోలు కేంద్రాలుగా మార్చి, పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందుకే మకర సంత్రాంతి పర్వదినాన్ని రైతులు శోభాయ మానంగా జరుపుకుంటున్నారు. రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. – కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి వ్యవసాయం పండుగైంది తెలుగు వారు జరుపుకునే మకర సంక్రాంతి వ్యవసాయానికి చిరునామా. తెలుగు రాష్ట్రాల్లో పండించిన పంట ఇంటికొచ్చే వేళ జరుపుకునే ఈ పండుగ వ్యవసాయ దారులు పండుగ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం ఇస్తోన్న తోడ్పాటుతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ 20 రోజుల్లోనే డబ్బులొచ్చాయి నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో నేను రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాను. లోడును నేనే సొంతంగా తోలుకున్నాను. హమాలీ, రవాణా ఖర్చులు సైతం నాకు ఇచ్చేశారు. 20 రోజుల్లోనే నా ఖాతాలో రూ.7.80 లక్షలు జమయ్యాయి. పండగ సమయంలో ఆరుగాలం కష్టం ఫలించి డబ్బులు చేతికి రావడం చాలా సంతోషంగా ఉంది. – వల్లభనేని సురేంద్ర కృష్ణ, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆలస్యం కావట్లేదు.. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత 21 రోజుల్లో నగదు చెల్లింపులు చేస్తున్నాం. బ్యాంకు ఖాతాలో సమస్యలు తలెత్తితే తప్ప ఎక్కడా ఆలస్యం కావట్లేదు. రోజువారీ ధాన్యం సేకరణ ఆధారంగా నిర్ణీత కాలానికి అనుగుణంగా చెల్లింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఏప్రిల్ నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ధాన్యం సేకరణలో భాగంగా ఆర్బీకేల్లో చేస్తున్న ఐదు రకాల పరీక్షలను ఐఓటీ ఆధారంగా రియల్‌టైమ్‌లో ఒకేసారి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – వీరపాండియన్, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండీ -
పత్తి కొనుగోళ్లు ప్రారంభం..!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏ (విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్) వద్ద రైతులు తమ పేర్లు నమోదు చేసుకొన్న వెంటనే స్లాట్ నంబర్ కేటాయిస్తున్నారు. వారికి కేటాయించిన సమయంలో సమీపంలోని మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, కర్నూలు, పశి్చమ గోదావరి జిల్లాల్లోని 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే పత్తి కొనుగోళ్లు ఊపందుకొంటున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పంట దిగుబడుల అంచనా... పత్తి దిగుబడులపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ–క్రాప్‌లో పంట నమోదు తప్పనిసరి. పంట దిగుబడులు ఎకరాకు ప్రకాశం జిల్లాలో 6.83 క్వింటాళ్లు, కర్నూలు– 10.32, గుంటూరు– 12, కృష్ణా–12.7, పశి్చమగోదావరి–10.29, విజయనగరం–5.95, శ్రీకాకుళం–6, తూర్పుగోదావరి జిల్లాలో 4.91 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సీసీఐ తెలంగాణలో ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా, రాష్ట్రంలో ఎకరాకు సరాసరిన 9 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేస్తోందని, విడతల వారీగా కొనుగోలు చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం పత్తి కొనుగోలు చేస్తున్నాం. తేమ శాతం 12 లోపు ఉండేలా రైతులు చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేశాం. – జి.సాయి ఆదిత్య, సీసీఐ బ్రాంచి మేనేజర్, గుంటూరు -
వాతావ'రణం'.. పూతకు ప్రతికూలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రాలిపోతోంది.దీంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఉద్యానశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అకాల వర్షాలు కురవడం, తర్వాత చలి నెలకొనడం తదితర కారణాల వల్ల ఈసారి పూత రావడమే ఆలస్యమైందని, ప్రస్తుత వాతావరణం కూడా పూత, పిందెలు నిలబడే స్థితి లేకుండా పోయిందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 60 శాతం దిగుబడులు పడిపోయే ప్రమాదం... రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి.అత్యధికంగా ఖమ్మం, మంచి ర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా తోటలుండగా, మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు సరాసరి 4 టన్నుల వరకు మామిడి దిగుబడులు వస్తాయి.బాగా కాస్తే ఏడెనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అంటున్నారు.ఆ ప్రకారం రాష్ట్రంలో సుమారు 20 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుందని అంచనా. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా మన మామిడి పంట ఎగుమతి అవుతుంది. ఈసారి కాపు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు కురవడంతో దాని ప్రభావం మామిడి పూతపై పడింది. సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే 92 శాతం, అక్టోబర్ నెలలో సాధారణం కంటే 70% అధికంగా వర్షం కురిసింది. ఫిబ్రవరిలో ఇప్పటివరకు అంటే ఈ 12 రోజుల్లో ఏకంగా 279% అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 12 రోజుల్లో 2.4 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 9.1 మి.మీ నమోదైంది. అంటే మామిడి పూతకు అత్యంత కీలకమైన సమయాల్లో వర్షాలు కురిశాయి. మధ్యలో చలి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితే మామిడి పూత, కాతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఫంగస్, చీడపీడలు... అక్టోబర్ నెల నుంచే మామిడి పూతకు అను కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈసారి అక్టోబర్ వరకూ వర్షాలు విపరీతంగా కురిశాయి. ఈ దెబ్బ ఇప్పటివరకు కొనసాగుతోంది. జనవరిలో సంక్రాంతి నాటికి పూత పూర్తిస్థాయిలో రావాలి. ఉద్యానశాఖ వర్గాల అంచనా ప్రకారం నెల రోజులపాటు మామిడి పూత, కాతకు అంతరాయం ఏర్పడిందంటున్నారు. వాతావరణ మార్పులతో మామిడిపై ఫంగస్ పంజా విసిరింది. చీడపీడలు విజృంభించాయి. దీంతో రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పూతలో 98 % మగ పూతే ఉంటుంది. అది రాలిపోతుంది. ఇక మిగిలిన 2 శాతం ద్విలింగ (ఆడ, మగ) పూత ఉంటుంది. దాని నుంచే కాపు వస్తుంది. అందులో సాధారణంగా 0.5 శాతం మాత్రమే మామిడి కాయగా వస్తుంది. దానినే దిగుబడిగా లెక్కిస్తారు. ఇప్పుడు ఆ దిగుబడి కూడా 60 శాతం వరకు పడిపోయే ప్రమాదముందని ఉద్యాన శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం పంటపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపిందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మార్చిలో మార్కెట్లోకి మామిడి కాయ రావాలి. జూన్ నెల వరకు వస్తూనే ఉంటుంది. ఈసారి ఏప్రిల్‌లో కాయలు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని అంచనా. పూత నిలవడంలేదు పదేళ్ల కిందట 4 ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. అప్పటినుంచి మంచి దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది పూతనే రాలేదు. బంగినపెల్లి మామిడి చెట్లకు పూత వచ్చినా నిలవడం లేదు. దస్రీ రకానికి ఇప్పుడిప్పుడే వస్తోంది. మామిళ్లు పూతకు వస్తే ఎండకాలంలో చెట్లకు కాయలెట్లా నిలుస్తది. ఈ ఏడాది మామిడి తోటలకు నష్టం వచ్చినట్లే. ఎండాకాలంలో నీళ్లు అందక కాయలు రాలిపోతాయి. – తిరుపతిరావు, గాంధీనగర్, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా ఆరంభం నుంచే సమస్య వాతావరణ మార్పుల వల్ల పూత రాలిపోతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ సమస్య నెలకొంది. పూత రాలటంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం కూడా ఉంది. – ఎనమల నారాయణరెడ్డి, బోడు, టేకులపల్లి మండలం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
పాలకంకి నవ్వింది..
ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో 2019 ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రకృతిపరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. గతంలో ఎప్పుడూలేని విధంగా మూడుసార్లు భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. ముందస్తు సాగు చేపట్టిన భూముల్లో కోతలు సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరి దిగుబడులు లభిస్తున్నట్లు పంటకోత ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత జిల్లాలో ఈసారి వరి పంట రైతులకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. నిడమర్రు: గతంలో వచ్చిన దిగుబడులు మించి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం జిల్లాలో 30 శాతం కోతలు పూర్తయినట్లు తాడేపల్లిగుడెం ఏడీఏ తెలిపారు. అప్‌లాండ్‌లో 70 శాతం పైగా కోతలు పూర్తయ్యాయన్నారు. దిగుబడి బాగున్నట్లే.. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పంట కోత ప్రయోగాలు చూస్తే వరిపంట దిగుబడి ఆశించిన దానికంటే బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ప్రకారం ఒక ప్రయోజన ప్రాంతంలో సగటున 18 కేజీల దిగుబడి వస్తోంది. ఇంతవరకు చేపట్టిన ఆరంభం దశ ప్రయోగాల్లో 16 నుంచి 20 కేజీలు వచ్చిన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత లెక్కన చూస్తే ఎకరాకు సుమారు 26–30 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రయోగాలు 80 శాతం డెల్టాలోనూ మిగిలిన 20 శాతం మెట్టప్రాంతంలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించిన మొత్తం ప్రయోగాలు పూర్తయ్యేసరికి జిల్లాలో సగటు దిగుబడి 34 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కంటే తగ్గిన సాగు.. గత ఏడాది 2,27,925 హెక్టార్లులో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,21,284 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 5వేల ఎకరాలకు పైగా వరి సాగు తగ్గింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే గతేడాది కంటే పంట దిగుబడి బాగా ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది పంటకోత ప్రయోగాల ఆరంభంలో సగటున 14 కేజీలు మాత్రమే రావడంతో ఎకరాకు 2,268 కేజీలు దిగుబడి కనిపించింది. ప్రయోగాలు పూర్తయ్యే సరికి ఎకరాకు 32 బస్తాలు (75 కేజీలు) దిగుబడి లభించింది. ఈ ఖరీఫ్‌లో పంట పరిస్థితి, గణాంకశాఖ లెక్కలు చూస్తుంటే తక్కువలో తక్కువ 32 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతల కష్టానికి ఫలితం రానుంది. ఒక ప్రయోగానికి 25 చదరపు మీటర్లు.. ఎంపిక చేసిన గ్రామంలో తీసుకునే యూనిట్లో రెండు నుంచి నాలుగు చోట్ల ఈ పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలు ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద నిర్వహిస్తారు. ఐదు మీటర్లు పొడవు, ఐదు మీటర్లు వెడల్పు గల 25 చదరపు మీటర్లు విస్తీర్ణంలో పండే పంట దిగుబడిని కొలవటాన్ని ఒక ప్రయోగం అంటారు. ఇలా 162 ప్రయోగాల విస్తీర్ణం ఒక ఎకరా అవుతుంది. 400 ప్రయోగాల విస్తీర్ణం ఒక హెక్టారు అవుతుందని అధికారులు తెలిపారు ఏలూరు డివిజన్లో 40 బస్తాల వరకూ.. ఏలూరు డివిజన్ 16 మండలాల్లో 254 యూనిట్లలో 1016 ప్రయోగాలు చేయాల్సి ఉంది. నేటికి 350 వరకూ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, పెంటపాడు మండలాల్లో జరిగిన ప్రయోగాల్లో 38 నుంచి 40 బస్తాల వరకూ, మెట్ట ప్రాంతాల్లో 30 బస్తాల వరకూ దిగుబడి లభించింది. – ఎ. మోహన్‌రావు, డీవైఎస్ఓ, అర్ధగణాంక శాఖ ఆశించిన స్థాయిలో దిగుబడి.. జిల్లాలో ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాల ద్వారా ఈ ఏడాది వరిపంట ఆశించిన స్థాయిలో లభిస్తోంది. కొవ్వూరు, నరసాపురం డివిజన్లలో ఈ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మరో 10 రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ప్రారంభంలో వర్షాలు ఆలస్యం, పంట మధ్యలో భారీ వర్షాలతో పంటకు కొద్దిమేర ఇబ్బంది ఉన్నా గత ఏడాది కంటే ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడులు వస్తున్నాయి. – వి.సుబ్బారావు, ఏడీ, అర్ధగణాంక శాఖ -
వేదాలు చదవండి.. దిగుబడి పెంచుకోండి
పణజీ: పంట పొలాల్లో 20 రోజుల పాటు.. రోజుకు కనీసం 20 నిమిషాల చొప్పున వేదాలను వల్లె వస్తే పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, ఈ ‘కాస్మిక్ ఫార్మింగ్’ను పాటించాలని రైతులకు గోవా సర్కారు సూచించింది. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను పండించవచ్చంది. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం శివ యోగా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ తదితర సంస్థలను సంప్రదిస్తోందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ మంత్రి విజయ్ సర్దేశాయి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ నెల్సన్ ఫిజీరెడొలు ఇటీవలే గురుగ్రామ్‌లోని శివ యోగా ఫౌండేషన్‌కు చెందిన గురు శివానంద్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కాస్మిక్ ఫార్మింగ్ ఉపయోగాలపై చర్చించారని ఆయన వెల్లడించారు. పంట పొలాల్లో వేద పఠనం వల్ల విశ్వంలోని శక్తి ఆ భూమిలోకి వచ్చి పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని నెల్సన్ ఫిజీరెడొ తెలిపారు. -
మూడింతల దిగుబడికి కొత్త రూటు!
మంది పెరిగితే మజ్జిగ పలచనవుతుందని నానుడి. ఇంట్లో అయితే ఓకే గానీ.. అంగుళం నేల కూడా పెరగని భూమిపై జనాభా ఇబ్బడిముబ్బడి అయితే ఆహారం ఎల్లా? ఈ చిక్కు ప్రశ్నకు శాస్త్రవేత్తలు రకరకాల పరిష్కారాలు వెతుకుతున్నారు గానీ. తాజాగా సిడ్నీ, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతికి పదును పెడుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పదేళ్ల క్రితం ప్రయత్నించి, వదిలేసుకున్న ఒక పద్ధతితో పంట దిగుబడులు మూడు రెట్లు ఎక్కువ చేయవచ్చునని వీరు అంటున్నారు. మొక్కలు ఎదిగేందుకు కీలకమైన కిరణజన్య సంయోగక్రియ మరింత మెరుగ్గా, రోజంతా జరిగేలా చేయడం ఈ ‘స్పీడ్ బ్రీడింగ్’ టెక్నిక్‌లోని కీలకాంశం. దీంట్లో మొక్కలు వేగంగా పెరిగేందుకు, కాపుకొచ్చేందుకు అనువైన నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలతో కూడిన కాంతిని చౌక ఎల్ఈడీ బల్బులతో అందిస్తారు. ఒక గ్రీన్హౌస్లో తామిప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని ఏడాది సమయంలో ఆరు పంటల గోధుమలు పండించడమే కాకుండా... సెనగ, బార్లీ, ఆవ పంటలు కూడా వేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లీ హెకీ తెలిపారు. వేరుసెనగ, గోంగూర, పప్పుధాన్యాలు, సూర్యకాంతి, మిరియాలు, ముల్లంగి వంటి పంటలను కూడా స్పీడ్ బ్రీడింగ్ ద్వారా ఎక్కువగా పండిచేందుకు అవకాశముందని వివరించారు. కొత్త పద్ధతి ద్వారా కేవలం ఒక చదరపు మీటర్ వైశాల్యంలో 900 బార్లీ మొక్కలను పండించామని, దిగుబడులతోపాటు పౌష్టిక విలువలను కూడా కాపాడుకోవచ్చునని వివరించారు. జన్యుపరమైన మార్పులేవీ అవసరం లేకుండా... అతితక్కువ ఎరువులు, కీటకనాశనుల సాయంతో మూడింతల దిగుబడి సాధించగల స్పీడ్ బ్రీడింగ్ వివరాలు నేచర్ ప్లాంట్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ధరలేక దిగాలు
భారీగా నష్టపోతామంటూ ఉల్లి రైతు ఆందోళన పెట్టుబడులు కూడా రాని వైనం తాడేపల్లి రూరల్ : నారు వేసే సమయంలో రైతులను ఊరించిన ఉల్లి.. పంట చేతికొచ్చే సమయంలో కంటనీరు తెప్పిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం కనీసం పెట్టుబడులైనా వచ్చే సూచనలు కనబడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఈ ఏడాది దాదాపు 1300 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది పంట లాభసాటిగా ఉండడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంతో సాగుచేశారు. అయితే నాట్లు వేసే సమయంలో కేజీ ఉల్లిపాయలు రూ. 20 ఉండగా, ప్రస్తుతం రూ.7 కు చేరింది. దీంతో రైతులు దిగాలు పడుతున్నారు. పంట దిగుబడి వస్తే ఎకరాకు రూ. 30 వేలు, దిగుబడి తగ్గితే రూ. 60 వేల చొప్పున నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఇలా... జిల్లాలు దాటి నారు కొనుగోలు చేయడంతో నారు ఖర్చు ఒక్కటే రూ. 20 వేలు అవుతోంది. నారు కొనుగోలు చేసిన తరువాత దుక్కికి ఎకరాకు రూ. 1800, సాళ్లు చేయడానికి ఇద్దరు కూలీలకు రూ. 1000, నాటు వేయడానికి 26 మందికి రూ. 5200, దమ్ము చేయడానికి రూ. 2500, ఎరువులు, పురుగు మందులకు రూ. 20 వేలు, కలుపు తీయడానికి (4సార్లు) రూ. 5600, నీటి తడి పెట్టేందుకు రూ 2500, కోత కోసేందుకు రూ. 7600, మోత కూలీకి రూ. 2500 మొత్తం రూ. 68,700 అవుతోంది. ఇదిగాక రాజధాని పుణ్యమా అంటూ కౌలు అమాంతంగా పెరిగి రూ. 40 వేలకు చేరింది. ఉల్లి పంట ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. కౌలుతో కలిపి మొత్తం రూ. 88,700 పెట్టుబడి అవుతోంది. బాగా ఊరిన పంట పొలాల్లో ఉల్లి దిగుబడి 180 బస్తాలు కాగా, ఊరని పొలాలలో 90 బస్తాలు మాత్రమే అయ్యాయి. కేజి రూ. 7 చొప్పున 40 కేజీల బస్తా రూ. 280కు అమ్ముడు పోతుండగా, 180 బస్తాలకు రూ. 50,400 వస్తోంది. నష్టం రూ. 38, 300 వస్తోందని రైతులు లెక్కలు చెబుతున్నారు. అలాగే ఉల్లి గడ్డ ఊరని పొలాల్లో రాబడి రూ. 25,200 కాగా, నష్టం రూ. 63,500 వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు నియోజక వర్గంలో పండిన ఉల్లి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్‌లకు ఎగుమతి అవుతుంది. ఎంత ప్రసిద్ధి చెందినా రైతుకి మాత్రం ప్రతిఫలం అందడం లేదని వాపోతున్నారు. అంతేకాక తాతలు తండ్రుల నుంచి ఉల్లి పండిస్తున్నా వ్యవసాయ అధికారులు నారుమళ్లు పెంపకం గురించి, వాటి పోషణ గురించి వివరించకపోవడం వల్ల భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రేటు చూస్తే భయమేస్తోంది ఎకరంన్నరలో ఉల్లి సాగు చేశాను. రేటు చూసి భయమేస్తోంది. చేతికి వచ్చిన పంటను భూమిలో నుంచి పీకి మార్కెట్‌కు తరలిస్తే ఎంత నష్టం వస్తుందో అర్థం కావడం లేదు. పంట పీకాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. మరో పది రోజుల్లో పీకకపోతే భూమిలోనే ఉల్లి గడ్డలు కుళ్లిపోతాయి. రేటు పెరుగుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాను. – తమ్మా నాగిరెడ్డి, ఉండవల్లి -
కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’
- చిల్లర ఇబ్బందులతో కూరగాయల మార్కెట్లకు తగ్గిన రద్దీ - దిగివచ్చిన ధరలు...రైతన్న కుదేలు సాక్షి, హైదరాబాద్: సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెద్దనోట్ల రద్దు... నగరం లోని అన్ని మార్కెట్ల వ్యాపారాలనూ కుదేలు చేసింది. ఎవరు చూసినా బడా నోట్లు బయటకు తీయడం... చేతి నిండా చిల్లరలేక పోవ డంతో దెబ్బకు కొనుగోళ్లన్నీ బందయ్యాయి. ఈ ప్రభావం కూరగాయల మార్కె ట్లపై అధికంగా కనిపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర రగడతో కూరగాయల మార్కెట్లకు కొనుగోలుదారుల రద్దీ అనూహ్యంగా తగ్గింది.మిగిలిన సరుకును నిల్వ చేసుకు నేందుకు కూడా కోల్డ్ స్టోరేజీలు అందుబాటు లో లేక కూరగాయలు కుళ్లిపోతున్నారుు. దీని వల్ల తాత్కాలికంగా డిమాండ్ తగ్గి... ధరలు దిగివచ్చాయి. పాత కరెన్సీ రద్దయిన తొలిరెండు రోజుల్లో ఇబ్బందులు పడ్డ వ్యాపారులు... ఆ తర్వాత అవసరానికి సరిపడా కూర గాయలను తీసుకుని, గల్లీ కిరాణా వ్యాపారులకు ఇవ్వడం మొదలెట్టారు. అయినా వ్యాపారం అనుకున్నంత స్థారుులో జరగకపోవ డంతో తాము తీసుకున్న రేటుకు కొంతమేర కలుపుకొని తక్కువకే విక్రరుుస్తున్నారు. ‘చిల్లర’దెబ్బ... నగర శివారుతో పాటు వివిధ జిల్లాల నుంచి టమాటా, వంకాయ, బెండ కాయ, సొర కాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ ఉత్పత్తి అవుతున్నారుు. కోటి జనాభా ఉన్న నగరానికి రోజూ ఒక్కొక్కరికి 350 గ్రాముల చొప్పున 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. హోల్‌సేల్ మార్కె ట్లకు 25 లక్షల కూరగాయలు వస్తున్నారుు. వేసవిలో పది లక్షల కిలోల వరకు నగరంలో కొరత ఉంటుందని, ఇప్పుడు ఆ స్థారుు ఇబ్బం ది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతు న్నారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం వారం రోజులుగా మార్కెట్‌కు వచ్చే లోడ్లపై పడిందని, కొనుగోలుదారులు ఆశించిన స్థారుు లో రాకపోవడంతో తీసుకున్న సరుకు కుళ్లిపో తోంది. రైతుబజార్లలోనూ ఇదే పరిస్థితి. రూ.కోటి తగ్గిన అమ్మకాలు... నోటురద్దు దెబ్బకు బోయిన్పల్లి మార్కెట్ కుదేలరుుంది. రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగే ఈ మార్కెట్లో రాబడి ఒక్కసారిగి పడిపో రుుంది. దాదాపు కోటి మేరకు అమ్మకాలు పడి పోయాయి. గురువారం సాయంత్రం ఆరు గంటలకు క్యారెట్(గ్రేడ్ 1) పది కిలోలు రూ.70కి పడిపోరుుంది. వారం కిందట పది కిలోలు రూ.1,500కు విక్రరుుంచారు. కొనేవాళ్లు లేరు... బోయిన్పల్లి మార్కెట్ యార్డులో జరిగే కూరగాయల క్రయ, విక్రయాలతో నేరుగా సుమారు 2 వేల మందికి, పరోక్షంగా వేలాది మంది రైతులు, రైతు కూలీలకు ఉపాధి సమ కూరుతుంది. రాజధాని చుట్టూ ఉండే వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ నిత్యం వెరుు్యకి పైగా వాహనాల ద్వారా పెద్దఎత్తున కూరగాయలు మార్కెట్‌కు వస్తాయి. ఇక్కడి కమిషన్‌న్ ఏజెంట్ల మధ్య వర్తిత్వంతో వాటిని విక్రరుుస్తారు. రైతులకు నేరుగా నగదు అందజేస్తారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో హోల్‌సేల్ కూరగాయ విక్రేతలు కొనుగోళ్లను భారీగా తగ్గించేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నగదు సమస్య కారణంగానే తాము క్రయ, విక్రయాలు చేయలేకపోతున్నా మంటున్నారు. దిగుబడి పెరిగినా తిప్పలే ఈసారి క్యారెట్ పంట దిగుబడి బాగా పెరిగింది. పదిరోజుల క్రితం వరకు రోజుకు 500 కిలోల వరకు మార్కెట్‌కు తరలిస్తే రూ.7వేల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కేవలం రూ.3వేలే అందుతుంది. - పాండురంగారెడ్డి, షాబాద్ రోజురోజుకూ తగ్గుతోంది మార్కెట్లో నగదు కొరత తీవ్రంగా ఉం డటంతో రోజు రోజుకీ తక్కువ ధరకే అమ్ము కోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా చిల్లర సమస్యతో పదిరోజులుగా కిలోకు రోజుకు రూ.1 చొప్పున తక్కువ ధరకు అమ్ముకుం టూ ఉన్నాం. - శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల సగం కూలీనే దక్కుతోంది మార్కెట్లో సుమారు 800మంది హమాలీలు ఉన్నాం. చిల్లర లేని కారణంగా సేఠ్లు, రైతుల సమస్యను చూసి కొన్ని సందర్భాల్లో సగం కూలి రేట్లే ఇస్తున్నా సర్దుకోవాల్సి వస్తోంది. - సంపత్, మల్లేశ్(హమాలీలు) -
నష్టాల్లో పెసర రైతు
- పెరిగిన పెట్టుబడులు - దిగుబడి రాక, ధర లేక ఇబ్బందులు రాయికోడ్: పెసర రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రెండేళ్లుగా వివిధ పంటల దిగుబడి రాక ఆర్థికంగా సతమతమయ్యారు. ఈ ఏడాది వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో పెసర దిగిబడి చేతికందుతోంది. ఈ దశలో పెసర్లకు మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో పెసర నూర్పిడిలు పూర్తయి దిగుబడి రైతుల ఇళ్లకు చేరింది. మరికొన్ని గ్రామాల్లో నూర్పిడులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది 1,050 ఎకరాల విస్తీర్ణంలో పెసర సాగు చేశారు. గత ఏడాది క్వింటాలు పెసర ధర రూ.8 వేల వరకు పలుకగా ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు మాత్రమే ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో పెసర రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెసరర సాగుకు విత్తనాలు, ఎరువులు, చీడపీడల నివారణకు రసాయనాల కొనుగోలు, నూర్పిడి, తదితరాల కోసం పంట ఇంటికి చేరే వరకు ఎకరా పెసర సాగు కోసం రూ.8 వేల వరకు పెట్టుబడులు పెట్టామంటున్నారు. ఎకరా విస్తీర్ణానికి రెండు క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కకుండా పోతోందని ఆవేదనచెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు పెసర ధర రూ.8 వేలు పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అన్నమే తింటున్నామా?
మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుందట. అయితే ప్రతి ఉరితాడు మీద, ప్రతి పురుగుల మందు సీసా మీద మనకు ఇంత ముద్ద పెడుతున్న రైతన్నల పేర్లు ఎందుకు ఉంటున్నాయి? కడుపు నింపే అన్నం గింజకు, విధికి ఉన్న సంబంధమే... అన్నదాతకు, ఆత్మహత్యకు ఉండాలా?! అన్నదాత అని, దేశబంధు అని, జై కిసాన్ అని... నినాదాలతో ఇంకా ఎంతకాలం రైతును మోసం చేస్తారు? మనం తినేది పెరుగన్నం... వారికి మిగిల్చేది పురుగన్నమా? రైతుల పట్ల నిర్లక్ష్యంతో ఇంకెన్నాళ్లు ఉరిసాగు చేస్తారు? రైతు మన ఫ్యామిలీ మెంబర్ అని నమ్ముతున్నాం. తనకు ఏ కష్టం వచ్చినా, మన ఫ్యామిలీ దన్నుగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. అందుకే ఇవాళ ఫ్యామిలీలో రైతు దుఃస్థితికి అద్దం పట్టే కొన్ని ఆత్మహత్య సంఘటనలను ప్రచురిస్తున్నాం. ఈ చేదు నిజాలు, కఠోర సత్యాలు మీరు అర్థం చేసుకుంటే ఈ ఆత్మహత్యలు ఆగిపోతాయని మేం నమ్ముతున్నాం. తను ఒక మనిషని, తనకీ ప్రేమించే ఒక కుటుంబం ఉంటుందనీ, తనకీ ఆశలు, ఆశయాలు, చిన్ని చిన్ని కలలు ఉంటాయని మనం అర్థం చేసుకోకపోతే రైతు ఒక అంకెగా మాత్రమే మిగిలిపోతాడేమోనని భయపడుతున్నాం. జన్మనిచ్చిన తల్లి తర్వాత స్థానం రైతన్నది. ఆ అన్నకు ధైర్యం చెబుదాం. వెన్నుదన్నుగా ఉందాం. ఆ అన్న కోసం పోరాడదాం. ఆ అన్న రుణం తీర్చుకుందాం... ‘అన్నం’ రుణం తీర్చుకుందాం. ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది. అలాగే, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల వేతనాల లాంటి ఖర్చులు దాదాపు 100 నుంచి 500 శాతం దాకా పెరిగాయి. దాంతో, దేశంలోని రైతులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, కొత్త మెథడాలజీతో రైతు ఆత్మహత్యలకు సంబంధించి ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంకలనం చేస్తున్న డేటా అంతా కఠోరమైన నిజాన్ని నీరు గార్చిన సమాచారమే! దీనివల్ల రైతుల దీనావస్థకు సంబంధించిన వాస్తవచిత్రం బయటకు కనపడడం లేదు. పాలగుమ్మి సాయినాథ్ వ్యవసాయ రంగంపై నైపుణ్యమున్న ప్రముఖ జర్నలిస్టు- ప్రతిష్ఠాత్మక ‘రామన్ మెగసేసే’ అవార్డు గ్రహీత రైతు చితి కాలుతోంది..! పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వ హామీలు అమలు కాక, కాలం కలిసిరాక రైతు కుదేలవుతున్నాడు. పంటలను పోషించడానికి చేసిన అప్పుల కుప్పలు మిగులుతున్నాయి తప్ప ధాన్యం కుప్పలు కనిపించడం లేదు. ఇల్లాలి పుస్తెలమ్మి, పురుగు మందులు కొంటున్నాడు. ఆ మందులు పంటల చీడలను వదిలిస్తున్నాయో లేదో కానీ పంటనే నమ్ముకున్న రైతును మాత్రం బలి తీసుకుంటున్నాయి. అప్పు చేసి పండించిన పంట చేతికి రాక వరదల పాలైతే కళ్ల ముందే అన్నపు గింజలు నీటి పాలవుతుంటే - రైతు కడుపు చెరువవుతోంది. కన్నీటిని కడుపులో దాచుకుని, చెట్టుకి తగిలించిన సద్దిమూటను తీసి పక్కన పెట్టి, ఆ చెట్టుకు ఉరితాడు బిగించుకుంటున్నాడు. ఒక మరణం... ఊరికే రాదు. వేనవేల ఆక్రోశాల నుంచి పుడుతుంది. అంతకు మించిన సంకేతాలను జారీ చేస్తుంది. చిట్టచివరగా... అంతకంటే మరో మార్గం లేక... తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక... తల ఎత్తుకుని జీవించలేక... బతుకు ప్రయాణం చేతకాక తలవాల్చుతున్నాడు రైతు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. ‘రైతన్నా! పంట వేశావా, ఎరువులకు డబ్బు కావాలా, బ్యాంకు రుణాలు వస్తున్నాయా, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర పలుకుతోందా, నీ రెక్కల శ్రమ, నువ్వు చిందించిన స్వేదానికి ప్రతిఫలంగా కనీసం నీ కడుపైనా నిండుతోందా...’ అని పట్టించుకున్న పాపాన పోవడం లేదు పాలకులు. పైగా ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అంటూ రైతు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. రైతు మీద కనీస గౌరవం లేని ఈ పాలకులు ఆ నాడు... ఎన్నికల నాడు... వేదికలెక్కి... మైకులు పుచ్చుకుని... ‘రుణమాఫీ చేస్తా’మని, ‘రైతును కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’మని హామీలెలా ఇచ్చారో? అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలకే తెలియాలి. కంప్యూటర్ అన్నమై మన కంచంలోకి రాదు, కార్పొరేట్ కంపెనీల ఐడియాలు దుక్కిదున్ని సాగుచేయవు. మన కంచంలోకి ఇంత అన్నం రావాలంటే... ఏం చేసినా రైతే చేయాలి. రెసిషన్ వస్తే వ్యాపారాలు మందగిస్తాయి. కొనుగోళ్లు తగ్గుముఖం పడితే ఆటోమేటిగ్గా అమ్మకాలూ డల్ అవుతాయి. వ్యాపారులు మంచి కాలం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతుంటారు. కానీ... సాగు అలా కాదు, రైతు అలా చేయడు. ఏటా దుక్కి దున్నుతాడు. నేలను సిద్ధం చేస్తాడు. ఆకాశంలో వానచుక్కను చూసి నేలలో విత్తనం చల్లుతాడు. కరవు కాటు వేస్తుందో, వరద విలయతాండవం చేస్తుందోనని వెరవడు. తన వంతుగా తన పని తాను చేసుకుపోతాడు. ‘కర్మ చేయడం వరకే నీ వంతు. ఫలితం గురించి ఆలోచించకు నాకొదిలెయ్’ అంటూ శ్రీకృష్ణుడు చేసిన బోధ రైతుకి తెలియదు. అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరుతాడు. అలాంటి రైతు పండించిన పంట ప్రకృతి విలయంలో నీటి పాలైతే, రైతు కన్నీటి పాలవుతాడు. ఆ రైతు కన్నీరు తుడవడానికి పాలకులకు చేయి రావడం లేదు. ‘ప్రభుత్వం అండగా ఉంటుంది, బ్యాంకు రుణం ఇస్తుంది, మళ్లీ పంట వేసుకో’ అని భుజం తట్టే చెయ్యి కరవైంది. అందుకే... రైతు ఇంట పొయ్యిలో నిప్పు రాజుకోవడం లేదు. చితిమంటలు వెలుగుతున్నాయి. - వాకా మంజులారెడ్డి అప్పుల ఊబిలో... ఆంధ్ర రైతు దేశం మొత్తం మీద 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వీరి శాతం 92.9 శాతం. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) తేల్చిన లెక్కలివి. ప్రతి కుటుంబానికూ ఉన్న సగటు అప్పు జాతీయ స్థాయిలో రూ. 47 వేలు. అదే ఆంధ్రాలో 1,23,400 రూపాయలు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు రాకపోవడం, తీవ్రమైన ప్రభుత్వ వైఫల్యాలు. ఆ 13 ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం సాధ్యమేనా? వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పరిశ్రమకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఉంటుంది. ఏటా సుమారు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే వ్యవసాయదారులకు మాత్రం ఉండదు. ఎంత చిత్రమో కదా.. పరిశ్రమలు స్థాపిస్తే వారం, పది రోజుల్లో అనుమతించేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే విధానాన్ని వ్యవసాయంలో పెట్టడానికి మాత్రం ముందుకు రాదు. అమలు చేయదు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, మనోవేదనతో అన్నదాత ఆత్మహత్య చేసుకుంటే నిర్ధారణకు 13 ధ్రువీకరణపత్రాలు కావాలి. వీటిని సమర్పించడం పేద రైతు కుటుంబాలకు సాధ్యమేనా? ఈ సర్టిఫికెట్లన్నీ ఒకే చోట కల్పించే మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు అన్వేషించడం లేదు? 2004 జూన్ 1 వైఎస్ తెచ్చిన చరిత్రాత్మక జీవో 421 రైతు ఆత్మహత్యల నివారణకు 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 జూన్ 1న చరిత్రాత్మక జీవో 421ను తీసుకువచ్చారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు అపర భగీరథుడు తెచ్చిన జీవో అది. మనోవ్యధతో ఆత్మహత్యలు చేసుకునే వారి కుటుంబాలకు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ అమలుకు ఉద్దేశించిన జీవో అది. అప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకు ముందు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సైతం రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. చేసుకున్నది ఆత్మహత్యేనని ఋజువు చేసుకోండి! రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అది ప్రభుత్వం గుర్తించడానికి ఏకంగా 13 రకాల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇవన్నీ ఒక పట్టాన అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వాటిని ప్రభుత్వం తొమ్మిదికి కుదించనుంది. ప్రస్తుతం ఈ కసరత్తు నడుస్తోంది. ఇంకా జీవో వెలువడలేదు. కొత్తగా ప్రతిపాదించనున్న పత్రాలు ఇవి... 1. పోలీసు ఎఫ్ఐఆర్ 2. శవ పరీక్ష నివేదిక 3. మరణ ధ్రువీకరణ పత్రం 4. వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకున్నట్టుగా ప్రామిసరీ నోటు వంటి రుణ పత్రాలు (లోన్ డాక్యుమెంట్లు). ఒకవేళ ఈ పత్రాలు లేకుంటే రైతులు రుణం తీసుకున్నట్టుగా సాక్ష్యాధారాలు చూపించేందుకు ఈ కింది వాటిని వినియోగించవచ్చు. అవి... ఎ)తనఖా రశీదులు బి) విత్తన వ్యాపారులు, ఎరువుల డీలర్ల నుంచి తీసుకున్న వాటికి సంబంధించిన రశీదులు సి) ఇరుగు పొరుగు, పంచాయితీ సభ్యులు, కమ్యూనిటీ పెద్దలు, వీఆర్ఓ, సీబీవోలు లేదా వీవోల నుంచి రూఢిపరుచుకోవడం. 5. బ్యాంకు రుణపత్రాలు (స్వయం సహాయక సంఘాల రుణాలు సహా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న రుణాలన్నింటినీ ఆత్మహత్యల నిర్ధారణ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యులు.. అంటే తల్లితండ్రులు, భార్యాభర్తలు, పెళ్లికాని పిల్లలు) 6. భూమి ఉన్న రైతు విషయంలోనయితే... ఆత్మహత్య చేసుకున్న రైతు తర్వాత వ్యవహారాలను పర్యవేక్షించే కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు) ధ్రువీకరణ పత్రం 7. కౌలు రైతు విషయంలోనయితే... ఎ. సాగుదారుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండాలి బి. రుణ అర్హత పత్రం సి. రాతపూర్వక కౌలు ఒప్పందం డి. మార్కెట్ యార్డు అధికారిక రశీదులు ఇ. వీఆర్ఓ/సర్పంచ్ /పంచాయితీ సభ్యులు/కమ్యూనిటీ పెద్దలు/సీబీఓలు చెప్పే సాక్ష్యం. ఫలానా భూమిని సంబంధిత రైతు కౌలుకు చేస్తున్నారని చెప్పినా ఆత్మహత్యల నిర్ధారణ కమిటీ పరిశీలించాలి. 8. కుటుంబ సభ్యుని పత్రం 9. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు. -
ప్రకృతి సేద్య క్రాంతి!
♦ తీవ్ర కరువులోనూ మెట్టపొలంలో చక్కని పంట దిగుబడులు ♦ ఎకరానికి పది వేల కొబ్బరి కాయల దిగుబడి ♦ బ్రకోలి తదితర సంప్రదాయేతర పంటల సాగులోనూ అద్భుత ఫలితాలు ♦ కూరగాయల ద్వారా ఎకరానికి రూ. 80 వేలకు పైగా నికరాదాయం ఇరైవె ఏళ్లుగా గుప్పెడు రసాయనిక ఎరువు గానీ, చెంచాడు పురుగుమందు గానీ వేయని కొబ్బరి తోట ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆఖరికి చుక్క కలుపు మందు కూడా చల్లకుండా, ట్రాక్టర్‌తో ఒక్కసారీ దున్నకుండా ఉంటే ఆ నేల ఎంత సజీవంగా, ఎంత సారవంతంగా ఉంటుంది? అటువంటి తోటలో కొబ్బరి గెలల సోయగం ఎంత కన్నుల పండువగా ఉంటుంది? చెట్ల మధ్య ఖాళీ స్థలాలను కాడెద్దుల అరకతో దున్ని అంతరపంటలుగా కూరగాయలు పండిస్తే ఆ పచ్చని పంటల దిగుబడి ఎంత అద్భుతంగా ఉంటుంది? అంతేకాదు.. వాన నీటిని భూమికి కడుపునిండా తాపితే.. ఎన్నడూ లేనంత కరువు ముంచుకొచ్చి గ్రామంలో బోర్లు, పంటలు నిలువునా ఎండిపోయినా.. వందడుగుల్లోతు బోర్లే మూడించుల నీళ్లు పోయకుండా ఉంటాయా? కొబ్బరితోపాటు చలి ప్రాంతపు పంటలైన కాలీఫ్లవర్, బ్రకోలి పూలు కరువు కాలపు మండుటెండల్లోనూ విరగపండకుండా ఉంటాయా?.. ఇదంతా అందమైన ఊహ కాదు. కళ్లెదుటున్న వాస్తవం. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో క్రాంతికుమార్‌రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయదారుడు నిర్మించుకున్న పచ్చని సేద్య సౌధం ఇది.. పంట మొక్కలకు రసాయనిక ఎరువులు గుప్పించడం కాదు.. భూమికి బలిమినివ్వటమే ప్రకృతి సేద్యపు మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ కొబ్బరి తోటలో బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి సంప్రదాయేతర కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ.. అబ్బురపరిచే దిగుబడులు పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు డా. కనమతరెడ్డి క్రాంతికుమార్ రెడ్డి. రైతు కుటుంబంలో జన్మించి సుస్థిర వ్యవసాయంపై పి.హెచ్.డి. పట్టా పొందిన ఆయన ప్రకృతి సేద్యాన్నే వృత్తిగా స్వీకరించారు. చింతలపూడి మండలం ప్రగడవరంలోని తమ 35 ఎకరాల్లో పామాయిల్, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. 30 ఎకరాల్లో పామాయిల్ తోట ఉంది. ఐదెకరాల కొబ్బరి తోటలో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటకు 15 ఏళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడలేదు. భాస్కర్ సావే వంటి ప్రకృతి సేద్య నిపుణుల బోధనలకు ఆనాడే ప్రభావితుడైన ఆయన తన తోటలో ట్రాక్టర్‌తో ఎన్నడూ దుక్కి చేయలేదు. కలుపును సమస్యగా భావించలేదు. కలుపు మందులు చల్లలేదు. 8 ఏళ్ల క్రితమే జీవామృతంతో పసుపు పండించి ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. కొబ్బరి చెట్ల మధ్య ఖాళీల్లో (సుమారు ఎకరం విస్తీర్ణం) ఈ ఏడాది 15 రకాల కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. అంతరపంటలకు అందించిన నీరు, జీవామృతం తప్ప.. కొబ్బరి తోట కోసం అదనంగా ఖర్చేమీ లేదు. అయినా, కొబ్బరి దిగుబడి రికార్డు స్థాయిలో ఉంది. 130 కొబ్బరి చెట్ల ద్వారా 25 వేల కొబ్బరి కాయల దిగుబడి వచ్చింది. బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి పంటలను ఈ ప్రాంతంలో మొదటిసారిగా పండిస్తున్నారు. టమాటొ, క్యాబేజి, బెండ, చేమదుంప, పచ్చి మిర్చి, వంగ, దోస, క్యాప్సికం, సొర కాయ, నేతి బీర, అల్లం, పుదీన, ఉల్లితో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులతోపాటు రసాయనిక కలుపు మందులూ చెంచాడు కూడా వాడకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో చక్కని దిగుబడులు పొందుతూ తోటి రైతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండడం విశేషం. విజయవాడలోని ప్రత్యేక ప్రకృతి వ్యవసాయోత్పత్తుల దుకాణాలకు విక్రయిస్తున్నారు. అనూహ్యంగా బ్రకోలి దిగుబడి.. పది సెంట్ల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన 800 బ్రకోలి మొక్కలు చక్కని దిగుబడినిచ్చాయి. బ్రకోలిని సాధారణంగా పాలిహౌస్‌లలో, షేడ్నెట్ల కింద రెయిజ్డ్బెడ్లపై ఇన్లైన్ డ్రిప్‌తో అతి జాగ్రత్తగా సాగు చేస్తుంటారు. అయితే, ఆరు బయట పొలంలో సాగు చేస్తే అనూహ్యంగా చక్కని దిగుబడినివ్వడం తనకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించిందని, కొన్ని బ్రకోలి పూలు 400 గ్రా. బరువు తూగాయని డా. క్రాంతికుమార్‌రెడ్డి తెలిపారు. బ్రకోలి మొక్క నుంచి పూవును కోసిన తర్వాత.. పక్క కొమ్మలకు మళ్లీ పూలు వస్తుండడం తనను మరింత ఆశ్చర్యపరుస్తోందన్నారు. వీటికి విజయవాడ సూపర్మార్కెట్లలో కిలో రూ. 200 వరకు ధర పలుకుతుందన్నారు. ఎకరం విస్తీర్ణంలో వేసిన కూరగాయల ద్వారా రూ. 80 వేల నుంచి లక్ష వరకు నికరాదాయం రావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే తమకు అయిన ఖర్చు సగమేనని, ఇందులో కూలీల ఖర్చే అధికమన్నారు. పూర్తి సేంద్రియం కాబట్టే మంచి దిగుబడి..! కాగా, క్రాంతికుమార్ రెడ్డి తోటలో బ్రకోలి పంట దిగుబడి అద్భుతంగా వచ్చిందని ఉద్యాన అధికారి సంతోష్ (94410 59624) తెలిపారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసినందునే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిన వాతావరణంలోనూ నాణ్యమైన పంట వచ్చిందన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితే ఇది అసాధ్యమన్నారు. వచ్చే సీజన్లో మరింత విస్తారంగా బ్రకోలి సేంద్రియ సాగు చేయిస్తామన్నారు. వెల్లుల్లి రసం+ వేపనూనె +గోమూత్రం పిచికారీ ప్రతి 10 రోజులకోసారి బోరు నీటి ద్వారా, పిచికారీ ద్వారా పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. దేశీ ఆవుల ఎరువు, గొర్రెలు, మేకల ఎరువుతోపాటు పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. 100 గ్రా. వెల్లుల్లి పాయలను మెత్తగా నూరి వడకట్టిన రసాన్ని.. 10 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసి కాలీఫ్లవర్‌ను ఆశించే బూజు, లద్దె పురుగులను నివారిస్తున్నారు. పిచికారీ చేసేటప్పుడు దీనికి 100 గ్రా. వేపనూనెతోపాటు అర లీ. గోమూత్రాన్ని కలుపుతున్నారు. వేపనూనె వికర్షకంగా పనిచేయటం వల్ల కీటకాలు మొక్కలను ఆశించవు. గో మూత్రం వల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి అంటారు క్రాంతికుమార్‌రెడ్డి. వాననీటి సంరక్షణతో సాగునీటి భద్రత పొలం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న వాగులో మూడు చోట్ల కొండరాళ్లతో రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. గత ఏడాది చెక్ డ్యామ్‌ల మీదుగా వాన నీరు ప్రవహించింది. ఈ ఏడాది వర్షాలు బాగా తగ్గిపోవడంతో వాన నీరంతా చెక్‌డ్యామ్‌ల వద్దే భూమిలోకి ఇంకింది. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల గ్రామ పరిసర ప్రాంత పొలాల్లో బోర్లు, మొక్కజొన్న తదితర పంటలు ఇప్పటికే నిలువునా ఎండిపోయాయి. అయినా.. క్రాంతికుమార్‌రెడ్డి తోటలోని బోర్లు (వీటి లోతు వందడుగులే) ఇప్పటికీ మూడించుల నీటిని పోస్తున్నాయి. ప్రకృతి సేద్య పద్ధతితోపాటు వాననీటి సంరక్షణలోనూ ఆయన ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయం. తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించే రైతులు, ఉద్యోగస్తుల్లో కొందరు ప్రకృతి పద్ధతుల్లో కూరగాయ పంటల సాగుకు సిద్ధమవుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని క్రాంతికుమార్‌రెడ్డి సంబరపడుతున్నారు. - ఎస్.కె. అమీర్ పాషా, చింతలపూడి, ప.గో.జిల్లా భూమిని బాగు చేసుకుంటే ఏ పంటైనా పండుతుంది! ఉద్యాన తోటలతో పాటు చలిప్రాంతాల్లో పాలీహౌసుల్లో పండించే బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి అరుదైన కూరగాయ పంటలను సైతం.. ప.గో. జిల్లా మెట్ట ప్రాంతంలో ఆరుబయట పొలాల్లోనూ పండించడం సాధ్యమేనని చాటి చెప్పడమే నా అభిమతం. చాలా ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతిని అమలు చేస్తుండడంతో సారవంతంగా మారిన మా పొలంలో మట్టి.. సేంద్రియ ఎరువును తలపిస్తున్నది. అందువల్లే కొబ్బరితోపాటు బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి పంటలు ఆశ్చర్యకరమైన దిగుబడులిస్తున్నాయి. చింతలపూడి ఉద్యాన అధికారి సంతోష్ ప్రోత్సాహంతోనే బ్రకోలి ప్రయోగాత్మకంగా సాగు చేశా. వాననీటి సంరక్షణకు వాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో కరువును జయించడం సాధ్యమైంది. - డా. కనమతరెడ్డి క్రాంతికుమార్‌రెడ్డి (77020 84702), ప్రకృతి వ్యవసాయదారుడు, ప్రగడవరం, చింతలపూడి మం., ప.గో. జిల్లా 3 రోజులకో పిచికారీ.. నాగలి సాళ్లు తోలి (సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగులు) నెల రోజుల బ్రకోలి మొక్కలు నాటారు. రెండు నెలల్లో 4 సార్లు జీవామృతం బోరు నీటి ద్వారా ఇచ్చారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రంతోపాటు వెల్లుల్లి+ వేపనూనె + ఆవు మూత్రం మిశ్రమం మాత్రమే వాడి పురుగులను అదుపుచేశారు. 3 రోజులకోసారి ఏదో ఒక ఇప్పటికి 15 సార్లు పిచికారీ చేశారు. బ్రహ్మజెముడుతో విద్యుత్ వెలుగులు! ఎడారి మొక్క బ్రహ్మజెముడు నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ఘనతను మెక్సికో దక్కించుకుంది. నోపాలిమెక్స్ అనే కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. బ్రహ్మజెముడు గుజ్జును ఉత్ప్రేరకాలు ఉన్న తొట్టెలో కలుపుతారు. దీని నుంచి ఉత్పత్తయిన మీథేన్‌ను మండించటం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గ్రిడ్ ద్వారా అందించే విద్యుత్‌లో సగం ధరకే ఇది లభ్యం కావడం విశేషం. ప్రస్తుతం 300 గృహాలకు ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మరో 8 టన్నుల జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి జిటాక్యూరో పట్టణంలోని వాహనాలకు రోజూ సరఫరా చేస్తున్నారు. నగరంలోని వాహనాలకు దీని వాడకం వల్ల గాసోలిన్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. దశాబ్దం క్రితం నొపాలిమెక్స్ కంపెనీ మొక్కజొన్న, బ్రహ్మజెముడు చిప్స్ తయారు చేసేది. ఆ కంపెనీ విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలించే క్రమంలో బ్రహ్మజెముడు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయాలనే ఆలోచన వారికి తట్టింది. 2024 నాటికల్లా మొత్తం విద్యుత్‌లో 35 శాతాన్ని ఈ పద్ధతిలోనే ఉత్పత్తి చేయాలని మెక్సికో ప్రభుత్వం భావిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతాలకు ఈ పంట సాగు ఉపయోగకరంగా ఉంటుంది. జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఇతర పంటలకు అనువుకాని ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేయవచ్చు. మెక్సికోలోని ఎడారి ప్రాంతాల్లోనూ బ్రహ్మజెముడు వనాలు విసృ్తతంగా ఉన్నాయి. అక్కడ మామూలు పంటల సాగు సాధ్యం కాదు. ఇటువంటి ఎడారి ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేస్తే.. ఇప్పుడు జీవ ఇంధన పంటలను సాగు చేసుకునే భూముల్లో ఆహార పంటలు పండించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుల్లడిగుంటలో 28న రైతు సదస్సు గుంటూరుకు 12 కిలోమీటర్ల దూరంలోని పుల్లడిగుంట గ్రామంలో ఈ నెల 28న (ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, జీవవైవిధ్యం తదితర అంశాలపై రైతునేస్తం ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి రైతులు, ప్రకృతి జీవన శైలి ప్రేమికుల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకృతి ఫౌండేషన్ (మదనపల్లి) అధ్యక్షుడు ఎం. సి. వి. ప్రసాద్ తెలిపారు. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలతోపాటు ప్రకృతి వైద్యుడు డా. కుదరవల్లి విశ్వేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 094401 68816, 94905 59999 -
పశుసంపద తగ్గుదలతో అల్ప దిగుబడులు
నేలలలో సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాల కొరత ఏర్పడటం వల్ల ఐరోపాలోని పలు దేశాల్లో ప్రధాన పంటల సాగులో 1990 నుంచి దిగుబడుల్లో పెరుగుదల నమోదవలేదని శాస్త్రవేత్తల తాజా విశ్లేషణ తేల్చింది. భూమికి సేంద్రియ ఎరువులను అందించే పశుసంపద 1980నుంచి ఐరోపాలో క్రమేపీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు, సాగుయోగ్యమైన భూములు తగ్గిపోతున్నాయి. జర్మనీకి చెందిన మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్ఎఓ) నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. మధ్య, ఉత్తర ఐరోపాలో గత 20 ఏళ్లుగా విస్తృతంగా సాగవుతోన్న బార్లీ, గోధుమ వంటి చిరుధాన్యపు పంటలను పరిశోధన కోసం ఎంచుకున్నారు. గత ఇరవయ్యేళ్లుగా ఈ పంటల దిగుబడుల్లో పెరుగుదల లేదని తేలింది. సైన్స్ ఆఫ్‌ది టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. నేలలో ఉండే సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. వీటిని నేలకు అందించే కారకాలు ముఖ్యంగా పశుసంపద తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులకు అత్యంత అవసరమైన జీవనద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంట దిగుబడులపై ఇది పెను ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల సేంద్రియ పదార్థం సరఫరా నిలిచిపోయి.. అధిక స్థాయిలో జీవనద్రవ్యం నశించిపోవటం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. రసాయనిక ఎరువులను తక్కువగా వినియోగించటం, పప్పుజాతి పంటలను అధికంగా సాగుచేయటం, పంటమార్పిడి పద్ధతిని పాటించటం ద్వారానే ఈ సమస్యను అధిగమించగలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సేంద్రియ పదార్థం అందకుంటే దీర్ఘకాలంలో నేల జీవనద్రవ్యాన్ని కోల్పోతుంది. ‘ఇది ఇలానే కొనసాగితే భూగర్భ నీటి నిల్వలు, నేల భూసారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త వియోస్మియర్ చెప్పారు.పంట దిగుబడులకు సంజీవనిలా పనిచేసే జీవనద్ర వ్యాన్ని కాపాడుకోవటం అవసరమని దీనికోసం సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేయటం, పంటమార్పిడిని పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు అటవీ వనాల పెంపకం, పంట వ్యర్థాలను పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియలను చేపట్టటం ద్వారా జీవనద్రవ్యాన్ని నష్టపోకుండా నివారించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
పచ్చగన్నేరు, కలబంద ద్రావణంతో చీడపీడలు అవుట్!
ప్రకృతిలో లభించే ఔషధ మొక్కలే సేంద్రియ రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. ద్రావణాలను స్వయంగా తయారు చేసుకొని పురుగుమందులకు బదులుగా వాడుతూ నాణ్యమైన పంట దిగుబడులు సాధిస్తున్న రైతులెందరో ఉన్నారు. పచ్చగన్నేరు, కలబంద మొక్కలతో తయారు చేసిన ద్రావణం వివిధ పంటల్లో చీడపీడలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లాకు చెందిన పలువురు సేంద్రియ రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. కడప జిల్లా వెంపల్లె మండలం టి. వెలమవారిపల్లెకు చెందిన ఆదర్శ సేంద్రియ రైతు కె. విజయ్‌కుమార్ పచ్చగన్నేరు, కలబందలతో తయారు చేసిన ద్రావణాన్ని పంటలపై చీడపీడల నివారణకు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పచ్చ గన్నేరు, కలబంద దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ దొరికేవే. పొలాలు, చెరువు కట్టల వెంబడి విరివిగా కనిపిస్తాయి. వీటిని పశువులు మేయవు, చీడపీడలు ఆశించవు. అందుకే.. వీటితో ద్రావణం తయారు చేసి చీడపీడలను అరికట్టవచ్చన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి విజయకుమార్ సత్ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలను చూసి మరికొందరు రైతులూ తయారు చేసుకొని వాడుతున్నారు. వరి, మిర్చి, వేరుశనగ, వంగ, టొమాటో, బెండ, ఆకుకూరల పంటలతోపాటు నిమ్మ, బత్తాయి తోటల్లో దోమ, రెక్కల పురుగులు, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగుల నివారణకు ఈ ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని విజయకుమార్ తెలిపారు. ద్రావణం తయారీకి కావలసిన వస్తువులు : పచ్చగన్నేరు కొమ్మలు (పూలు, కాయలతో) = 5 కిలోలు కలబంద కాడలు = 5 కిలోలు ద్రావణం తయారీ విధానం.. పచ్చ గన్నేరు కొమ్మలను రోలు లేదా గ్రైండర్తో మెత్తని ముద్దగా చేసుకోవాలి. బాగా కండ పట్టిన 5 కిలోల అలోవీరా (కలబంద) కాడలకు తొక్క తీసి నుజ్జుగా చేయాలి. ఈ రెంటిని కలిపి 200 లీటర్ల నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టి లేదా సిమెంటు తొట్టెలో వేయాలి. ఇందులో 5 లీటర్ల పశువుల మూత్రం లేదా మనుషుల మూత్రం పోయాలి. గాడిద మూత్రం అయితే ఒక లీటరు సరిపోతుంది. వీటిన్నిటినీ వేసి కర్రతో బాగా కలపాలి. తరువాత 180 లీ. నీటిని పోయాలి. డ్రమ్ములో ఉన్న ద్రావణానికి గాలి, వెలుతురు తగిలేలా పైన పలుచటి గుడ్డ లేదా గోనె సంచిని కప్పాలి. వారం రోజుల పాటు ఈ ద్రావణాన్ని నీడలో నిల్వ ఉంచాలి. ఈ ద్రావణం 6 నెలల పాటు పనిచేస్తుంది. ఏ యే పంటకు ఎంత మోతాదు? ఈ ద్రావణాన్ని ఏ పంటపైనైనా పిచికారీ చేసుకోవచ్చు. ఉద్యాన, కూరగాయ పంటలపై మొదటిసారి పిచికారీ చేసేటప్పుడు.. 60 లీ. నీటికి ఒక లీటరు ద్రావణాన్ని, రెండో పిచికారీలో 80 లీ. నీటికి లీ. ద్రావణాన్ని, మూడో పిచికారీలో 100 లీ. నీటికి లీటరు ద్రావణాన్ని కలిపి చెట్లు మొదలు, ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుకూర పంటలపై లీ. ద్రావణాన్ని 60 లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మోతాదు మించకూడదు. ఈ ద్రావణాన్ని ఏడేళ్లుగా వాడుతున్నా.. పచ్చగన్నేరు, కలబంద ద్రావణాన్ని బత్తాయి, చిన్న నిమ్మ, సపోట, వేరుశనగ పంటలపై గత ఏడేళ్లుగా పిచికారీ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని విజయ్‌కుమార్ (98496 48498) తెలిపారు. ‘చిన్న నిమ్మలో ఆకుముడతను, సపోటలో కాయ తొలిచే పురుగును, వేరుశనగలో ఆకుముడత, దోమలను, వరిలో దోమను ఇది సమర్థవంతంగా నివారించింది. తీగజాతి కూరగాయ పంటల (బీర, చిక్కుడు, కాకర..)పై పూతరాక మునుపే రెండు నుంచి నాలుగు దఫాలు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. వంగ, టొమాటో, బెండ వంటి పంటలపై.. ముఖ్యంగా వంగలో దోమ, కాండం తొలిచే పురుగును నివారించ గలిగాం. ఈ ద్రావణం కొద్దిగా జిగురుగా ఉంటుంది. కాబట్టి రెక్కల పురుగులను నివారించటంలో సమర్థవంతంగా పని చేసింద’ని ఆయన వివరించారు. ఎన్. రవీంద్రరెడ్డి (99597 00559), కె. ప్రతాప్ (81060 51130) తదితరులు ఈ ద్రావణాన్ని అనేక సంవత్సరాలుగా వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. - సాగుబడి డెస్క్ ద్రావణం వాడకంలో మెలకువలు - పంట పూత దశలో ద్రావణాన్ని పిచికారీ చేయకూడదు. - పచ్చగన్నేరు కాయలు, రసం విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీన్ని తయారు చేసుకొనేటప్పుడు చేతులకు తగలకుండా జాగ్రత్తపడాలి. పచ్చగన్నేరు చెట్లు పూత, కాయలతో ఉన్నప్పుడు వాడితేనే ఫలితం బాగుంటుంది. - తెల్లదోమ, పచ్చదోమను నివారించేందుకు ఈ ద్రావణాన్ని సాయంకాలం గాలి ఉధృతి తగ్గిన తరువాత గాలి వాటంగానే పిచికారీ చేయాలి. గాలి బాగా వీచేటప్పుడు దోమ లేచి పోతుంది. అప్పుడు ద్రావ ణాన్ని పిచికారీ చే స్తే ఫలితం ఉండదు. పిచికారీ చేసే వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకోవాలి. - 20 రోజుల పంటపై 8 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. - చల్లని వాతావరణంలోనే ద్రావణాన్ని తగు మోతాదులో పిచికారీ చేయాలి. మోతాదు ఎక్కువైతే పంట మాడిపోతుంది. - ఆకుకూరలపై పిచికారీ చేస్తే.. కనీసం మూడు రోజుల తరువాతే వినియోగించాలి. -
అనంతపురంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుత్తి రూరల్/శెట్టూరు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు అనంతపురం జిల్లాలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామానికి చెందిన రైతు నడిపన్న(51) సోమవారం ఉదయం పొలానికి వెళ్లి తీవ్ర వర్షాభావ పరిస్ధితులతో ఎండి పోతున్న పంటలను చూసి ఇంటికి వచ్చాడు. ఇక ఈ ఏడాది కూడా పంట దిగుబడులు రాకపోతే రూ.8 లక్షల అప్పులు తీర్చలేనేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో శెట్టూరు మండలం మాలేపల్లిలో రైతు కమల్‌రాజు (43) రూ.2 లక్షల మేర ప్రైవేటుగా అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పాలుపోక సోమవారం సాయంత్రం ఇంట్లో ఉట్టికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి పదేళ్ల వయసులోపు ఇద్దరు పిల్లలతోపాటు భార్య ఉన్నారు. -
పంటలు ఎండుతున్నాయ్!
కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,పెసర పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు గనుక కురవకపోతే పంట దిగుబడులను మరిచిపోవాల్సిందేనని రైతులు మదన పడుతున్నారు. కేసీ చాపాడు, కుందూనది పరిధిలోని రైతులు ఆయిల్ ఇంజన్లు, ట్రాక్టర్ల పంపుల సహాయంతో ఎకరాకు రూ.1 నుంచి 3 వేల వరకు ఖర్చు చేసి నీటితుడులు అందించుకుంటున్నారు. పర్లపాడు, అర్కటవేముల, పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె, సోమాపురం, రాజుపాళెం తదితర గ్రామాల్లోని రైతులకు ఏనీరు రాక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల కిందట మైలవరం నీటిని వరిలామని అధికారులు చెబుతున్నా ఇంకా ఇంతవరకు మండలంలోని గ్రామాల పొలాలకు రాలేదని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఎండుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నామన్నారు. పెట్టుబడులన్నీ నేలపాలు కాక తప్పదని అంటున్నారు. -
రైతును మింగుతున్న అప్పులు
ఐదుగురి ఆత్మహత్య: ఒకరికి గుండెపోటు సాక్షి నెట్వర్క్: అప్పులు రైతులను బలితీసుకుంటున్నాయి. ఆరుగాలం కష్టపడినా అప్పు తీరే మార్గం కనిపించక కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అంబేద్కర్‌నగర్‌కు చెందిన గూడెం సడిమెల బాలయ్య(65) తన రెండెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇతని పొలం పక్కనే మురుగు కాల్వ ఉండగా, వ్యవసాయ భూమిలోని బోరు రసాయనాలతో కలిసి కలుషితమైంది. దీంతో పంట దిగుబడి తగ్గింది. గతేడాది ఇదే పరిస్థితి. బాలయ్య సాగు కోసం బ్యాంకులో రూ. 70 వేలు, ఇతరుల వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన కడ్తాల బాల్‌రెడ్డి(58) రెండెకరాల్లో సాగు చేశాడు. రెండేళ్లుగా పంటలు సరిగా పండడం లేదు. పెట్టుబడికి రూ.4 లక్షల వరకు అప్పు అయింది. దిగుబడి రాకపోవడంతో అప్పులెలా తీర్చాలని మనస్తాపం చెందిన అతడు శుక్రవారం సాయంత్రం పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం మరణించాడు. సైదాపూర్ మండలం బొత్తలపల్లికి చెందిన అనగోని లస్మయ్య(65) ఆరెకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి నిమిత్తం రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. అప్పులెలా తీర్చాలని మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం చనిపోయాడు. మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగూర్(బీ)కి చెందిన గాళప్ప (62) ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండేళ్లలో మొత్తం రూ. 4 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. ఇదే జిల్లా దుబ్బాక నగర పంచాయతీ ధర్మాజీపేటకు చెందిన బుంగ కనకయ్య(35) తనకున్న 4 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పొలంలో 4 బోర్లు వేయగా, నీరు పడలేదు. దీంతో సాగు చేసిన వరి, మొక్కజొన్న ఎండిపోయాయి. రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక శనివారం పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రైతు నాన్నం నర్సయ్య తన పొలంలోనే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
కలుపు మొక్కలు.. సమస్యలు
కలుపు మొక్కలు.. సమస్యలు కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడపీడల మాదిరిగా పంటలపై తక్షణం కనిపించదు. కలుపు మొక్కలు ప్రధాన పైర్లతో గాలి, వెలుతురు, నీరు, పోషకాల కోసం పోటీపడి వాటిని ప్రధాన పంటకు అందకుండా చేస్తాయి. పంట దిగుబడులు 20-60శాతం వరకు తగ్గిస్తాయి. వీటి వల్ల పంట దిగుబడి తగ్గడమే కాక నాణ్యత కూడా తగ్గుతుంది. చీడపీడలకు ఆశ్రయం ఇచ్చి ప్రధాన పైరుపై వాటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. నివారణ ఆవశ్యకత పంటలను చీడపీడల నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో.. కలుపు మొక్కల నుంచి పోటీ లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా, పెరిగినా పుష్పించి, విత్తనోత్పత్తి దశకు చేరుకోకుండా సకాలంలో నిర్మూలించాలి. పంట తొలిదశలోనే, అంటే పంట కాలంలో మూడింట ఒకవంతు సమయంలో పైరుకు కలుపు నుంచి ఎలాంటి పోటీ లేకుండా చూడాలి. కలుపు మందులను తేలికపాటి(ఇసుక,గరప) నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్రనేలల్లో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వాడాలి. సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, అంతరకృషి చేయుట మొదలగు సేద్యపద్ధతులను అవలంబిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న విత్తనం వేసిన 2-3రోజులలోపు తేలిక నేలల్లో అయితే ఎకరానికి 800గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరానికి 1200గ్రాముల అట్రజిన్‌ను 200లీటర్లల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను ఒకనెల వరకు అదుపు చేయవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం ఎకరానికి 1లీటరు పిండిమిథలిన్ను 200లీటర్ల నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల్లో పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే ఎకరానికి 500గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్ను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 30-35రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్‌తో అంతర పంట కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. జొన్న జొన్న విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల ఎకరానికి 800గ్రాముల అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్ల నీటిలోకలిపి తడినేలపై పిచికారి చేయాలి. జొన్న విత్తిన 35-40రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 2గ్రాముల 2,4డి సోడియం సాల్ట్ లేదా 50గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 200గ్రాముల యూరియాను కలిపి మల్లెపై పిచికారి చేసి నిర్మూలించవచ్చు. శనగ విత్తే ముందు ఎకరానికి 1లీటరు ప్లూక్లోరాలిన్ 45శాతం మందును పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని ఎకరానికి 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20,25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. పెసర, మినుము విత్తనం విత్తిన వెంటనే గాని, మరుసటి రోజుగాని ఎకరానికి 1లీటరు 50శాతం అలాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21-28రోజుల మధ్య ఎకరానికి 250మి.లీ. ఫినాక్సిప్రాప్ఇథైల్ (ఉదాహరణకు నివారణకు) 250 మి.లీటర్ల ఇమాజితాఫిర్(వెడల్పుకు కలుపు, బంగారుతీగ నివారణకు), 400మి.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ (ఊవ, చిప్పిర, గరిక నివారణకు) 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పొద్దుతిరుగుడు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి లీటరు పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50%ను కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి. 30-40రోజుల వరకు పంటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగ విత్తిన వెంటనే గాని లేదా 2-3రోజుల లోపు ఎకరానికి 1లీటరు అలాక్లోర్ 50శాతం లేదా 1.25-1.5లీటర్ల బుటాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండెమిథాలిన్ 30శాతం 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయరాదు. విత్తిన వెంటనే కలుపు మందులు వాడలేకపోయిన లేదా 20రోజుల వరకు కలుపు తీయలేని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును నిర్మూలించవచ్చు. విత్తిన 21రోజుల లోపు కలుపు 2-3ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300మిల్లీలీటర్ల ఇమాజిలిఫిర్ 10శాతం లేదా 400మీ.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ 5శాతంను 200లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారి చేసి కలుపును నిర్మూలించవచ్చు. కుసుమ విత్తిన వెంటనే గాని, మరుస టి రోజుగాని ఎకరానికి 1లీట రు అలాక్లోర్ 50శాతం లేదా పెండమిథాలిన్ 30శాతం కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-30రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25రోజులకు, 45-50రోజుల వరకు దంతులు తొలి అంతర కృషి చేయాలి. -
వర్షార్పణం
కరీంనగర్ అగ్రికల్చర్/జగిత్యాల అగ్రికల్చర్ : పంటల దశలో ముఖం చాటేసిన వానలు.. పంట దిగుబడులు చేతికొచ్చిన దశలో అన్నదాతలను దెబ్బతీస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి బోరున వర్షం కురవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. కరీంనగర్, హుస్నాబాద్, జమ్మికుంట, జగిత్యాల, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, శంకరపట్నం, బెజ్జంకి, సుల్తానాబాద్, కథలాపూర్, వీణవంక, కాల్వశ్రీరాంపూర్, మంథని, మహదేవపూర్, కాటారం, ముత్తారం, మల్హర్ తదితర మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోకి నీరు చేరి వరిధాన్యం, మక్కలు, పత్తి తడిసిపోయాయి. తూకం వేసి రవాణా చేయని బస్తాలతోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో మార్క్‌ఫెడ్‌తోపాటు ఐకేపీ నిర్వాహకులు కొనుగోళ్లను నిలిపివేశారు. మరోవైపు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొంటుండడం అన్నదాతలను కలవరపెడుతోంది. మరో నాలుగు రోజులు వర్షాలు మరోనాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈనెల 16 వరకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, 13న మూడు మిల్లీమీటర్లు, 14న 10 మిల్లీమీటర్లు, 15న 15మిల్లీమీటర్లు, 16న 12 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందన్నారు. ఈదురుగాలులు గంటకు 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, గాలిలో తేమ ఉదయం 90నుంచి 95 శాతం, మధ్యాహ్నం 46 నుంచి 64 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు. -
అంతా కరువే
జిల్లా రైతాంగాన్ని ఖరీఫ్ ముంచేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాత కుదేలయ్యాడు. ఎక్కడ చూసినా కరువుఛాయలే కన్పిస్తున్నాయి. భూగర్భజలాలు సైతం అడుగంటడంతో తాగునీటికీ కష్టకాలమొచ్చింది. అడపాదడపా కురిసిన వర్షాలు పంటలను గట్టెక్కించలేకపోయాయి. సీజన్ మొత్తంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 781 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. సీజన్ చివరినాటికి కేవలం 554.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సాధారణం కంటే 29శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికల్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జిల్లాలోని 37 మండలాలనూ కరువు పీడిత ప్రాంతాలుగా అందులో ప్రస్తావించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * 29 శాతం లోటు వర్షపాతం, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం * కరువు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన జిల్లా యంత్రాంగం * ఖరీఫ్‌లో మిగిలింది అప్పులే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 37 మండలాలున్నాయి. ఇందులో నాలుగు మండలాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా.. మిగతా 33 గ్రామీణ మండలాలు. తాజాగా జిల్లా యంత్రాంగం రూపొందించిన కరువు నివేదికల్లో అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా పేర్కొంది. పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో కరువు మండలాలుగా గుర్తించారు. 33 గ్రామీణ మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజన్ చివరలో అధిక వర్షాలు కురిసి వర్షపాతం నమోదైనప్పటికీ.. వాటి మధ్య అంతరం హెచ్చుగా ఉందని అధికారులు తేల్చారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.84లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను సీజన్ ముగిసే నాటికి 1.62లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా వేలాది హెక్టార్లలో విత్తనాలు మొలకెత్తలేదు. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులను పంట తట్టుకున్నప్పటికీ దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో సీజన్ ముగిసిన అనంతరం చేసిన సర్వేలో పంటల దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు తేల్చారు. మొత్తంగా అన్నివిధాలా నష్టం జరగడంతో జిల్లాలోని 37 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. నాలుగు అంశాలే ప్రామాణికం.. కరువు నివేదికలపై యంత్రాంగం నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారించింది. వర్షపాతం, వర్షాల మధ్య అంతరం, సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాల ఆధారంగా కరువును ఖరారు చేసింది. జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. వర్షాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సాగు విస్తీర్ణం, దిగుమతుల అంశాల్లోనూ ఆశాజనక పరిస్థితులు లేక పోవడంతో ఆమేరకు అన్ని మండలాలు కరువు నివేదికల్లోకి ఎక్కాయి. లబ్ధి ఇలా.. జిల్లా యంత్రాంగం సమర్పించిన నివేదికల్ని ప్రభుత్వం ఆమోదిస్తే రైతులకు పెట్టుబడి రాయితీ అందుతుంది. అదేవిధంగా పంటరుణాలు రీషెడ్యూల్ చేసే వెసులుబాటు వస్తుంది. అదేవి దంగా తాగునీటి సరఫరా మొరుగుపర్చేందుకు ప్రత్యేక నిధులు అందుతా యి. ఇవేకాకుండా కరువు ప్రభావంతో కలిగిన నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -
వేరుశనగ రైతు లబోదిబో...
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ పంట ‘అనంత’ రైతుల పాలిట శనిలా దాపురించింది. ఏటా భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నా ప్రత్యామ్నాయ మార్గం లేక వేరుశనగ పంటనే నమ్ముకుని సాగు చేస్తున్నారు. కానీ ఫలితం పునరావృతమవుతూనే ఉంది. ఈ ఏడాది కూడా వేరుశనగ పంట దిగుబడులు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులు చేపట్టిన పంట కోత ప్రయోగాల ఫలితాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్) చూస్తే వేరుశనగ పంట దిగుబడులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతుంది. కొన్ని ప్రయోగాల్లో ‘జీరో’ దిగుబడులు వచ్చాయంటే రైతులు ఎంతగా నష్టపోయారో తెలుస్తుంది. దెబ్బతీసిన వర్షాభావం... ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఈ ఏడాది వేరుశనగ పంట 5,06,929 హెక్టార్లకు పడిపోయింది. అందులో 4.96 లక్షల హెక్టార్లు వర్షాధారంగానూ తక్కినది నీటి వసతి కింద సాగు చేశారు. అయితే జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్లు (మి.మీ) గానూ 44.9 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ 35.7 మి.మీ, ఆగస్టులో 88.7 మి.మీ గానూ 56.8 మి.మీ, సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ కేవలం 35 మి.మీ వర్షం కురిసింది. అంటే ఖరీఫ్‌లో 335.4 మి.మీ వర్షం పడాల్సివుండగా 50 శాతం తక్కువగా 172 మి.మీ వర్షం పడింది. ఐదారు మండలాలు మినహా తక్కిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ప్రధానంగా కీలకమైన సెప్టెంబర్ నెలలో వర్షాలు మొహం చాటేయడంతో వేరుశనగ పంట దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నాయి. కిష్టిపాడులో ‘జీరో’... పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో చేపట్టిన పంట కోత ప్రయోగాల్లో పంట దిగుబడులు ‘జీరో’ వచ్చాయి. అంటే చెట్టుకు ఒక్క కాయ కూడా లేని దయనీయ పరిస్థితి. వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులు ఇప్పటివరకు డి.హిరేహాల్, ముదిగుబ్బ, కనేకల్లు, రాయదుర్గం, గుంతక ల్లు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పామిడి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు మండలాల పరిధిలో గుర్తించిన సర్వే నెంబర్ పోలాల్లో 5ఁ5 విస్తీర్ణంలో 30 పంట కోత ప్రయోగాలు పూర్తీ చేశారు. దాదాపు అన్ని చోట్ల పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. కిష్టిపాడు గ్రామంలో జీరో రాగా... తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామంలో 30 గ్రాములు, 80 గ్రాములు, పామిడి మండలం రామరాజుపల్లిలో 20 గ్రాములు, 50 గ్రాములు, యాడికి మండలం నగరూరులో 50 గ్రాములు, 53 గ్రాములు, తాడిపత్రి మండలం ఆలూరులో 30 గ్రాములు మేర దిగుబడులు వచ్చాయి. అంటే ఇక్కడ ఎకరాకు అర బస్తా వేరుశనగ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే పుట్లూరు, శింగనమల, పామిడి మండలం అనుంపల్లి, గుత్తి మండలం వెంకటంపల్లి, యల్లనూరు మండలం కల్లూరు, నార్పల తదితర మండలాల్లో 150 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు దిగుబడులు వచ్చాయి. అంటే ఎకరాకు కాస్త అటుఇటుగా 40 కిలోలు కలిగిన ఒక బస్తా వేరుశనగ రావచ్చని చెబుతున్నారు. ముదిగుబ్బ, కనేకల్లు, పెద్దవడుగూరు, పుట్లూరు మండలాల్లో ఒకట్రెండు గ్రామాల్లో మాత్రమే 1.500 కిలో నుంచి 2.200 కిలోల దిగుబడులు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే ఎకరాకు సగటున మూడు బస్తాలు దిగుబడులు రావచ్చని చెబుతున్నారు. ముదిగుబ్బ మండలంలో ఒక సర్వే నెంబర్ పొలంలో మాత్రం అత్యధికంగా 3.400 కిలోలు వచ్చాయి. అంతకు మించి మరెక్కడా వేరుశనగ పంట దిగుబడులు ఆశాజానకంగా కనిపించడం లేదు. పంట కోత ప్రయోగాలు ఇంకా 350 వరకు చేపట్టాల్సి వుండటంతో సగటు దిగుబడులు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఈ ఏడాది ఎకరాకు ఒక క్వింటా సగటు దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కో పంట కోత ప్రయోగంలో 4 కిలోల దిగుబడులు వస్తేకాని పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది వేరుశనగ రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడులు లెక్కిస్తే దాదాపు రూ.1,250 కోట్లు ఖర్చు చేశారు. దిగుబడులను పరిగణలోకి తీసుకుంటే ఎంతలేదన్నా రూ.2,500 కోట్లు కోల్పోతున్నారు. -
లాభాల బిందువు
నేరుగా మొక్క వేరుకు నీరు డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి. కాల్వల ద్వారా నీరు వృథాగా పోయే అవకాశం లేదు. అంతేకాకుండా మొక్క వేరు భాగానికి నేరుగా నీరు అందుతుంది. దీనివల్ల పంట భూముల్లో కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండాపోతుంది. మొక్కలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. పంటలకు ఎరువులను డ్రిప్పు పైపుల ద్వారా సరఫరా చే సే అవకాశం ఉంది. డ్రిప్పు పైపులతో పాటు ట్యాంకును కూ డా సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో యూరి యా వేస్తే చాలు పంట అంతటికీ అందుతుంది. సబ్సిడీపై పరికరాలు డ్రిప్పు పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 65శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలను అందిస్తున్నారు. రైతు పాస్‌బుక్‌లో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 1.50 ఎకరాలను ఒక యూనిట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 1.5 ఎకరాల కోసం ఇచ్చే యూనిట్ పరికరాలు కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతున్నాయని రైతులు అంటున్నారు. కావాల్సినన్ని పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. డ్రిప్పు ద్వారా పసుపు, సోయా, మొక్కజొన్న, బెండ, వంగ, టామాట, పంటలను సాగు చేస్తున్నారు.