పట్టి పీడిస్తున్న దిగుబడి భూతం | Sakshi Guest Column On Farmers Crop yields | Sakshi
Sakshi News home page

పట్టి పీడిస్తున్న దిగుబడి భూతం

Published Mon, Oct 16 2023 12:59 AM | Last Updated on Mon, Oct 16 2023 12:59 AM

Sakshi Guest Column On Farmers Crop yields

దిగుబడి గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. దిగుబడి, ఉత్పత్తి, ఉత్పాదకత మధ్య ఉన్న వివిధ కోణాలను అధికార గణం విస్మరిస్తున్నారు. దిగుబడి పెంపుదల నినాదంగా పెట్టుకుని, దేశీయ రైతుల జ్ఞానాన్నీ, శ్రమనూ కించపరుస్తున్నారు. ఈ దిగుబడి జాడ్యం విదే శాల నుంచి, ప్రత్యేకంగా అమెరికా నుంచి చుట్టుకున్నది. ఇప్పుడు ఆకలి తీర్చడం లక్ష్యం కాదు. ఆదాయం పెరగాలంటే దిగుబడులు పెంచాలంటు న్నారు. కానీ అనేక సమస్యల మధ్య దిగుబడులు ఎక్కువ అయినా ప్రతి సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విత్తనాలు ఎరువులు అమ్మేవారు అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ, తమ లాభాలను మాత్రం పెంచుకుంటున్నారు. దిగుబడి ఒక ఆయుధం!

ప్రభుత్వం దిగుబడి పెంచడానికి వివిధ రకాలుగా పెడుతున్న ఖర్చు... రైతులకు గిట్టు బాటు ధరలు అందించే వ్యవస్థ మీద పెట్టే దాని కంటే అనేక రెట్లు ఎక్కువ. వరి, గోధుమల అధిక ఉత్పత్తి కొరకు గత 50 ఏండ్లలో కేటాయించిన నిధులు, ఆహారం కొరకు చేసిన కృషిగా కొంత వరకు అర్థం చేసుకోగలం. కానీ గత 25 ఏండ్లలో వాణిజ్య పంటల దిగుబడులు పెంచడానికి ప్రకటించిన విధానాలు, కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలు, సరళీకరించిన నిబంధనలు రైతుకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాయి.

కొత్త వంగడాలు ప్రకటించి పంటల దిగుబడి చూసుకుని మురుస్తున్నారే కానీ దాంట్లో పోషకాల శాతం ఎంత అనేది మరుస్తున్నారు. రోజూ మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు లేవని, తగ్గుతున్నాయని  వైద్యులు, ఆహార నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆహారంలో పోషకాలు ఉండాలంటే వైవిధ్యం అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, వైవిధ్యం కాదు, ఏక పంట విధానం ద్వారానే అధిక దిగుబడి వస్తుందని ఆధునిక దిగుబడి శాస్త్రం మనకు నూరిపోస్తున్నది.

ఏదైనా వస్తువు, లేదా పని ఎక్కువ చేయాలంటే ఉత్పాదకతను కొలమానంగా తీసుకుంటారు. మౌలిక వనరులను సరి అయిన మోతాదులో ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం ఉత్పాద కతను సాధించినట్టుగా భావిస్తారు. ఏదైనా పరిశ్రమలో అధిక ఉత్పా దకత కొరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అదే రైతు ఉత్పాదకతను పెంచితే ప్రోత్సాహకంగా పంట ధర పెరగడం లేదు.

2010, 2019లో భారత రైతులకు మైనస్‌ రూ.2.36 లక్షల కోట్లు, మైనస్‌ రూ.1.62 లక్షల కోట్ల మేర ప్రతికూల మద్దతు లభించిందని ఒక అంతర్జాతీయ నివేదిక (ఓఈసీడీ– ఐరోపా దేశాల ఆర్థిక కూటమి) అంచనా వేసింది.  2000 మినహా 2000–2019 మధ్య కాలంలో రైతులకు మద్దతు స్థిరంగా ప్రతికూలంగా ఉంది. ఓఈసీడీ అంచనా ప్రకారం మైనస్‌ 1.62 లక్షల కోట్ల రూపాయల ప్రతికూల మద్దతు 2019లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల కంటే రూ.1.09 లక్షల కోట్లు ఎక్కువ. రైతులకు రావాల్సిన పైకం ఎక్కువ, కాని వస్తున్నది తక్కువ అని ఈ నివేదిక సారాంశం.

2016–17లో ఒక క్వింటాల్‌ గోధుమ ఉత్పత్తికి హరియాణా రైతుకు రూ.2,219 ఖర్చయిందనీ, కేంద్రం నిర్ణయించిన క్వింటాలుకు రూ.1,625 కనీస మద్దతు ధర కంటే అది రూ. 594 ఎక్కువనీ అక్కడి ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ పరిస్థితి అధిక దిగుబడి వల్ల మారుతున్నదా? గిట్టుబాటు ధర రానప్పుడు రైతుకు దిగుబడి దిగులు ఎందుకు? ‘ఉత్పత్తి పెంచండి’ అని పిలుపునిచ్చే శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులు, గిట్టుబాటు ధర విషయంలో మాత్రం కిమ్మనరు. విత్తనాలు, ఎరువులు, పంట రసాయనాలు అమ్మేవారు మాత్రం అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ తమ లాభాలను పెంచుకుంటున్నారు. వీరి వాణిజ్య ప్రకటనలకు దన్నుగా శాస్త్రవేత్తలు ఫిడేలు వాయిస్తుంటారు.

వ్యవసాయంలో పంటల దిగుబడులు పెంచాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. నేల సారం అధికంగా ఉంటే పంట పోషకాలతో కూడి ఎక్కువ కాత, పూత వస్తుంది. సరి అయిన నీరు అందిస్తే మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పూతకు, కాతకు గాలిలో, నేలలో తేమ ఉపయోగపడుతుంది. ఈ తేమ ఉండాలంటే, ప్రాంతీయంగా పచ్చదనం ఉండాలి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. నేలలో పోషకాలు పెంచే ఉపాయాలు అనేకం ఉన్నాయి.

నిరంతరంగా, సహజంగా నేలలో సారం పెంచితే రైతు మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా, దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడులు సాధించి సంతోషంగా ఉన్న రైతులు కోకొల్లలు. ప్రపంచ రికార్డు వరి దిగుబడి ఒక వ్యవసాయ పరిశోధనా కేంద్రం లేదా అమెరికాలో పెద్ద భూస్వామి కాకుండా, బిహార్‌ రాష్ట్రంలో ఒక రైతు సాధించాడు. దర్వేశ్‌పుర గ్రామంలో సుమంత్‌ కుమార్‌కు హెక్టారుకు 22.4 టన్నుల దిగుబడి వచ్చింది. అది కూడా సిస్టం ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌ (ఎస్‌ఆర్‌ఐ) పద్ధతి వల్ల వచ్చింది. రైతు మీద భారం లేకుండా సహజ పద్ధతుల ద్వారా, ప్రమాదకర రసాయనాల అవసరం లేకుండా,కంపెనీల గత్తర విత్తనాలు నాటకుండా, దిగుబడి వస్తే మంచిదే కదా!

దిగుబడి మీద పరిమితులు ఉంటాయి. ఒక దశ తరువాత దిగుబడి పెరగదు. ఎంత దక్షత ఉన్నా ఉత్పాదకతను ఒక స్థాయికి మించి పెంచలేము. ప్రకృతి నుంచి వచ్చే ఉత్పత్తులలో అనేక కారణాల రీత్యా దిగుబడిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనిని వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. పాల ఉత్పత్తి ఒక మంచి ఉదాహరణ. ఒక పాడి పశువు నుంచి తీసుకునే పాల దిగుబడి పెంచడానికి మొదట్లో హైబ్రిడ్‌ ఆవులను ప్రవేశపెట్టారు. తదుపరి వాటి పొదుగులను భారీగా పెంచారు.

విదేశాలలో ఈ భారీ పొదుగులతో ఆవులు నడవలేని స్థితికి వచ్చాయి. అయినా పాల దిగుబడి ఇంకా పెంచాలని మేతలో మార్పులు చేశారు. ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటి అన్నింటి పర్యవసానంగా ఆవు బలహీనపడి, రోగాల బారిన పడింది. కచ్చితంగా అవి అనారోగ్యానికి గురి అవుతాయని తెలిíసీ మేతలో ‘మందులు’ కలుపుతున్నారు. అంటురోగాలు వస్తాయని నిర్ణీత కాలంలో అవసరమున్నా లేకున్నా వ్యాక్సిన్లు, ఇతర ‘మందులు’ అల వాటు చేశారు. ఇవన్నీ కూడా దిగుబడి తగ్గకూడదు అని చేస్తున్నారు.

ఇప్పుడు ఆవులను జన్యుమార్పిడి ప్రయోగాలకు బలి చేస్తున్నారు. ఎన్ని చేసినా ఒక ఉత్థాన దశ చేరుకున్న తరువాత ప్రకృతిలో భాగం అయిన ఆవు పాలు ఎక్కువగా ఇవ్వదు. ఇంకొక వైపు పాలలో కలుషితాలు పెరిగినాయి. ఒక పాడి పశువు 2 లీటర్లు ఇస్తే, ఇంకొక రకం 3 ఇవ్వచ్చు. సంఖ్యాపరంగా తేడా ఉన్నా ఇస్తున్న పాలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. కాని ఆధునిక దిగుబడి శాస్త్రంలో ‘పిండుకోవటం’ ఒక వ్యాపార సూత్రంగా మారింది. దానినే ఇప్పుడు ‘ఎక్స్‌ట్రాక్టివ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ ఎకానమీ’ అని పరిగణిస్తున్నారు.

వరి, గోధుమలు, పత్తి వంటి పంటల విషయంలో కూడా ఇదే తీరు కనిపిస్తున్నది. పత్తి దిగుబడులు పెరుగుతాయని ఒక విదేశీ కంపెనీ చెబితే జోరుగా అనుమతులు ఇచ్చి 2003లో బీటీ పత్తిని రైతులకు అంటగట్టారు. గత 15 ఏండ్ల నుంచి 883 బీజీఐఐ హైబ్రిడ్లు మార్కెట్లో అమ్ముతున్నారు. మూడు లేదా నాలుగేళ్లకు హైబ్రిడ్‌ విత్త నాలు మార్చాలని రైతులకు సూక్తులు చెప్పే శాస్త్రవేత్తలు, అధికారులు ఇన్ని ఏండ్లుగా అవి మార్చకున్నా పట్టించుకోవటం లేదు. దీంతో పత్తిని ఆశించే పురుగులు, చీడ పీడల బెడద పెరిగింది.

విష రసాయనాల మీద ఖర్చు పెరిగింది.ఎకరాకు 14 క్వింటాళ్ళు వస్తాయని నమ్మబలికిన కంపెనీలు ఇప్పుడు కేవలం 2 లేదా 3 క్వింటాళ్ళు వస్తుంటే మాట్లాడటం లేదు. జాతీయ సగటు లెక్కల ప్రకారం 2014లో హెక్టారుకు 510 కిలోలు వస్తే, 2022 అది 445 కిలోలకు పడిపోయింది. దిగుబడుల కోసం హైబ్రిడ్‌ రకాలను ప్రకటించడంలో ఉన్న చిత్తశుద్ధి ఆ యా విత్తనాల పని తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో లేదు.

ఒక ఊత పదంగా మారిన దిగుబడి సందేశాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. స్వార్థపర వ్యాపార ప్రయోజనాలు ఉంటు న్నాయి. లోపభూయిష్ట విధానాలను దిగుబడి ఒక కవచంగా మారింది. అధిక ఉత్పత్తి సాధించడానికి ప్రకటిస్తున్న విధానాలలో సంపూర్ణత లోపించింది.
డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement