అడుగడుగునా రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకమిది. పాత్రలు ఎవరైనా.. ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే!!. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా... ఆయన మనుషులు అన్నిచోట్లా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు... ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా... జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించటంతో.. విషప్రచారమే లక్ష్యంగా జగన్‌పైకి సొంత కుటుంబీకులనే పంపటానికి కుట్రపన్నారు. కడప కేంద్రంగా... కుట్రలన్నిటికీ కేంద్రస్థానం లాంటి భయంకరమైన కూహకానికి తెరతీశారు.
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ఇడుపులపాయలో రెండ్రోజుల కిందట షర్మిల–సునీత కలిశారు. దానికి ఎల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చింది? హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా కలిసే ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఒకరినొకరు ఇడుపుల పాయలో కలిస్తే అంత ప్రాధాన్యమెందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించటమనేది ఇక్కడ దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే... బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో... ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకొచ్చారు.
ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించటంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. ఇక తెలుగుదేశంలో చేరిపోతే... బాబు నాయుడితో, ఏబీఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని... ఇన్నాళ్లూ కేసును వెనకనుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడయిపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం... సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ నూరు శాతం మద్దతిచ్చేట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది.
ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చని, కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చనేది వారి ఆలోచన. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా... మద్దతివ్వకుండా ఆమెపై అభ్యర్థిని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైనా దు్రష్పచారం చేయాలనేది వారి కుట్ర.
ఇది కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్నా... పాత్రధారులు మాత్రం బాబు నాయుడి ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతుండటమే అన్నిటికన్నా విచిత్రం. వివేకా హత్య జరిగిన నాటి నుంచి వరసగా మారుతున్న పరిణామాలు... దీన్లోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతాయి.
మీ నాన్నను చంపింది నేనే! అని చెప్పినా...
ఇతను వివేకా మాజీ డ్రైవరు. వివేకాను తానే గొడ్డలితో నరికి నరికి కిరాతకంగా చంపానని స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చి న వ్యక్తి. రూ.500, వెయ్యి అప్పులు తెచ్చుకుని గాలికి తిరిగే ఈ దస్తగిరి ఆర్థిక పరిస్థితి... వివేకా కేసులో అప్రూవర్‌గా మారాక ఒక్కసారిగా టర్న్ అయింది. కార్లలో డ్రై వరును పెట్టుకుని తిరిగే స్థితికి వచ్చేశాడు. వివిధ కోర్టుల్లో ఈయనపై ఉన్న కేసుల కోసం లాయర్లను సునీత, చంద్రబాబు, బీటెక్ రవి పెడుతున్నారంటే ఈ కుట్రను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ముందస్తు బెయిలు కోసం కోర్టులో దరఖాస్తు చేశాడు. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని స్వయంగా చెప్పిన దస్తగిరి బెయిలుకు.. వివేకా కుమార్తెగా సునీత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. వీళ్ల మధ్య ఉన్న ఎంత గాఢమైన లోపాయికారీ ఒప్పందం ఉందో తెలియటానికి ఇది చాలదూ!!.
నాన్నను అనైతికంగా ఓడించినా...
క్రికెట్ బెట్టింగుల్లో స్థానికంగా చిరపరిచితుడు. బెట్టింగుల్లో పోలీసులకూ దొరికాడు. 2017లో టీడీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కడపలో పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన వైఎస్ వివేకాను అనైతికంగా ఓడించాడు. చాలినంత మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా... నాటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి సాయంతో వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టాడు. కొందరిని బెదిరించి లోబరచుకుని తనకు బలం లేకున్నా వివేకాను ఓడించగలిగాడు.
తండ్రిని దుర్మార్గపు పద్ధతుల్లో ఓడించిన ఈ వ్యక్తి... ఇపుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడంటే ఏమనుకోవాలి? కేసు గురించి, కేసుద్వారా పొందాల్సిన రాజకీయ ప్రయోజనాల గురించీ వీరు నిత్యం సంప్రతింపులు జరుపుకొనే స్థాయిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కేసులో అవినాశ్‌పై బురద జల్లాలనుకున్న ప్రతిసారీ... మాట్లాడేది రవి. మాట్లాడించేది సునీత దంపతులు. బీటెక్ రవి తీవ్రమైన విమర్శలు చేయటం... దాన్ని ఎల్లో మీడియా విస్తతంగా ప్రచారం చేయటం... తరవాత చంద్రబాబు సహా టీడీపీ వాళ్లు ఇవే అంశాల్ని మాట్లాడటం వీళ్ల మోడెస్ ఆపరాండీ.
బాబు శిష్యుల కలయిక దేనికోసం?
కనెక్షన్ అనొచ్చు... రిలేషన్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సునీత, షర్మిల అందరూ ఇందులో భాగమే. ఆ రాష్ట్రమూ కాదు... ఆ పార్టీ కూడా కాదు. కానీ రేవంత్‌రెడ్డిని బీటెక్ రవి వెళ్లి కలిశాడంటే ఏమిటర్థం? అప్పటిదాకా తెలంగాణలోనే చావో రేవో అన్న షర్మిల... ఆ తరవాత కాంగ్రెస్‌లో చేరి నేరుగా ఏపీకి వచ్చి ఈ రకమైన మంత్రాంగం నడుపుతున్నారంటే ఏమనుకోవాలి? అయినా ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన.
మూడు నెలల తరవాత మరో ప్రభుత్వం వచ్చింది. పోలీసులూ వారే... దర్యాప్తు మొదలుపెట్టిందీ వారే. ఇంత స్పష్టంగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో లేఖ, ఫోన్ దాచిపెడితే వారిని ఎందుకు విచారించలేదు? రాజకీయాలకు, విమర్శలకు ఈ సంఘటనను వాడుకుని... అసలు కేసును నీరుగార్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం కాదా? అసలు ఇన్ని కుట్రలు చేసే బదులు బాబు నేరుగా టీడీపీ టికెట్టే ఇవ్వవచ్చు కదా? అపుడు ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా? కుట్రలకు, కుతంత్రాలకు విలువ ఉందో... లేక మంచి చేసిన ప్రభుత్వానికి విలువ ఉందో తేలిపోతుందిగా? ఏమంటావ్ బాబూ!!?
మొదట చూశారు... కుమార్తెకు చెప్పారు
వివేకా మృతదేహాన్ని మొదట చూసింది ఆయన పీఏ కృష్ణారెడ్డే. అక్కడే రక్తపు మరకలతో ఉన్న లేఖను, వివేకా మొబైల్ ఫోన్‌ను ఈయన తీసుకున్నాడు. అదే విషయాన్ని సునీతకు ఫోన్లో చెప్పాడు. సునీతతో పాటు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డికి (ఈయన సునీత భర్త రాజశేఖరరెడ్డికి, సౌభాగ్యమ్మకు సొంత సోదరుడు) కూడా చెప్పాడు. ఈ విషయం కాల్ రికార్డ్స్‌లోనూ వెల్లడయింది. వివేకా గురించి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగానే... ఆ లేఖను, వివేకా ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని కృష్ణారెడ్డిని ఆయన ఆదేశించారు. దీంతో ఆయన తదుపరి వచ్చి న బంధువులకు గానీ, పోలీసులకు గానీ ఎవ్వరికీ దీన్ని చూపించలేదు.
ఆ లేఖను చూపించి ఉంటే...దాన్లోని రక్తాన్ని చూసైనా ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారు కాదేమో. కానీ నర్రెడ్డి ఆదేశాలతో ఆయన ఎవ్వరికీ దీన్ని చూపించలేదు... చెప్పలేదు. ఈ విషయాన్ని సునీతే పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... కృష్ణా రెడ్డికి ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. లేఖ రాసింది తన తండ్రేనని, చేతిరాత ఆయనదేనని కూడా సునీత పోలీసు డీజీపీ ఎదుట అంగీకరించారు. నిజానికి రక్తంతో రాసిన ఆ లేఖను ఎవరు చూసినా... అది సహజ మరణం కాదని తేలిగ్గా అర్థమవుతుంది.
పోలీసులకో, అక్కడికి వచ్చి న వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగిన హత్య. అప్పటి పోలీసులు గానీ, సీబీఐ గానీ ఎందుకు ఈ లేఖ, ఫోన్ చూపించలేదని... ఫోన్లో నుంచి వివేకా– ఆయన రెండో భార్య షమీమ్ సంభాషణల్ని ఎందుకు డిలీట్ చేశారని, సునీతను దూషిస్తూ షమీమ్ లేవనెత్తిన అంశాలను ఎందుకు డిలీట్ చేశారని విచారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలు ఆ కోణాన్నే పట్టించుకోలేదెందుకో..!!.
ఈ హత్యలో ఎల్లో మీడియా చేస్తున్న మరో దు్రష్పచారమేంటంటే... ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందే అక్కడకు చేరుకున్నారనేది. నిజానికి అవినాశ్ అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనుకనే ఇలా జరిగిందని తనతో నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అదే శివప్రకాశ్ రెడ్డి అవినాశ్‌కూ ఫోన్ చేసి, ‘‘బావ చనిపోయారు. అర్జెంటుగా అక్కడకు వెళ్లు’’ అన్నారు.
దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికని అప్పుడే బయల్దేరిన అవినాశ్‌రెడ్డి.. వెంటనే యూ టర్న్ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆయన ఫోన్ చెయ్యకుండా ఉంటే అవినాశ్‌కు విషయం తెలిసేదే కాదు. ఆయన అక్కడకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయి ఉండేవారు. బావ చనిపోయారు.. వెళ్లమని చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్... ఎలా చనిపోయారనేది కానీ, లెటర్– ఫోన్ సంగతి కానీ చెప్పలేదు. ఇదంతా ఒక్క స్కెచ్ ప్రకారం జరిగిందనటానికి ఇంతకన్నా ఏం కావాలి?
ఆస్తి కోసం సునీతతో విభేదాలు
వివేకా మరణించిన నాడు షమీమ్‌కు, వివేకాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజుల్లో చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా సునీత గురించి జరిగిన ఎస్‌ఎంఎస్/సంభాషణలన్నీ ఆ తరవాత డిలీట్ చేసేశారు. ఎందుకు చేశారనేది దర్యాప్తు చేయనేలేదు. వివేకాకు, షమీమ్‌కు ఒక కుమారుడు ఉన్నాడనే అంశాన్ని సైతం రహస్యంగానే దాచిపెట్టారు.
షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు, బావమరిది ఏ రకంగా హింస పెట్టారు... చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఎలా నిర్వీర్యం చేశారో స్పష్టంగా చెప్పారు. దస్తగిరి తాను వివేకాను చంపటానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికినట్లు సాక్షులు చెప్పారు. కానీ దర్యాప్తులో ఆ అంశాలకు విలువే ఇవ్వలేదు. అంతేకాదు. తొలుత ఛార్జిషీట్లో వివేకాకు, ఏ1గా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డికి ఆర్థికపరమైన వివాదాలున్నాయని, వివేకాకు ఏ2 సునీల్ యాదవ్ తల్లితోను, ఏ3 ఉమామహేశ్వరరెడ్డి భార్యతోను అక్రమ సంబంధాలున్నాయని స్పష్టంగా ఉన్నప్పటికీ... ఆ కోణాన్ని తరువాతి ఛార్జిషీట్లలో పూర్తిగా తొక్కిపట్టేశారు.
దూరం 700 మీటర్లే
అవినాశ్, వివేకా ఇళ్ల మధ్య ఉన్న దూరం ఏరియల్ డిస్టెన్స్ అయితే 250 మీటర్లు. రోడ్డు మార్గాన అయితే 700 మీటర్లు. గూగుల్ టేకవుట్ పేరు చెప్పి వివేకా ఇంట్లో ఉన్న ఒక మనిషిని అవినాశ్ ఇంటికి వచ్చినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఆ రోజు ఉదయం అవినాశ్ ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగుకు బయలుదేరి పులివెందుల రింగ్‌రోడ్లోకి ప్రవేశించిన వెంటనే నర్రెడ్డి శివప్రసాద్ ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెప్పారు. వెంటనే ఆయన యూ–టర్న్ తీసుకుని తనతో ఉన్న 3 వాహనాలతో సహా వివేకా ఇంటికి వెళ్లారు. ఫోన్ వచ్చి న రెండు నిమిషాల్లోనే ఎలా వచ్చారనేది సీబీఐ ప్రశ్న. నిజానికి రింగ్‌రోడ్డు (కృష్ణాలయం) నుంచి వివేకా ఇంటికి రెండు నిమిషాలు చాలు. పైపెచ్చు ఉదయాన్నే రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా!.
Comments
Please login to add a commentAdd a comment