అన్నమే తింటున్నామా? | sakshi special story to fomer suside | Sakshi
Sakshi News home page

అన్నమే తింటున్నామా?

Published Wed, Jun 1 2016 12:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

అన్నమే   తింటున్నామా? - Sakshi

అన్నమే తింటున్నామా?

మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుందట.  అయితే ప్రతి ఉరితాడు మీద, ప్రతి పురుగుల మందు సీసా మీద  మనకు ఇంత ముద్ద పెడుతున్న రైతన్నల పేర్లు ఎందుకు ఉంటున్నాయి?  కడుపు నింపే అన్నం గింజకు, విధికి ఉన్న సంబంధమే... అన్నదాతకు, ఆత్మహత్యకు ఉండాలా?!  అన్నదాత అని, దేశబంధు అని, జై కిసాన్ అని... నినాదాలతో ఇంకా ఎంతకాలం రైతును మోసం చేస్తారు?  మనం తినేది పెరుగన్నం... వారికి మిగిల్చేది పురుగన్నమా?  రైతుల పట్ల నిర్లక్ష్యంతో ఇంకెన్నాళ్లు ఉరిసాగు చేస్తారు?  రైతు మన ఫ్యామిలీ మెంబర్ అని నమ్ముతున్నాం.  తనకు ఏ కష్టం వచ్చినా, మన ఫ్యామిలీ దన్నుగా ఉంటుందని విశ్వసిస్తున్నాం.  అందుకే ఇవాళ ఫ్యామిలీలో రైతు దుఃస్థితికి అద్దం పట్టే కొన్ని ఆత్మహత్య సంఘటనలను ప్రచురిస్తున్నాం.  ఈ చేదు నిజాలు, కఠోర సత్యాలు మీరు అర్థం చేసుకుంటే ఈ ఆత్మహత్యలు ఆగిపోతాయని మేం నమ్ముతున్నాం. తను ఒక మనిషని, తనకీ ప్రేమించే ఒక కుటుంబం ఉంటుందనీ, తనకీ ఆశలు, ఆశయాలు, చిన్ని చిన్ని కలలు ఉంటాయని మనం అర్థం చేసుకోకపోతే రైతు ఒక అంకెగా మాత్రమే మిగిలిపోతాడేమోనని భయపడుతున్నాం. జన్మనిచ్చిన తల్లి తర్వాత స్థానం రైతన్నది. ఆ అన్నకు ధైర్యం చెబుదాం. వెన్నుదన్నుగా ఉందాం. ఆ అన్న కోసం పోరాడదాం.  ఆ అన్న రుణం తీర్చుకుందాం... ‘అన్నం’ రుణం తీర్చుకుందాం.

 

 ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది. అలాగే, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల వేతనాల లాంటి ఖర్చులు దాదాపు 100 నుంచి 500 శాతం దాకా పెరిగాయి. దాంతో, దేశంలోని రైతులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, కొత్త మెథడాలజీతో రైతు ఆత్మహత్యలకు సంబంధించి ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంకలనం చేస్తున్న డేటా అంతా కఠోరమైన నిజాన్ని నీరు గార్చిన సమాచారమే! దీనివల్ల రైతుల దీనావస్థకు సంబంధించిన వాస్తవచిత్రం బయటకు కనపడడం లేదు.

 

పాలగుమ్మి సాయినాథ్
వ్యవసాయ రంగంపై నైపుణ్యమున్న ప్రముఖ జర్నలిస్టు- ప్రతిష్ఠాత్మక ‘రామన్ మెగసేసే’ అవార్డు గ్రహీత

 

రైతు చితి కాలుతోంది..!
పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వ హామీలు అమలు కాక, కాలం కలిసిరాక రైతు కుదేలవుతున్నాడు. పంటలను పోషించడానికి చేసిన అప్పుల కుప్పలు మిగులుతున్నాయి తప్ప ధాన్యం కుప్పలు కనిపించడం లేదు. ఇల్లాలి పుస్తెలమ్మి, పురుగు మందులు కొంటున్నాడు. ఆ మందులు పంటల చీడలను వదిలిస్తున్నాయో లేదో కానీ పంటనే నమ్ముకున్న రైతును మాత్రం బలి తీసుకుంటున్నాయి.


అప్పు చేసి పండించిన పంట చేతికి రాక వరదల పాలైతే కళ్ల ముందే అన్నపు గింజలు నీటి పాలవుతుంటే - రైతు కడుపు చెరువవుతోంది. కన్నీటిని కడుపులో దాచుకుని, చెట్టుకి తగిలించిన సద్దిమూటను తీసి పక్కన పెట్టి, ఆ చెట్టుకు ఉరితాడు బిగించుకుంటున్నాడు.

 
ఒక మరణం... ఊరికే రాదు. వేనవేల ఆక్రోశాల నుంచి పుడుతుంది. అంతకు మించిన సంకేతాలను జారీ చేస్తుంది. చిట్టచివరగా... అంతకంటే మరో మార్గం లేక... తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక... తల ఎత్తుకుని జీవించలేక... బతుకు ప్రయాణం చేతకాక తలవాల్చుతున్నాడు రైతు.

 
ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. ‘రైతన్నా! పంట వేశావా, ఎరువులకు డబ్బు కావాలా, బ్యాంకు రుణాలు వస్తున్నాయా, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర పలుకుతోందా, నీ రెక్కల శ్రమ, నువ్వు చిందించిన స్వేదానికి ప్రతిఫలంగా కనీసం నీ కడుపైనా నిండుతోందా...’ అని పట్టించుకున్న పాపాన పోవడం లేదు పాలకులు. పైగా ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అంటూ రైతు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. రైతు మీద కనీస గౌరవం లేని ఈ పాలకులు ఆ నాడు... ఎన్నికల నాడు... వేదికలెక్కి... మైకులు పుచ్చుకుని... ‘రుణమాఫీ చేస్తా’మని, ‘రైతును కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’మని హామీలెలా ఇచ్చారో? అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలకే తెలియాలి.

 
కంప్యూటర్ అన్నమై మన కంచంలోకి రాదు, కార్పొరేట్ కంపెనీల ఐడియాలు దుక్కిదున్ని సాగుచేయవు. మన కంచంలోకి ఇంత అన్నం రావాలంటే... ఏం చేసినా రైతే చేయాలి. రెసిషన్ వస్తే వ్యాపారాలు మందగిస్తాయి. కొనుగోళ్లు తగ్గుముఖం పడితే ఆటోమేటిగ్గా అమ్మకాలూ డల్ అవుతాయి. వ్యాపారులు మంచి కాలం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతుంటారు. కానీ... సాగు అలా కాదు, రైతు అలా చేయడు. ఏటా దుక్కి దున్నుతాడు. నేలను సిద్ధం చేస్తాడు. ఆకాశంలో వానచుక్కను చూసి నేలలో విత్తనం చల్లుతాడు. కరవు కాటు వేస్తుందో, వరద విలయతాండవం చేస్తుందోనని వెరవడు. తన వంతుగా తన పని తాను చేసుకుపోతాడు. ‘కర్మ చేయడం వరకే నీ వంతు. ఫలితం గురించి ఆలోచించకు నాకొదిలెయ్’ అంటూ శ్రీకృష్ణుడు చేసిన బోధ రైతుకి తెలియదు. అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరుతాడు.

 
అలాంటి రైతు పండించిన పంట ప్రకృతి విలయంలో నీటి పాలైతే, రైతు కన్నీటి పాలవుతాడు. ఆ రైతు కన్నీరు తుడవడానికి పాలకులకు చేయి రావడం లేదు. ‘ప్రభుత్వం అండగా ఉంటుంది, బ్యాంకు రుణం ఇస్తుంది, మళ్లీ పంట వేసుకో’ అని భుజం తట్టే చెయ్యి కరవైంది. అందుకే... రైతు ఇంట పొయ్యిలో నిప్పు రాజుకోవడం లేదు. చితిమంటలు వెలుగుతున్నాయి.             - వాకా మంజులారెడ్డి

 

అప్పుల ఊబిలో...  ఆంధ్ర రైతు
దేశం మొత్తం మీద 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వీరి శాతం 92.9 శాతం. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తేల్చిన లెక్కలివి. ప్రతి కుటుంబానికూ ఉన్న సగటు అప్పు జాతీయ స్థాయిలో రూ. 47 వేలు. అదే ఆంధ్రాలో 1,23,400 రూపాయలు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు రాకపోవడం, తీవ్రమైన ప్రభుత్వ వైఫల్యాలు.

 
ఆ 13 ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం సాధ్యమేనా?

వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పరిశ్రమకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఉంటుంది. ఏటా సుమారు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే వ్యవసాయదారులకు మాత్రం ఉండదు. ఎంత చిత్రమో కదా.. పరిశ్రమలు స్థాపిస్తే వారం, పది రోజుల్లో అనుమతించేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే విధానాన్ని వ్యవసాయంలో పెట్టడానికి మాత్రం ముందుకు రాదు. అమలు చేయదు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, మనోవేదనతో అన్నదాత ఆత్మహత్య చేసుకుంటే నిర్ధారణకు 13 ధ్రువీకరణపత్రాలు కావాలి. వీటిని సమర్పించడం పేద రైతు కుటుంబాలకు సాధ్యమేనా? ఈ సర్టిఫికెట్లన్నీ ఒకే చోట కల్పించే మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు అన్వేషించడం లేదు?

 

2004 జూన్ 1 వైఎస్ తెచ్చిన చరిత్రాత్మక జీవో 421
రైతు ఆత్మహత్యల నివారణకు 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 జూన్ 1న చరిత్రాత్మక జీవో 421ను తీసుకువచ్చారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు అపర భగీరథుడు తెచ్చిన జీవో అది. మనోవ్యధతో ఆత్మహత్యలు చేసుకునే వారి కుటుంబాలకు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ అమలుకు ఉద్దేశించిన జీవో అది. అప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకు ముందు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సైతం రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.


చేసుకున్నది ఆత్మహత్యేనని ఋజువు చేసుకోండి!
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అది ప్రభుత్వం గుర్తించడానికి ఏకంగా 13 రకాల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇవన్నీ ఒక పట్టాన అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వాటిని ప్రభుత్వం తొమ్మిదికి కుదించనుంది. ప్రస్తుతం ఈ కసరత్తు నడుస్తోంది. ఇంకా జీవో వెలువడలేదు.


కొత్తగా ప్రతిపాదించనున్న పత్రాలు ఇవి...
1. పోలీసు ఎఫ్‌ఐఆర్
2. శవ పరీక్ష నివేదిక
3. మరణ ధ్రువీకరణ పత్రం
4. వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకున్నట్టుగా ప్రామిసరీ నోటు వంటి రుణ పత్రాలు (లోన్ డాక్యుమెంట్లు).

 
ఒకవేళ ఈ పత్రాలు లేకుంటే రైతులు రుణం తీసుకున్నట్టుగా సాక్ష్యాధారాలు చూపించేందుకు ఈ కింది వాటిని వినియోగించవచ్చు. అవి... ఎ)తనఖా రశీదులు బి) విత్తన వ్యాపారులు, ఎరువుల డీలర్ల నుంచి తీసుకున్న వాటికి సంబంధించిన రశీదులు సి) ఇరుగు పొరుగు, పంచాయితీ సభ్యులు, కమ్యూనిటీ పెద్దలు, వీఆర్‌ఓ, సీబీవోలు లేదా వీవోల నుంచి రూఢిపరుచుకోవడం.

5. బ్యాంకు రుణపత్రాలు (స్వయం సహాయక సంఘాల రుణాలు సహా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న రుణాలన్నింటినీ ఆత్మహత్యల నిర్ధారణ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యులు.. అంటే తల్లితండ్రులు, భార్యాభర్తలు, పెళ్లికాని పిల్లలు)
6. భూమి ఉన్న రైతు విషయంలోనయితే... ఆత్మహత్య చేసుకున్న రైతు తర్వాత వ్యవహారాలను పర్యవేక్షించే కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు) ధ్రువీకరణ పత్రం
7. కౌలు రైతు విషయంలోనయితే...

 ఎ. సాగుదారుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండాలి

 బి. రుణ అర్హత పత్రం

 సి. రాతపూర్వక కౌలు ఒప్పందం

 డి. మార్కెట్ యార్డు అధికారిక రశీదులు

 ఇ. వీఆర్‌ఓ/సర్పంచ్ /పంచాయితీ సభ్యులు/కమ్యూనిటీ పెద్దలు/సీబీఓలు చెప్పే సాక్ష్యం. ఫలానా భూమిని సంబంధిత రైతు కౌలుకు చేస్తున్నారని చెప్పినా ఆత్మహత్యల నిర్ధారణ కమిటీ పరిశీలించాలి.

 8. కుటుంబ సభ్యుని పత్రం

 9. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement