పట్టు గుట్టు పెరుమాళ్ | Sericulture a part of the agricultural land | Sakshi
Sakshi News home page

పట్టు గుట్టు పెరుమాళ్

Published Mon, Apr 14 2014 12:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పట్టు గుట్టు పెరుమాళ్ - Sakshi

పట్టు గుట్టు పెరుమాళ్

ఖర్చు తక్కువతో అధికాదాయం

నెలకొకటి చొప్పున ఏడాదికి 12 పంటలు
ఎకరన్నర పొలంలో మల్బరీ సాగు.. నెలకు రూ. 80 వేల నికరాదాయం
తమిళనాడు రైతు విజయగాథ

 
జిలుగు వెలుగుల పట్టుబట్టలు అతివలకు అందాన్ని, మగవారికి హుందాతనాన్ని ఇస్తాయి. పట్టు పోగులతో ఆవిష్కృతమైన కళాత్మక సృజన మనసును తాకిన కవి.. నరాల దారాల అల్లికగా నేతగాడి పనితనాన్ని కొనియాడాడే కానీ.. పట్టు రైతు కష్టాన్ని గుర్తించనే లేదు.
 
పట్టు పురుగు మేలి వన్నెల వస్త్రంగా మారిన వైనానికి మూలవిరాట్టై, గుడ్డు నుంచి బయటకు వచ్చి గూడునల్లి తనువు చాలించే పట్టు పురుగులా అణగారిపోతున్న పట్టు రైతన్నల వ్యథార్థ జీవితం మీద దృష్టిసారించిన వారు మాత్రం అరుదు. మేలిమి మెరుపుల పట్టు వస్త్రం వెనుక దాగున్న రైతన్న శ్రమ ఎవరి దృష్టిలోనూ పడనే లేదు.

పట్టు పురుగుల పెంపకం(సెరికల్చర్) వ్యవసా యంలో ఓ భాగం. దసిలిపట్టు, ఆరీపట్టు, మూగపట్టు అని పలు రకాలు, విధానాలు ఉన్నా మల్బరీ ద్వారా పట్టు ఉత్పత్తి చేయడానికే ప్రాధాన్యం ఎక్కువ. మల్బరీ తోటలను పెంచి, పట్టు గుడ్లను పొదిగించి మల్బరీ ఆకులను పట్టు పురుగులకు మేతగా వేసి పెంచి పెద్ద చేస్తే.. పట్టుగూళ్లు ఉత్పత్తవుతాయి.
 
వ్యవసాయ రంగంలోని ఇతర నగదు పంటల్లాగే సెరికల్చర్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోనూ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెరికల్చర్ విభాగాన్నే ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో పట్టుగూళ్లు పెంచే రైతుల పరిస్థితి మాత్రం ‘ఆకుకు అందదు, పోకకు పొందదు’ అన్న చందంగానే కొనసాగుతోంది. కానీ, తమిళనాడులో పట్టు రైతుల పరిస్థితి వేరుగా ఉంది.
 
నెలకు రూ. 80 వేల ఆదాయం


పట్టుగూళ్ల పెంపకంలో ఎకరన్నర పొలంలో మల్బరీ తోట ఆధారంగా పట్టుగూళ్లు పెంచుతూ నెలకు రూ. 80 వేల ఆదాయం పొందుతున్నారు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ స్వామి, నాగేశ్వరి రైతు దంపతులు. కోయంబత్తూరు జిల్లా ఉజ్జేయినూర్ తాలూకాలోని చినతడవం వారి స్వస్థలం. ఈ రైతు దంపతుల ఆదర్శ కృషిని పరిశీలించడానికి ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక రైతుల బృందంతో కలిసి ‘సాగుబడి’ చినతడవం గ్రామంలోని పెరుమాళ్‌స్వామి పట్టుగూళ్ల పెంపక కేంద్రాన్ని సందర్శించింది.
 
 
పెరుమాళ్‌స్వామి రెండెకరాల చిన్న రైతు. కొండలకు సమీపంలో ఉన్న చిన్నపల్లె. ఏ పంట వేసినా వచ్చే ఆదాయం చేతికి మూతికి అందని పరిస్థితి. ఒక్కోసారి పెట్టిన ఖర్చులూ తిరిగిరాని పరిస్థితి. వ్యవసాయం తప్ప వేరే ఏ ఆదాయ వనరూ లేదు. మరోవైపు వెన్నాడి తరుముతున్న ఆర్థిక అవసరాలు. తమకున్న దాంట్లోంచే ఆదాయం సృష్టిం చుకోవాలి.

చుట్టుపక్కల చిన్న, సన్నకారు రైతులు పట్టు పురుగుల పెంపకం చేపట్టిన విషయం గమనించి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి తామూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు పెరుమాళ్‌స్వామి దంపతులు.అదే సమయంలో స్థానిక సెరికల్చర్ అధికారి కూడా పట్టుపురుగుల పెంపకానికి ప్రభుత్వం అందించే సహాయం గురించి వీరికి వివరించారు. కష్టపడితే ఫలితం రాకపోతుందా? అన్న ఆశతో పట్టుగూళ్ల పెంపకాన్ని చేపట్టి చక్కటి ఆదాయం పొందుతున్నారు.
 
సేంద్రియ సాగుతో మేలు

పట్టు పురుగుల పెంపకం ప్రారంభించే రైతులు సాధారణంగా పక్కా షెడ్లు నిర్మించడం, నేలను గచ్చు చేయడం పరిపాటి. ఈ అలవాటు వల్ల పెట్టుబడి బాగా పెరిగిపోతుంది. కానీ, అందుబాటులో ఉన్న వనరులతో పూరి పాకలను నిర్మించి, నేలను చదును చేసి, ఆవు పేడతో అలికితే తక్కువ ఖర్చులోనే పని పూర్తవుతుంది. పెరుమాళ్‌స్వామి అదే చేశారు. ఇంటికి సమీపంలోనే అందుబాటులో ఉన్న వనరులతో రెండు పాకలు నిర్మించారు.
 
ఒకటిన్నర ఎకరంలో ‘వీ1’ రకం మల్బరీ మొక్కలు తెచ్చి నాటుకున్నారు. పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులు వాడడంతో ఆకు సైజు సాధారణ స్థాయికంటే రెట్టింపుగా ఎదిగింది. ప్రభుత్వం డ్రిప్పు పరికరాలు, మొక్కలను రాయితీపై సమకూర్చింది. పాకల నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటుకోవడానికి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో అందించింది. దీనికి తోడు పంటకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. కేవలం ఇద్దరు కూలీల సహాయంతో పట్టుపురుగులు పెంచుతున్న పెరుమాళ్‌స్వామి దంపతులు ఏడాదికి దాదాపు రూ. 6 లక్షల మేరకు నికరాదాయం పొందుతున్నారు.
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
 
ఏడాదికి పన్నెండు పంటలు!


పట్టు పురుగుల పెంపకంలో సిల్కీవార్మ్ దశ చాలా కీలకమైనది. ఈ దశలో పురుగులను పసిపిల్లలకంటే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. పురుగులు సిల్కీవార్మ్స్ దశ నుంచి చాల్కీ వార్మ్స్ దశకు మారడానికి 22 రోజులు పడుతుంది. ఈ దశ చాలా కీలకం. దిగుబడి పూర్తిగా ఈ దశ మీదే ఆధారపడి ఉంటుంది. సిల్కీవార్మ్స్ పెరిగే షెడ్డులోకి ఇతరులను అనుమతించం. ఈ దశలో పనులన్నీ మేమే స్వయంగా చూసుకుంటాం.
 
నేలను ఆవుపేడ, పసుపు నీళ్లు కలిపి అలికిన తరువాత.. నెట్రికల మీద గుడ్ల అట్టలను పెట్టి పొదిగిస్తాం. 20 కార్డులకు రెండు లక్షల పురుగులు పుడతాయి. ప్రతి రోజూ బ్లీచింగ్ కలిపిన నీటితో షెడ్డు లోపలి అంచులు, బయటి ప్రాంతాలను శుభ్రం చేస్తాం. వైరస్, బ్యాక్టీరియా సోకకుండా ఈ జాగ్రత్త. పురుగులు చాల్కీవార్మ్స్‌గా మారిన తరువాత, వాటిని తీసి బయట ఉన్న షెడ్డులోని నెట్రికల్లోకి మారుస్తాం. మొదట్లో చంద్రికల్లో పురుగుల పెంపకం సాగేది. అయితే, దీని వల్ల శ్రమ ఎక్కువ. ఎక్కువ మంది కూలీలు కావాల్సి ఉంటుంది. నెట్రికల్లో ప్లాస్టిక్ ప్యాడ్‌లను అమర్చి, వాటి మీద చాల్కీ పురుగులను వదిలి, మల్బరీ ఆకు వేస్తాం.
 
నెల రోజుల్లో పురుగులు పట్టు గూళ్లు అల్లుతాయి.. ఈ విధంగా 12 నెలల్లో 12 పంటలు తీస్తున్నాం. నెలకు ఎంత లేదన్నా 175 కిలోల పట్టుగూళ్లు లభిస్తాయి. కోయంబత్తూరు మార్కెట్‌లో కిలోకు రూ. 460 ధర గిట్టుతోంది. సగటున నెలకు రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ఇందులో రూ. 30 వేలు నిర్వహణ ఖర్చులు తీసివేస్తే రూ. 50 వేలు నికరంగా మిగులుతోంది. ఈ విధంగా సంవత్సరానికి రూ. 6 లక్షల నికరాదాయం లభిస్తోంది.
    
 - ఆర్. పెరుమాళ్ స్వామి (09442235868) (ఈయన తమిళంలో మాత్రమే మాట్లాడగలరు),
 చిరునామా: చినతడవం, ఉజ్జేయినూర్ తాలూకా, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement