AP: ఆనంద హేల.. రైతుల ఇంట కొత్త కాంతి | Happiness among farmers with crop yields in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: ఆనంద హేల.. రైతుల ఇంట కొత్త కాంతి

Published Fri, Jan 14 2022 2:53 AM | Last Updated on Fri, Jan 14 2022 10:44 AM

Happiness among farmers with crop yields in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. అన్నదాతల లోగిళ్లు ధన ధాన్యాలతో, పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. ‘వరి’ సిరులతో ధాన్యం గాదెలు నిండుగా కనువిందు చేస్తుండడంతో అన్నదాత ఇంట పండుగ సందడి నెలకొంది. ముగింట్లో మద్దతు ధరతో సంక్రాంతి సంతోషాలు విరబూస్తున్నాయి. అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కడంతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. దీనికి తోడు రైతాంగాన్ని అన్ని విషయాల్లో ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తుండటంతో వ్యవసాయం పండుగైంది.  

వాస్తవ సాగుదారులను వెతికి మరీ రైతు భరోసా కింద మూడేళ్లలో గరిష్టంగా 50.58 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.6899.67 కోట్ల సాయం అందించింది. ఆర్బీకేల ద్వారా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కావాల్సినన్ని ఎరువులతో పాటు సబ్సిడీపై పురుగు మందులను అందించింది. కూలీల కొరత అధిగమించేందుకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచింది. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు గత మూడేళ్ల కంటే గరిష్టంగా 94.80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు సాగు చేశారు. కోత కొచ్చిన వేళ వైపరీత్యాలు కాస్త కలవరపెట్టినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సిరుల పంట పండించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన నల్ల తామర (త్రిప్స్‌ పార్విస్‌ పైనస్‌) వల్ల మిరప పంట దెబ్బతిన్నప్పటికీ మిగిలిన పంటల దిగుబడి బాగుండటంతో రికార్డు స్థాయిలో కోటి 74 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులను సాధించారు. 

ఉన్న ఊళ్లోనే పంట కొనుగోళ్లు
► ‘వరి’ పంట సిరులు కురిపించింది. 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు సాధించారు. ఇందులో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 8,651 ఆర్బీకేల్లో ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. 
► వీటి ద్వారా ఇప్పటి వరకు 2.70 లక్షల మంది రైతుల నుంచి రూ.3,756 కోట్ల విలువైన 19.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దాదాపు 1,00,283 మంది రైతులకు రూ.1470 కోట్ల జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 రోజుల్లోనే సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేస్తూ రైతులకు బాసటగా నిలిచింది. 
► చివరకు అకాల వర్షాలు, తుపాన్‌ వల్ల దెబ్బతిని రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ అండగా నిలవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది పత్తి, మిరప, మినుము, కందులు, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, టమాట తదితర ప్రధాన వాణిజ్య పంటలన్నీ కనీస మద్దతు ధరకు మించి ధర పలకడంతో రైతుల్లో కొత్త జోష్‌ సంతరించుకుంది. పత్తి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.10 వేల మార్క్‌ను అందుకుంది. 
► ఈ నేపథ్యంలో రైతులు సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇళ్లతో పాటు వ్యవసాయానికి తోడుగా నిలిచే కాడెద్దులు, యంత్ర పరికరాలను ముస్తాబు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యుల రాకతో పల్లెల్లో కొత్త సందడి నెలకొంది. పండుగ శోభాయమానంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

అన్ని విధాలా తోడుగా నిలిచాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రైతులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలబడడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి సిరుల పంట పండించారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలనే కొనుగోలు కేంద్రాలుగా మార్చి, పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందుకే మకర సంత్రాంతి పర్వదినాన్ని రైతులు శోభాయ మానంగా జరుపుకుంటున్నారు. రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు.  
 – కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి

వ్యవసాయం పండుగైంది
తెలుగు వారు జరుపుకునే మకర సంక్రాంతి వ్యవసాయానికి చిరునామా. తెలుగు రాష్ట్రాల్లో పండించిన పంట ఇంటికొచ్చే వేళ జరుపుకునే ఈ పండుగ వ్యవసాయ దారులు పండుగ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం ఇస్తోన్న తోడ్పాటుతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.     
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ 

20 రోజుల్లోనే డబ్బులొచ్చాయి
నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. డిసెంబర్‌ మొదటి వారంలో నేను రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాను. లోడును నేనే సొంతంగా తోలుకున్నాను. హమాలీ, రవాణా ఖర్చులు సైతం నాకు ఇచ్చేశారు. 20 రోజుల్లోనే నా ఖాతాలో రూ.7.80 లక్షలు జమయ్యాయి.   పండగ సమయంలో ఆరుగాలం కష్టం ఫలించి డబ్బులు చేతికి రావడం చాలా సంతోషంగా ఉంది. 
– వల్లభనేని సురేంద్ర కృష్ణ, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా

ఆలస్యం కావట్లేదు..
రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత 21 రోజుల్లో నగదు చెల్లింపులు చేస్తున్నాం. బ్యాంకు ఖాతాలో సమస్యలు తలెత్తితే తప్ప ఎక్కడా ఆలస్యం కావట్లేదు. రోజువారీ ధాన్యం సేకరణ ఆధారంగా నిర్ణీత కాలానికి అనుగుణంగా చెల్లింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఏప్రిల్‌ నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ధాన్యం సేకరణలో భాగంగా ఆర్బీకేల్లో చేస్తున్న ఐదు రకాల పరీక్షలను ఐఓటీ ఆధారంగా రియల్‌టైమ్‌లో ఒకేసారి చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– వీరపాండియన్, ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement