ప్రభుత్వ అసమర్థత వల్లే ఆత్మహత్యలు
భువనగిరి: రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు మండల కేంద్రంలో శుక్రవారం రైతుభరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానా మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ లోపభూయిష్టంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలనే నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే రైతుభరోసా యాత్ర చేపట్టామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అవగాహన లేని అసమర్థ, అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. రైతు రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయడానికి రూ.8,500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. ఫాంహౌస్‌లో నిద్రించే ముఖ్యమంత్రికి సమీప గ్రామాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని శాసనమండలి నేత షబ్బీర్‌ఆలీ అన్నారు.
కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీలు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, వివేక్, బలరాంనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
పర్యటన సాగిందిలా: నల్లగొండ జిల్లాలో రైతు భరోసా యాత్ర బీబీనగర్ నిమ్స్ నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకబస్సులో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ నేతలంతా వచ్చారు. వారికి భువనగిరి మండలం రాయగిరి వద్ద డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆధ్యర్యంలో స్వాగతం పలికారు. ఆత్మకూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు పొన్నగాని సంతోష్‌కుమార్ భార్య వాణికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అక్కడే రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అక్కడి నుంచి ఆలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
వైఎస్ హయాంలో బాగుండేది
కోరే బీరయ్య
ఆత్మకూరు(ఎం): నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. రైతు కోరె బీరయ్యకు పీసీసీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది
ఉత్తమ్: ఎన్నెకరాల్లో వ్యవసాయం సాగు చేశావు.
బీరయ్య: ఐదు ఎకరాలు ఉంది. అందులో పత్తి, వరి పంటలు వేశాను.
ఉత్తమ్ : దిగుబడి ఎలా ఉంది.
బీరయ్య: దిగుబడి మామూలుగానే ఉంది.
ఉత్తమ్ : మద్దతు ధర ఎలా ఉంది.
బీరయ్య: మద్దతు ధర మామూలుగానే ఉంది. వరికి ధర రూ.1,300లకు తీసుకుంటున్నారు. పత్తి రూ.3,500 అడుగుతున్నారు. ఇంతవరకు పత్తి గుర్తింపుకార్డులు ఇవ్వలేదు.
ఉత్తమ్ : వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది.
బీరయ్య: అధ్వానంగా ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందినవి. ఇప్పుడు రుణమాఫీని మూడుసార్లు ఇస్తామనడంతో ఇబ్బందులు పడుతున్నాం.