అభివృద్ధికి నిదర్శనం.. పులివెందుల పట్టణం..! | CM YS Jagan Inaugurates Development works In Pulivendula | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నిదర్శనం.. పులివెందుల పట్టణం..!

Published Mon, Mar 11 2024 4:51 PM | Last Updated on Mon, Mar 11 2024 6:58 PM

CM YS Jagan Inaugurates Development works In Pulivendula - Sakshi

పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలు

ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్‌

సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయం.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్క రోజు  వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్‌.. సోమవారం పులివెందుల పట్టణ,  నియోజకవర్గ పరిధిలో రూ. 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పలు నిర్మాణాల వివరాలు..

రూ. 500 కోట్ల నాబార్డ్, ఆర్.ఐ.డి.ఎఫ్-37 నిధులు వెచ్చించి.. అధునాతన వసతులతో నూతనంగా నిర్మనించిన డా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్ తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కేపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా ఓపిడి బ్లాక్, ఐపీడి బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి.

పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద.. రూ. 20.15 కోట్ల (రాష్ట్ర ప్రభుత్వం, పాడా నిధులతో) వ్యయంతో జిల్లాకే తలమానికంగా, అత్యాధునిక సాంకేతిక, సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4×150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6×21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు..  బనానా, స్వీట్ లైం కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లినింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

 పులివెందుల పట్టణంలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ (రూ.10కోట్లు), పాడా (రూ.28 కోట్లు) నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రెటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే&అకౌంట్స్, సబ్ ట్రెజరీ, 3.కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయం, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాకులు ఉన్నాయి.

పులివెందుల పట్టణ నడిబొడ్డున రూ.70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా సర్వాంగ సుందరంగా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డా.వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది.

పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా... రూ. 11.04 కోట్లతో (రాష్ట్ర ప్రభుత్వం+ఏపీఎస్పీడిసిఎల్ నిధులు) అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్ఆర్ జంక్షన్ కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో.. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్ పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచిలు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా,  స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిషీలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీల ఏర్పాటుతో.. 6 మీటర్ల బిటి క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి.

పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ. 20.69 కోట్లతో అధునాతన వసతులతో 4595 చదరపు మీటర్లలో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భావన సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు.. టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. 

పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గాంధీ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సర్కిల్ లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం, చుట్టూ పూలమొక్కలతో ల్యాండ్ స్కెప్, లైటింగ్స్ పులివెందుల పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ.65.99 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో..  ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, "ఐ లవ్ పులివెందుల" ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, ఐస్ ల్యాండ్ -స్టోన్ గజాబొ, గజాబొ పార్క్, పెర్గోలా, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు పులివెందుల పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందివ్వనున్నాయి.

పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా.. ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో.. రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన.. రెడీమేడ్ సూట్స్, వస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన, పేరెన్నికగన్న "ఆదిత్య బిర్లా యూనిట్" ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో 2100 మందికి ఉద్యోగావకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను కూడా పొందారు.

ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ, పాడా నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే పరిసర అందాలు, నెమళ్ల పార్కు, పచ్చదనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్.. నూతనంగా ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ తో మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇందులో 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్ లతో పాటు.. చిల్డ్రన్ పార్క్, డిపేక్షన్స్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, స్టెప్పుడ్ గార్డెన్, ఫ్లోరల్ పార్క్, స్టోన్ గాజేబోస్, పాదయాత్రకు సంబందించిన 21 విగ్రహాల సమూహం, 3 టాయిలెట్ బ్లాకులు పర్యాటకులకు సంతృప్తి స్థాయిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అందివ్వనున్నాయి.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మాట్లాడుతూ.. "ఈ రోజు తన సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా మీ అందరిముందు నిలుచున్నానంటే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే" అన్నారు.  తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి..  పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు.  పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతం అని.. కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందన్నారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలన్నింటిలోను.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పాల్గొనగా.. జిల్లా ఎస్పి సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవోలు అన్ని కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి లతో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎం. టి.కృష్ణబాబు,   పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement