నష్టాల్లో పెసర రైతు
- పెరిగిన పెట్టుబడులు
- దిగుబడి రాక, ధర లేక ఇబ్బందులు
రాయికోడ్: పెసర రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రెండేళ్లుగా వివిధ పంటల దిగుబడి రాక ఆర్థికంగా సతమతమయ్యారు. ఈ ఏడాది వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో పెసర దిగిబడి చేతికందుతోంది. ఈ దశలో పెసర్లకు మార్కెట్‌లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో పెసర నూర్పిడిలు పూర్తయి దిగుబడి రైతుల ఇళ్లకు చేరింది. మరికొన్ని గ్రామాల్లో నూర్పిడులు జోరుగా కొనసాగుతున్నాయి.
మండలంలో ఈ ఏడాది 1,050 ఎకరాల విస్తీర్ణంలో పెసర సాగు చేశారు. గత ఏడాది క్వింటాలు పెసర ధర రూ.8 వేల వరకు పలుకగా ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు మాత్రమే ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో పెసర రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెసరర సాగుకు విత్తనాలు, ఎరువులు, చీడపీడల నివారణకు రసాయనాల కొనుగోలు, నూర్పిడి, తదితరాల కోసం పంట ఇంటికి చేరే వరకు ఎకరా పెసర సాగు కోసం రూ.8 వేల వరకు పెట్టుబడులు పెట్టామంటున్నారు.
ఎకరా విస్తీర్ణానికి రెండు క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కకుండా పోతోందని ఆవేదనచెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు పెసర ధర రూ.8 వేలు పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.