ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అందలాలెక్కిన పాలకుల సాక్షిగా దేశంలో రైతుల బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య మూడు రాష్ట్రాల్లో జరిగిన వరస బలిదానాలను గమనిస్తే రైతుల్లో ఎంతటి నిరాశానిస్పృహలు అలుముకున్నాయో అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం రఘునాథపల్లి గ్రామంలో సోమవారం రాత్రి శివారెడ్డి అనే రైతు నిప్పంటించుకుని కన్నుమూశాడు. కేరళలో రెండు రోజులక్రితం 64 ఏళ్ల విజయన్ అనే రైతు కట్టెలతో చితి పేర్చుకుని అందులో దూకి మరణించాడు. మరో ఉదంతం మహారాష్ట్రకు సంబంధించింది.
ముంబైలోని ఆ రాష్ట్ర సెక్రటేరియట్ ఎదుట మూడు రోజులక్రితం పురుగుల మందు తాగిన 27 ఏళ్ల యువకుడు మాధవ్ కదమ్ ఆస్పత్రిలో చనిపోయాడు. ఇదే రాష్ట్రంలో మొన్న జనవరిలో ఒక రైతు తన ‘అంతిమయాత్ర’కు రావాలని అందరినీ పిలిచి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. ఊళ్లో ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటనలకు సంబంధించి ఏ ప్రభుత్వమూ మాట్లా డిన దాఖలాలు లేవు. అన్నదాత కళ్లు చెమ్మగిల్లినంతనే స్పందించాల్సిన పాలకులు దుర్మార్గమైన మౌనాన్ని పాటిస్తున్నారు. ఏమీ జరగనట్టు నటిస్తున్నారు.
2014 ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన హామీలను ఎవరూ మర్చిపోలేదు. రైతుల రుణాలన్నిటినీ పూర్తిగా మాఫీ చేస్తానన్నది అందులో ముఖ్యమైనది.
అలా హామీ ఇవ్వడానికి గల కారణాన్ని కూడా అప్పట్లో ఆయన వివరించారు. ‘మీ కోసం’ పేరిట రాష్ట్రమంతా తాను జరిపిన పాదయాత్రలో రైతుల దుస్థితి తనకు అవగాహనకొచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. రైతు రుణాల మాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తానన్నారు. రెండేళ్లు గడిచాక చూస్తే రైతులకు ఒరిగిందేమీ లేదని స్పష్టమైంది. ‘రైతు రుణాలన్నిటినీ...’ అనేమాట గాలికి కొట్టుకు పోయింది. లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న షరతు పుట్టుకొచ్చింది. కనుక బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాలకు అది వర్తించలేదు. దానికి అనుబంధంగా అనేకానేక నిబంధనలూ అమల్లోకొచ్చాయి.
ఫలితంగా లక్షలాదిమంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. మొత్తంగా రూ. 17,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పిన సర్కారు గతేడాది రూ. 4,230 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. రెండో విడత ప్రకటించిన రూ. 4,086 కోట్లనూ రెండు వాయిదాల్లో విడుదల చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలివ్వడాన్ని గణనీయంగా తగ్గించే శాయి. బ్యాంకులు మొండిచేయి చూపినందువల్ల ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు రూ. 8,000 కోట్ల మేర ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పు చేయాల్సివచ్చిందని ఒక అంచనా. రైతు శివారెడ్డి అయినా, మరికొందరు రైతులైనా ప్రాణాలెందుకు తీసుకోవాల్సివచ్చిందో ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఇంత ఘోరమైన పరిస్థితులు నెలకొంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏం ఎరగనట్టు రాష్ట్రంలోని రైతులకు రుణాలివ్వరేమని బ్యాం కర్లపై ఉరుముతున్నారు. వారి తీరువల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆరోపిస్తు న్నారు. వంచనకిది పరాకాష్ట.
మహారాష్ట్రలో బీజేపీ రుణమాఫీ ప్రకటించకపోవచ్చుగానీ వ్యవసాయ సంక్షో భాన్ని నివారించి రైతులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని 2014 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. ఆ హామీ రైతుల జీవితాల్లో తెచ్చిన మార్పేమీ లేదు. వారి కష్టాలు కొంచెమైనా గట్టెక్కలేదు. ఫలితంగా ఈ ఏడాది జనవరి తర్వాత చూసినా అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 124కు మించింది. ఈ స్థితికి సిగ్గుపడాల్సిన బీజేపీ ఎంపీ గోపాల్‌శెట్టి ఆత్మహత్యలు ఫ్యాషన్‌గా మారాయని వ్యాఖ్యానించారు. పైగా రైతుల ఆత్మహత్యలన్నీ ఆకలికో, రుణబాధలకో సంబంధించినవి కావని తర్కించారు. సంక్షోభం మూలాలు ఎక్కడు న్నాయో, తమవైపుగా జరుగుతున్న తప్పేమిటో తెలుసుకోలేని పరిస్థితుల్లో పాలకు లున్నారని ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి.
మానసిక సమస్యలు అధిగ మించడమెలాగో రైతులకు తెలియజెప్పేందుకు సినీ నటి దీపికా పదుకొనే సాయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించి దీన్ని ధ్రువపరిచారు. బహుశా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నిర్వాకం ఇలా ఉన్నదని గ్రహించాడేమో...ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొన్న కేరళ రాష్ట్రంలో రైతు విజయన్ ఏకంగా చితి పేర్చుకుని అందులో దూకి చనిపోయాడు. మరణానికి ముందు ఆయన మూడు పేజీల లేఖ కూడా రాశాడు. ఆయన ఎనిమిదెకరాల రైతు. మొత్తంగా తనకు రూ. 15 లక్షల రుణాలుంటే అందులో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్నదే ఎక్కువ. తన సమస్యలకు చావే పరిష్కారమన్న నిర్ణయాని కొచ్చాడు.
గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకు న్నారు. అందరిదీ ఒకటే సమస్య...అధిక రుణభారం. ఈ విషయంలో ఏం చెబుతారని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మొన్న జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే రైతులకు సంబంధించి ఎనిమి దేళ్లనాడు రూపొందిన జాతీయ విధానాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం జవాబిచ్చింది. నిపుణుల కమిటీలకూ, టాస్క్ ఫోర్స్‌లకూ, అవి ఇచ్చే నివేదికలకూ మన దేశంలో కొదవలేదు.
కావల్సిందల్లా ఆచరణ. ఎన్నడో 2007లో రూపొందిన జాతీయ రైతు విధానం మాటెలా ఉన్నా పంజాబ్, కేరళ, కర్ణాటకవంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే వ్యవసాయ విధానాన్ని రూపొందించాయి. ఫలితం మాత్రం శూన్యం. దశాబ్దాలుగా ఈ దేశంలో పాలకులు అనుసరించిన ఆర్ధిక విధానాల ఫలితంగా వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. దేశంలో ఇప్పటికీ అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ రంగాన్ని ప్రభుత్వా లన్నీ ఒక పథకం ప్రకారం దెబ్బతీశాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతుంటే వ్యవసాయ ఉత్పత్తులకు కనీసమైన గిట్టుబాటు ధరను కల్పించలేకపోతున్నాయి. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభు త్వాలు ముందుగా తమ విధానాల్లోని లోపాలను సరిచేసుకోవాలి. సాగు లాభ సాటిగా మారేలా, అన్నదాత తలెత్తుకు తిరిగేలా తమ చర్యలుండాలి. అప్పుడు మాత్రమే ఈ మరణమృదంగం ఆగుతుంది.
అన్నదాతల బలిదానం
Published Thu, Mar 31 2016 1:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement