
ఆమనగల్లు(కల్వకుర్తి): పండించిన పంటను అమ్ముకుందామని హైదరాబాద్‌కు బయలుదేరిన ఇద్దరు రైతులను మృత్యువు కబళించింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లికి చెందిన చిందం ముత్తయ్య (46), తాళ్లపల్లికి చెందిన కెంచ పర్వతాలు (25) కీర దోసకాయను హైదరాబాద్ మార్కెట్‌లో విక్రయించడానికి ఆదివారం రాత్రి బొలెరో వాహనంలో నింపుకుని బయలుదేరారు. వీరి వాహనం రాత్రి 11.40 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ గేటు సమీపంలోకి రాగానే ఆమనగల్లు వైపునకు వేగంగా వస్తున్న టాటా జీజేఎస్ వాహనం ఢీకొట్టింది.
ఘటనలో రైతులు ముత్తయ్య, పర్వతాలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయి, టాటా డ్రైవర్ డేరంగుల రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆమనగల్లు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న రైతుల మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
పెద్దవూర: వ్యవసాయ పనులకు చేసిన అప్పును తీర్చే మార్గం లేక ఓ రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధి చింతపల్లి గ్రామానికి చెందిన వెలుగు యాదగిరి (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఎకరం భూమితోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తిని సాగు చేస్తున్నాడు. పెట్టుబడులకు రూ.5 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి సరిగా లేకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.