Mulberry garden
-
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
పట్టు గుట్టు పెరుమాళ్
ఖర్చు తక్కువతో అధికాదాయం నెలకొకటి చొప్పున ఏడాదికి 12 పంటలు ఎకరన్నర పొలంలో మల్బరీ సాగు.. నెలకు రూ. 80 వేల నికరాదాయం తమిళనాడు రైతు విజయగాథ జిలుగు వెలుగుల పట్టుబట్టలు అతివలకు అందాన్ని, మగవారికి హుందాతనాన్ని ఇస్తాయి. పట్టు పోగులతో ఆవిష్కృతమైన కళాత్మక సృజన మనసును తాకిన కవి.. నరాల దారాల అల్లికగా నేతగాడి పనితనాన్ని కొనియాడాడే కానీ.. పట్టు రైతు కష్టాన్ని గుర్తించనే లేదు. పట్టు పురుగు మేలి వన్నెల వస్త్రంగా మారిన వైనానికి మూలవిరాట్టై, గుడ్డు నుంచి బయటకు వచ్చి గూడునల్లి తనువు చాలించే పట్టు పురుగులా అణగారిపోతున్న పట్టు రైతన్నల వ్యథార్థ జీవితం మీద దృష్టిసారించిన వారు మాత్రం అరుదు. మేలిమి మెరుపుల పట్టు వస్త్రం వెనుక దాగున్న రైతన్న శ్రమ ఎవరి దృష్టిలోనూ పడనే లేదు. పట్టు పురుగుల పెంపకం(సెరికల్చర్) వ్యవసా యంలో ఓ భాగం. దసిలిపట్టు, ఆరీపట్టు, మూగపట్టు అని పలు రకాలు, విధానాలు ఉన్నా మల్బరీ ద్వారా పట్టు ఉత్పత్తి చేయడానికే ప్రాధాన్యం ఎక్కువ. మల్బరీ తోటలను పెంచి, పట్టు గుడ్లను పొదిగించి మల్బరీ ఆకులను పట్టు పురుగులకు మేతగా వేసి పెంచి పెద్ద చేస్తే.. పట్టుగూళ్లు ఉత్పత్తవుతాయి. వ్యవసాయ రంగంలోని ఇతర నగదు పంటల్లాగే సెరికల్చర్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోనూ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెరికల్చర్ విభాగాన్నే ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో పట్టుగూళ్లు పెంచే రైతుల పరిస్థితి మాత్రం ‘ఆకుకు అందదు, పోకకు పొందదు’ అన్న చందంగానే కొనసాగుతోంది. కానీ, తమిళనాడులో పట్టు రైతుల పరిస్థితి వేరుగా ఉంది. నెలకు రూ. 80 వేల ఆదాయం పట్టుగూళ్ల పెంపకంలో ఎకరన్నర పొలంలో మల్బరీ తోట ఆధారంగా పట్టుగూళ్లు పెంచుతూ నెలకు రూ. 80 వేల ఆదాయం పొందుతున్నారు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ స్వామి, నాగేశ్వరి రైతు దంపతులు. కోయంబత్తూరు జిల్లా ఉజ్జేయినూర్ తాలూకాలోని చినతడవం వారి స్వస్థలం. ఈ రైతు దంపతుల ఆదర్శ కృషిని పరిశీలించడానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక రైతుల బృందంతో కలిసి ‘సాగుబడి’ చినతడవం గ్రామంలోని పెరుమాళ్స్వామి పట్టుగూళ్ల పెంపక కేంద్రాన్ని సందర్శించింది. పెరుమాళ్స్వామి రెండెకరాల చిన్న రైతు. కొండలకు సమీపంలో ఉన్న చిన్నపల్లె. ఏ పంట వేసినా వచ్చే ఆదాయం చేతికి మూతికి అందని పరిస్థితి. ఒక్కోసారి పెట్టిన ఖర్చులూ తిరిగిరాని పరిస్థితి. వ్యవసాయం తప్ప వేరే ఏ ఆదాయ వనరూ లేదు. మరోవైపు వెన్నాడి తరుముతున్న ఆర్థిక అవసరాలు. తమకున్న దాంట్లోంచే ఆదాయం సృష్టిం చుకోవాలి. చుట్టుపక్కల చిన్న, సన్నకారు రైతులు పట్టు పురుగుల పెంపకం చేపట్టిన విషయం గమనించి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి తామూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు పెరుమాళ్స్వామి దంపతులు.అదే సమయంలో స్థానిక సెరికల్చర్ అధికారి కూడా పట్టుపురుగుల పెంపకానికి ప్రభుత్వం అందించే సహాయం గురించి వీరికి వివరించారు. కష్టపడితే ఫలితం రాకపోతుందా? అన్న ఆశతో పట్టుగూళ్ల పెంపకాన్ని చేపట్టి చక్కటి ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ సాగుతో మేలు పట్టు పురుగుల పెంపకం ప్రారంభించే రైతులు సాధారణంగా పక్కా షెడ్లు నిర్మించడం, నేలను గచ్చు చేయడం పరిపాటి. ఈ అలవాటు వల్ల పెట్టుబడి బాగా పెరిగిపోతుంది. కానీ, అందుబాటులో ఉన్న వనరులతో పూరి పాకలను నిర్మించి, నేలను చదును చేసి, ఆవు పేడతో అలికితే తక్కువ ఖర్చులోనే పని పూర్తవుతుంది. పెరుమాళ్స్వామి అదే చేశారు. ఇంటికి సమీపంలోనే అందుబాటులో ఉన్న వనరులతో రెండు పాకలు నిర్మించారు. ఒకటిన్నర ఎకరంలో ‘వీ1’ రకం మల్బరీ మొక్కలు తెచ్చి నాటుకున్నారు. పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులు వాడడంతో ఆకు సైజు సాధారణ స్థాయికంటే రెట్టింపుగా ఎదిగింది. ప్రభుత్వం డ్రిప్పు పరికరాలు, మొక్కలను రాయితీపై సమకూర్చింది. పాకల నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటుకోవడానికి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో అందించింది. దీనికి తోడు పంటకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. కేవలం ఇద్దరు కూలీల సహాయంతో పట్టుపురుగులు పెంచుతున్న పెరుమాళ్స్వామి దంపతులు ఏడాదికి దాదాపు రూ. 6 లక్షల మేరకు నికరాదాయం పొందుతున్నారు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ ఏడాదికి పన్నెండు పంటలు! పట్టు పురుగుల పెంపకంలో సిల్కీవార్మ్ దశ చాలా కీలకమైనది. ఈ దశలో పురుగులను పసిపిల్లలకంటే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. పురుగులు సిల్కీవార్మ్స్ దశ నుంచి చాల్కీ వార్మ్స్ దశకు మారడానికి 22 రోజులు పడుతుంది. ఈ దశ చాలా కీలకం. దిగుబడి పూర్తిగా ఈ దశ మీదే ఆధారపడి ఉంటుంది. సిల్కీవార్మ్స్ పెరిగే షెడ్డులోకి ఇతరులను అనుమతించం. ఈ దశలో పనులన్నీ మేమే స్వయంగా చూసుకుంటాం. నేలను ఆవుపేడ, పసుపు నీళ్లు కలిపి అలికిన తరువాత.. నెట్రికల మీద గుడ్ల అట్టలను పెట్టి పొదిగిస్తాం. 20 కార్డులకు రెండు లక్షల పురుగులు పుడతాయి. ప్రతి రోజూ బ్లీచింగ్ కలిపిన నీటితో షెడ్డు లోపలి అంచులు, బయటి ప్రాంతాలను శుభ్రం చేస్తాం. వైరస్, బ్యాక్టీరియా సోకకుండా ఈ జాగ్రత్త. పురుగులు చాల్కీవార్మ్స్గా మారిన తరువాత, వాటిని తీసి బయట ఉన్న షెడ్డులోని నెట్రికల్లోకి మారుస్తాం. మొదట్లో చంద్రికల్లో పురుగుల పెంపకం సాగేది. అయితే, దీని వల్ల శ్రమ ఎక్కువ. ఎక్కువ మంది కూలీలు కావాల్సి ఉంటుంది. నెట్రికల్లో ప్లాస్టిక్ ప్యాడ్లను అమర్చి, వాటి మీద చాల్కీ పురుగులను వదిలి, మల్బరీ ఆకు వేస్తాం. నెల రోజుల్లో పురుగులు పట్టు గూళ్లు అల్లుతాయి.. ఈ విధంగా 12 నెలల్లో 12 పంటలు తీస్తున్నాం. నెలకు ఎంత లేదన్నా 175 కిలోల పట్టుగూళ్లు లభిస్తాయి. కోయంబత్తూరు మార్కెట్లో కిలోకు రూ. 460 ధర గిట్టుతోంది. సగటున నెలకు రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ఇందులో రూ. 30 వేలు నిర్వహణ ఖర్చులు తీసివేస్తే రూ. 50 వేలు నికరంగా మిగులుతోంది. ఈ విధంగా సంవత్సరానికి రూ. 6 లక్షల నికరాదాయం లభిస్తోంది. - ఆర్. పెరుమాళ్ స్వామి (09442235868) (ఈయన తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), చిరునామా: చినతడవం, ఉజ్జేయినూర్ తాలూకా, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు