అభివృద్ధికి నిదర్శనం | CM Jagan Started development works At Pulivendula | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నిదర్శనం

Published Fri, Nov 10 2023 4:05 AM | Last Updated on Fri, Nov 10 2023 10:36 AM

CM Jagan Started development works At Pulivendula - Sakshi

ఏపీ కార్ల్‌లో టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కడప: రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వైఎస్సార్‌ జిల్లా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ తొలిరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ కార్ల్‌లో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కాలేజీలతోపాటు అత్యాధునికంగా నిర్మించిన ల్యాబ్‌ను ప్రారంభించారు.

శ్రీస్వామినారాయణ గురుకుల పాఠశాలకు భూమి పూజ నిర్వహించి ఆదిత్యా బిర్లా గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ను సందర్శించారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం దేశానికే ఆదర్శప్రాయమని సగర్వంగా చెబుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ జకియాఖానం కుమారుడి వివాహానికి హాజరైన అనంతరం హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది.  
 
సుందర శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభం.. 
భాకరాపురం రింగురోడ్డు సర్కిల్‌లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో అత్యంత సుందరంగా నూతనంగా శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు.  
 
హార్టికల్చర్‌ కళాశాల.. అత్యాధునిక ల్యాబ్‌ 
పులివెందులలోని ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో రూ.9.96 కోట్ల ‘పాడా’ నిధులతో నిర్మించిన అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. 60 సీట్లు బీఎస్సీ అగ్రికల్చర్‌లో, 61 సీట్లతో బీఎస్సీ హార్టికల్చర్‌ కోర్సులను అందిస్తున్నాయి. అక్కడే ఏపీ కార్ల్‌లో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాలు, పాల ఉత్పత్తుల తనిఖీ, నాణ్యతా పరీక్షలు, డయాగ్నొస్టిక్‌ సేవలు, నిర్దిష్ట వ్యాధి కారక క్రిముల ఉత్పత్తులను పరీక్షించడం, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పప్పుల నమూనాల విశ్లేషణ, ఫార్మా అప్లికేషన్‌ పరీక్షల నిర్వహణ తదితరాలకు ఈ ల్యాబ్‌ సేవలు అందిస్తుంది. 
 
ఆహ్లాదకరంగా శిల్పారామం.. 
పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ 38 ఎకరాల్లో రూ.14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామంలో ఫేస్‌ లిఫ్టింగ్‌ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం ఉండగా 10 ఎకరాల్లో ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటెన్‌ విత్‌ గ్యాలరీ, హిల్‌ టాప్‌ టవర్‌లో 16.5 అడుగుల దివంగత వైఎస్సార్‌ విగ్రహం, పార్టీ జోన్, జిప్‌ లైన్‌ (రోప్‌ వే), బోటింగ్‌ ఐలాండ్‌ పార్టీ జోన్, చైల్డ్‌ ప్లే జోన్, వాటర్‌ ఫాల్, ఫుడ్‌ కోర్టుతోపాటు దివంగత వైఎస్సార్‌ కూర్చుని ఉన్న భంగిమలో ఐదు అడుగుల విగ్రహంతో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సీసీ రోడ్లు, పార్కింగ్‌ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ శిల్పారామంలో ఉన్నాయి.  
 
ఆకట్టుకున్న ప్రదర్శనలు.... 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శిల్పారామం వద్ద సంప్రదాయ వాయిద్యాలైన సన్నాయి, డోలు బృందంతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సంప్రదాయ బూర వాయిద్యాలు, డప్పు కళాకారుల దరువు, మోరగల్లు ప్రదర్శనలు, తోలు బొమ్మలాట, చెక్క భజనలు, జానపద నృత్యాల నడుమ సీఎం జగన్‌ పల్లె సంస్కృతి ఉట్టి పడేలా రూపొందించిన ప్రదర్శనలను తిలకించారు. చేతి వృత్తుల కళాకారులు జూట్‌ బ్యాగ్‌లు, కలంకారీ పెయింటింగ్స్, చీరలు, ఆకట్టుకునే సంపద్రాయ ఆభరణాలను ప్రదర్శించారు.

బోటింగ్‌ వద్ద భారీ స్క్రీన్‌పై క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ ప్రసారాలను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోని ఎంబీ థియేటర్‌ వద్ద పులివెందుల ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హిల్‌ టాప్‌పై దివంగత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌  శిల్పారామం వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మ్యూజిక్‌ వాటర్‌ ఫౌంటెన్‌ను వీక్షించారు. అధికారులతో గ్రూప్‌ ఫోటో దిగి శిల్పారామం అంతా ఉత్సాహంగా కలియతిరిగారు. 
 
శ్రీస్వామినారాయణ గురుకుల పాఠశాలకు భూమి పూజ 
దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీస్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. పులివెందులలో  ఏపీ కార్ల్‌ ఎదురుగా 12 ఎకరాల్లో రూ.60 కోట్ల వ్యయంతో శ్రీస్వామి నారాయణ గురుకుల విద్యాపీఠాన్ని నిర్మించనున్నారు. తొలి విడతలో రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2025 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు విద్యాపీఠం తెలిపింది. హైదరాబాద్, జడ్చర్ల నుంచి వచ్చిన గురుకుల పీఠానికి చెందిన స్వామీజీలు, విద్యార్థులతో కలసి సీఎం జగన్‌ గ్రూప్‌ ఫోటో దిగారు. 
 
ఆదిత్యా బిర్లా యూనిట్‌ సందర్శన... 

పులివెందుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను సందర్శించారు. వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది అందులో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. గార్మెంట్స్‌ ఉత్పత్తి వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిన్నప్ప,  ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డి, కలెక్టర్‌ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement