కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది.
ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు...
మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు.
ప్రభుత్వ సబ్సిడీ ఇలా..
నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.
ప్రభుత్వ నర్సరీల ద్వారా...
మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు.
వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం..
వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్‌ఫామ్‌లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు.
ఈ ఏడాది 4 వందల ఎకరాలు
ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు
అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment