చేలకు డబ్బులు కాయాలి! | Indian farmers are suffering losses every year | Sakshi
Sakshi News home page

చేలకు డబ్బులు కాయాలి!

Published Sat, Aug 10 2024 11:39 AM | Last Updated on Sat, Aug 10 2024 11:40 AM

Indian farmers are suffering losses every year

ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తిదారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) తాజా ప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే మాత్రం, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్‌ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టాలను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. కాబట్టి, మన వ్యవసాయ రంగ విధానాలపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావాలంటే వ్యవసాయ రంగంలో జీవనోపాధి సమస్యను పరిష్కరించి, రైతులు ఆదాయాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఉన్న ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పడం ద్వారానే గత 25 సంవత్సరాలుగా, దాదాపు ప్రతి ఆర్థిక మంత్రీ తన బడ్జెట్‌ సమర్పణను ప్రారంభిస్తూ వస్తున్నారు. ‘కిసాన్‌ కీ ఆజాదీ’నుండి దేశ ఆర్థిక వ్యవస్థ జీవనాధారం వరకు, బడ్జెట్‌ ప్రతిపాదనలదృష్టిని ఎత్తిపట్టడానికి అనేక విశేషణాలను ఉపయోగిస్తూ వచ్చారు. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం గురించి అరుణ్‌ జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వ ఐదు ప్రాధాన్యాలలో దాన్ని అగ్రస్థానంలో ఉంచారు. నిర్మలా సీతారామన్‌ కూడా వ్యవసాయానికి తగిన గుర్తింపును కల్పించారు. 

ఆమె పేర్కొన్న తొమ్మిది ప్రాధాన్యాలలో వ్యవసాయ ఆదాయ పెంపు దల అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్రతి బడ్జెట్‌లోనూ ఇలా వ్యవసాయానికి ఊతమివ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే మార్పు వచ్చి ఉండాలి. అయితే దీనిపై నిశితంగా దృష్టి సారించినప్పటికీ ఒక్కసారి కూడా వ్యవసాయం పునరుద్ధరణ మార్గం పట్టినట్లు కనిపించలేదు. ఎందుకంటే అధిక ధరలు లభిస్తాయనీ, రైతుల ఆదాయం పెరుగుతుందనే ఆశాభావంతో పంటల ఉత్పాదకత పెంపుదల గురించి అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నప్పటికీ దేశంలో వ్యవసాయ కష్టాలు మరింత పెరిగాయి. విజయవంతమైన హరిత విప్లవం తర్వాత కూడా వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం దాదాపు రూ. 10,218 గానే ఉంటు న్నప్పుడు, బడ్జెట్‌లో ఇంత మద్దతు ఉన్నప్పటికీ వ్యవసాయంలో తీవ్రమైన సంక్షోభాన్ని కొట్టిపారేయలేము.

వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్ణాటకలో, అధికారిక అంచనా ప్రకారం గత 15 నెలల్లో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఈ సంవత్సరం జనవరి–జూన్‌ మధ్య 1,267 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు, విదర్భలోని ఒక్క అమరావతి డివిజ¯Œ లోనే 557 కేసులు నమోదయ్యాయి. రైతుల ఆత్మహత్యలు కొత్త విషయం కాదు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా సంకలనం గత 27 ఏళ్లలో రైతుల ఆత్మహత్యల సంఖ్యను చూపిస్తోంది. ఈ కాలం వ్యవసాయానికి సంబంధించి 25 సంవత్సరాల బడ్జెట్‌ హామీలకు సమానంగా ఉంది. 1995–2014 మధ్య కాలంలో 2,96,438 మంది సాగుదారులు తీవ్రాతితీవ్రమైన ఆత్మహత్యా సదృశ చర్యలకు పాల్పడ్డారు. 2014 నుండి 2022 వరకు 1,00,474 మంది రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. 

సరళంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని మలుపు తిప్పుతామని వార్షిక బడ్జెట్‌లు వాగ్దానం చేస్తూ ఉన్న సమయంలోనే 1995–2022 మధ్య దాదాపు నాలుగు లక్షల మంది రైతులు తమ జీవితాలను ముగించారు. అంటే బడ్జెట్‌ కేటాయింపులకు, కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభానికి మధ్య అసమతుల్యత అత్యంత స్పష్టంగా ఉంది.తెలంగాణ ఇప్పుడు వ్యవసాయ రుణమాఫీ రెండో దశను పూర్తి చేసుకుంది. ఇది 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,198 కోట్ల బకాయి రుణాలను మాఫీ చేసింది. అప్పుల్లో ఉన్న సాగుదారుల్లో ప్రతి ఒక్కరికి రూ. 1.5 లక్షల మాఫీ లభిస్తుంది. మొదటి దశలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నెల 15న ప్రారంభం కానున్న మూడో దశలో 17.75 లక్షల మంది రైతులకు రూ. 12,224 కోట్ల రుణమాఫీ అందనుంది. రాష్ట్రంలో మొత్తం 35.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నా రన్నమాట. అయితే దీనర్థం పెరుగుతున్న వ్యవసాయ రుణాలు ఇతర రాష్ట్రాల్లో సమస్యాత్మకం కావని కాదు.

ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తి దారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) తాజాప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్‌ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టా లను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇన్ని నష్టాల నుండి మరే ఇతర రంగం అయినా బయటపడుతుందా?మనం ఈ విశ్లేషణా పద్ధతిని తప్పుబట్టినప్పటికీ, ఉత్పాదకతకు, ఉత్పత్తిని పెంచడం కోసం సాంకేతికతకు మద్దతు ఇవ్వడం లేదా ఇతర పథకాలకు డబ్బును నింపడం వల్ల రైతుల ఆదాయం పెరగదు అనేది వాస్తవం. ఇది ఎక్కడా జరగలేదు. ఓఈసీడీ అధ్యయనమే ఇందుకు నిదర్శనం.

దీనినే నేను ’వయా బటిండా’ విధానం అని పిలుస్తాను. ఇన్‌ పుట్‌ సప్లయర్‌లు లేదా టెక్నాలజీ ప్రదాతల ద్వారా వ్యవసాయ ఆదా యాన్ని పెంచడానికి బదులుగా,  ప్రత్యక్ష ప్రయత్నం ఎందుకు చేయ లేరు? ఇలాంటి పరోక్ష ప్రయత్నం గతంలో పని చేయలేదు. భవి ష్యత్తులో కూడా పని చేయదు. రైతులు అట్టడుగు స్థానంలో ఉన్న సమయంలోనే ఇన్‌పుట్‌ సప్లయర్‌లు లాభాల్లో ఎలా దూసుకు పోతు న్నారో అనేక అధ్యయనాలు చూపించాయి. సప్లయ్‌ చెయిన్ల విషయంలో కూడా అంతిమ లాభాలలో పెంపకందారుల వాటా దాదాపు 5–10 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉంటోంది. 

2021లో స్ట్రాబెర్రీలను, రాస్‌బెర్రీలను మార్కెటింగ్‌ చేయడం ద్వారా రిటైల్‌ లాభాలు 27 పెన్నీల వరకు పెరిగాయని, కానీ రైతుల వాటా 3.5 పెన్నీలు మాత్రమే అని బ్రిటన్‌లో ఒక అధ్యయనం తెలిపింది. వినియో గదారులు ఆధారపడిన ఆరు రోజువారీ అవసరాలకు గానూ, రిటైల్‌ లాభంలో కేవలం 1 శాతం మాత్రమే రైతులకు లభిస్తుందని ఇంతకు ముందు అధ్యయనాలు చూపించాయి. అందువల్ల, తాజా బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా, ప్రాథమిక ఉత్పత్తిదారు అయిన రైతు వాటాకు హామీ ఇచ్చినప్పుడు మాత్రమే సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అనేది దోహదకారిగా ఉంటుంది.
దేశంలోని దాదాపు సగం జనాభా వ్యవసాయ రంగంలో నిమ గ్నమై ఉంటున్నప్పుడు, వ్యవసాయానికి మొత్తం బడ్జెట్‌లో కేవలం 3.15 శాతం మాత్రమే కేటాయిస్తే, అసాధారణంగా ఏమీ ఆశించలేం.

 ఈ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌ రూ. 1.52 లక్షల కోట్లు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రూ. 26,000 కోట్లు పెరిగి, ముందుగా సూచించినట్లుగా ప్రణాళికేతర వ్యయాన్ని కవర్‌ చేస్తుంది. వ్యవసాయం కోసం బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్‌ పథకా నికి రూ. 60,000 కోట్లు కేటాయించారు, ఇది భూమిని కలిగి ఉన్న ప్రతి రైతుకు నెలవారీ రూ. 500లను అందిస్తుంది, ఇక మిగిలింది వ్యవసాయానికి రూ. 92,000 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కేవలం రూ. 3,268గా ఉందని 2022–23 గృహæ వినియోగ వ్యయం మనకు చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వ్యవసాయం లాభసాటిగా లేకపోతే, గ్రామీణ వ్యయం ఇప్పటికీ తక్కువగానే ఉంటుంది.

కాబట్టి, వ్యవసాయంపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావడానికి మొదట జీవనోపాధి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల ఆదాయం, సంక్షేమం కోసం జాతీయ కమిష¯Œ ను ఏర్పాటు చేయాలనేది నా సూచన. ఈ కమిషన్‌ నిర్దిష్ట కాల వ్యవధిలో వ్యవ సాయ ఆదాయాన్ని పెంచడానికి నిర్దిష్ట మార్గాలతో ముందుకు రావాలి. కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన విధానాన్ని నిర్ధారించడం ద్వారా దీన్ని ప్రారంభించాలి.
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement