పట్టుపురుగుల పెంపకంలో ‘వేసవి’ జాగ్రత్తలు
పట్టుపురుగుల పెంపకంలో ‘వేసవి’ జాగ్రత్తలు
Published Mon, Apr 24 2017 11:18 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ఉష్ణోగ్రత నియంత్రణ, పరిశుభ్రత, ఆకు నాణ్యతపై దృష్టి
పట్టు పరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి ఫిరోజ్
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో పట్టుపురుగుల పెంపకంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పట్టుపరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా (98495 63802) తెలిపారు. మంచి పంట దిగుబడులు సాధించాలంటే కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాలన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, ఆకు నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు.
వేసవి యాజమాన్యం:
+ షెడ్డులో 28 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 70 శాతానికి తక్కువ కాకుండా చూచుకోవాలి. అవసరమైతే ఫ్యాన్లు, కూలర్లు, షెడ్డు కిటికీలు, వాకిళ్లకు తడిచిన గొనె సంచులు, అలాగే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల ద్వారా షెడ్డు పైభాగాన నీటి తడులు, షెడ్డుపైన, చుట్టూ వరండాపై కొబ్బరి ఆకులు, బోధగడ్డి లాంటివి వేసుకోవాలి. వేసవిలో వ్యాపించే పాలురోగం వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి జాగ్రత్తలు తీసుకోకపోతే పంట దిగుబడి 20 నుంచి 30 శాతం తగ్గుతుంది.
+ పురుగులు పెంచే తట్టలు, షూట్ స్టాండ్, నేల, చంద్రికలు, షెడ్డు పరిసరాల్లో కంటికి కనబడని సూక్ష్మజీవులు ఉంటాయి. సరైన యాజమాన్య పద్ధతులతో వాటిని నాశనం చేయాలి. బ్లీచింగ్ పౌడరు, శానిటెక్ (క్లోరినేషన్), ఆస్త్ర, కాల్చిన సున్నం, ఫార్మాలిన్ లాంటి వాటిని క్రమ పద్ధతిలో వాడటం ద్వారా సూక్ష్మజీవులు, పంటకు హాని చేసే ఇతరత్రా క్రిములను అరికట్టవచ్చు.
+ క్లోరిన్ వాయువును కాల్చిన సున్నం మీదకు పంపినపుడు కాల్షియం ఆక్సీక్లోరైడ్ విడుదల అవుతుంది. దీన్నే బ్లీచింగ్ పౌడరుగా పిలుస్తాం. క్లోరిన్ డైయాక్సైడ్ (శానిటెక్) అనే మందు స్థిర లక్షణాలు కలిగి ఉండి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని సులభంగా వాడుకోవచ్చు. శానిటెక్‌లో 20 వేలు పీపీఎంల క్లోరిన్ డైఆక్సైడ్ సాంధ్రత ఉంటుంది. పట్టుపురుగులకు సోకే అన్ని వ్యా«ధులకు కాల్చిన సున్నంతో కలిపిన 500 పీపీఎం క్లోరిన్‌డైయాక్సైడ్‌ను వాడొచ్చు.
+ పంట ముగిసిన వెంటనే షెడ్డులోపల, బయట ప్రాంతంలో బ్లీచింగ్ పౌడరు, ఫార్మాలిన్ వంటి వాటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పెంపకం మొదలు పెట్టే ముందు మరోసారి శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి.
+ పశువుల ఎరువు, వర్మీకంపోస్టుతో పాటు తగు పాళ్లలో రసాయన ఎరువులు, సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్) వేసి ఆకు నాణ్యతను పెంచుకోవడం వల్ల పట్టుగూళ్లు దిగుబడులు పెరుగుతాయి. పుల్ల నాటుకునే స్థాయి నుంచి మార్కెట్‌లో పట్టుగూళ్లు విక్రయించే వరకు పట్టుపరిశ్రమ అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
Advertisement