సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్‌ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఏపీ పీసీపీ చీఫ్ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు.
తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు.
బెదిరింపులు పెరిగాయి: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment